రైతు నేత శరద్ జోషి కన్నుమూత
పుణె : ప్రముఖ రైతు నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు శరద్ జోషి(81) శనివారం పుణెలో కన్నుమూశారు. మహారాష్ట్రకు చెందిన జోషి రైతు సంక్షేమం కోసం అలుపెరుగని పోరాటాలు చేసి రైతు బాంధవుడిగా పేరు గాంచారు. రైతుల పక్షాన పోరాడేందుకు 1979లో షెట్కారీ సంఘటన్ పేరుతో సంస్థ స్థాపించారు. అలాగే స్వతంత్ర భారత్ అనే పార్టీని కూడా స్థాపించారు. ముఖ్యంగా 1980లో ఉల్లి మద్దతు ధర కోసం జోషి జరిపిన ఉద్యమం దేశ వ్యాప్తంగా అందరినీ ఆకర్షించింది. ఆర్ధికవేత్తగా ప్రఖ్యాత జర్నలిస్టుగా కూడా సమాజానికి ఎనలేని సేవలందించారు.
2004 నుంచి 2010 వరకు రాజ్యసభ సభ్యునిగా పనిచేసిన జోషికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మరణం రైతు లోకానికి, రైతు ఉద్యమాలకు తీరని లోటని భారతీయ కిసాన్ యూనియన్ నేత భూపిందర్ సింగ్ అన్నారు. ఆయన మృతి పట్ల వివిధ పార్టీల నేతలు, రైతు సంఘాల నేతలు సంతాపం వ్యక్తం చేశారు.