SHARAD JOSHI
-
అన్నీ ఉన్నవారికీ కావాలి కోటా!
రాజకీయ పలుకుబడి గల మరాఠాలు విద్యాసంస్థలు, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కోరడం విచిత్రం. గ్రామం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకు శాసించేది వారే. విద్యా సామ్రాజ్యాల స్వాధీనం లేదా ఫీజులలో రాయితీలు వారు కోరడం లేదు! మరాఠాలు ఒకప్పటి యుద్ధ యోధులు, రైతులతో కూడిన వారు. అలా అని ఆ రెండు వర్గాలూ పూర్తిగా వేరు వేరుగా ఉండేవీ కావు. మహారాష్ట్ర అధికార వ్యవస్థలో కీలక స్థానం మాత్రం మొత్తంగా మరాఠాలదే. వారే తరచుగా ప్రభుత్వానికి నేతృత్వం వహించేవారు. జనాభాలో దాదాపు మూడోవంతు ఉంటారు. అయినా వారికి పలు సమస్యలున్నాయి, అందులో ఒకటి వారికి రిజర్వేషన్లు లేకపోవడం. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి డిమాండ్లనే చేస్తున్న జాట్లు, పటేళ్ల లాగే మరాఠాల తీరూ విడ్డూరమే. ఆగస్టు నుంచి అపూర్వమైన రీతిలో వారు తమ డిమాండ్లను వ్యక్తం చేయడం ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 16 చోట్ల నినాదాలు, మైక్రోఫోన్లు లేకుండా ప్రదర్శనలను నిర్వహించారు. ఒక్క నినాదం కూడా వినరాలేదు. ఒక్క నేతైనా వేదిక మీద మైక్ అందుకున్నది లేదు. కోటాలు కావాలని, దళితులపై అత్యాచారాల చట్టం దుర్వినియోగాన్ని అరికట్టాలని, ఒక మరాఠీ బాధితురాలుగా ఉన్న సామూహిక అత్యాచారం కేసును ఫాస్ట్‌ట్రాక్‌పై తేల్చా లని ప్లకార్డులను ప్రదర్శించారు. పలు విధాలుగా ఈ ప్రదర్శనలు అపూర్వమైనవి. ఒకటి, వాటిలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కళ్లారా చూస్తేనే అది నమ్మగలం. లక్షలను రెండు అంకెల్లో చెబుతున్నట్టు మీడియా వారి సంఖ్యను తక్కువగా పేర్కొంది. రెండు, ఏ రాజకీయ నేతో లేదా ఏ రాజకీయ పార్టీనో సంఘటితపరచడం లేదా నేతృత్వం వహిస్తు న్నట్టు కానరాలేదు. మూడు, అధికారులతో సంఘర్ష ణకు దారి తీసిన ఘటన ఒక్కటీ జరగలేదు. ప్రదర్శకుల మధ్య సైతం అవాంఛనీయమైనది ఏదీ సంభవించ లేదు. నాయకులంతా అస్పష్టంగానే గోచరమయ్యారు. అంతా రాజకీయాలకు అతీతంగా ఒకే విధమైన ప్రయో జనాలు, ఉద్దేశం ఉన్నవారు. ప్రదర్శనల తేదీలు, వేళలు, స్థలాలు, మార్గాలు, ఏర్పాట్లు, వగైరా అన్నీ వాట్సాప్ గ్రూపుల ద్వారానే అందరికీ చేరాయి. భాగ స్వాములైన వారిలో ప్రతి ఒక్కరూ మరో 100 మందిని సమీ కరిస్తామని వాగ్దానం చేశారు. వేదికలనుంచి నల్ల దుస్తులు ధరించిన బాలికలు మరాఠాల డిమాండ్ల చదివి వినిపించారంతే. అవన్నీ ప్లకార్డులపై ఉన్నవే. అధికారులు తమ మధ్య చీలికలను సృష్టించడానికి యత్నిస్తారని నాయకత్వం తెరవెనుకనే ఉండిపోయింద నేది స్పష్టమే. అయితే, రాజకీయవేత్తలు వారిలో తప్పక ఉన్నారు. అవసరమైన డబ్బును, సీసాల్లోని మంచినీటిని వారే సమకూర్చారు. రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న వారు తెరవెనుక ఒకరిని మించి మరొకరు ఈ ప్రదర్శన లకు సహాయం అందించాలని పోటీపడి ఉంటారు, ఎవరికి వారే పైచేయి సాధించాలని యత్నించి ఉంటారు. అందువల్ల లాభపడింది ప్రదర్శకులు మాత్రమే. కీలక సమస్యలపై రాజకీయాలను దూరంగా ఉంచే ధోరణి ఇంతకు ముందు కూడా మహారాష్ట్రలో ఉంది. దివంగత శరద్ జోషి ఈ విధంగానే అందరినీ షేత్కారీ సంఘటనలోకి సమీకరించి, నేతృత్వం వహిం చారు. ‘‘ఈ ప్రాంగణంలోకి ప్రవేశించేటప్పడు మీరు మీ రాజకీయ పాదరక్షలను బయటే వదలి రండి’’ అంటూ రైతులనుద్దేశించి ప్రకటిస్తూ ఆయన తన సభలను ప్రారంభించేవారు. అయితే ఆయనే ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు, తాను పరిహసించిన పార్టీల మద్దతుతోనే రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1980లలో దళితులు కూడా రిపబ్లికన్ పార్టీలోని చీలికలకు అతీతంగా ఏకమై, తమను అవమానాలకు గురిచేస్తున్న మరాఠాలకు వ్యతిరేకంగా సమరశీల పోరా టాన్ని నిర్వహించారు. మరఠ్వాడా విశ్వవిద్యాలయం పేరును బాబాసాహెబ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంగా మార్పించారు. దళితులు తమపై అత్యాచారాల చట్టాన్ని ప్రయోగించకుండా చట్టాన్ని మార్చాలని నేడు మరా ఠాల కోరికల జాబితా కోరుతోంది. దీంతో ఒక సంక్ర మణం పూర్తయిందని అనుకోవచ్చు. రాజకీయ పలుకుబడి కలిగిన మరాఠాలు విద్యా సంస్థలు, ఉద్యోగాలలో రిజర్వేషన్లును కోరడం అతి విచిత్రం. గ్రామీణ ప్రాంతాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకు అధికారాన్ని శాసించేది వారే. పేరుకు ఒక వీపీ నాయక్ లేదా సుధాకర్ నాయక్ లేదంటే మనోహర్ జోషి లేదా దేవేంద్ర ఫడ్నవీస్ అప్పుడప్పుడూ ముఖ్య మంత్రి కావచ్చు. కాసులు కురిపించే విద్యాసంస్థలకు యజమానులు, నిర్వాహకులుగా ఉన్నవారు కూడా మరాఠాలకు చెందినవారే. కాలక్రమంలో మరాఠాల అధికారం పదును సరిగ్గా ఎప్పుడు తగ్గిందో చెప్పడం కష్టం. అధికార చట్రానికి, ప్రగతికి తమను దూరంగా ఉంచుతున్నారన్న భావన ఏర్పడింది. తమ కులానికే చెందిన పెద్దలు రాజకీయాలను వ్యాపారంగా నిర్వహిం చినా... మరాఠాల ఆర్థిక ప్రయోజనాల పట్ల వారు శ్రద్ధ వహిస్తున్నంతకాలం దాన్ని పట్టించుకోరు అన్నట్టుంది. విద్యా సామ్రాజ్యాలను స్వాధీనం చేసుకోవాలని లేదా ఫీజులలో రాయితీలు ఇవ్వాలని వారు కోరడం లేదు. అది ఆసక్తికరం అనడం ఈ విషయాన్ని తక్కువ చేసి చెప్పడమే అవుతుంది. - మహేష్ విజాపుర్కార్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ మెయిల్ : mvijapurkar@gmail.com -
తన కాలానికి ముందు నడిచిన రైతు నేత
నివాళి ‘రైతు ఇంక ఏమాత్రం రైతుగా మిగలని రోజు వస్తుంది’ అంటూ కర్నూలుకి చెందిన రాజకీయనేత మద్దూరి సుబ్బారెడ్డి తరచుగా చేస్తూవచ్చిన హెచ్చరికను నేను శరద్ జోషితో పంచుకున్నప్పుడు నాతో ఏకీభవించారు. ’మీరు కర్నూలులో ఆ సత్యాన్ని గ్రహించారు. నేను కూడా ఆ విషయాన్నే చెబుతూ వస్తున్నాను’ అన్నారు. కానీ ఈ హెచ్చరికల్లో వేటినీ ఎవరూ పట్టించుకోలేదు. వినిపించుకోలేదు. రాజకీయ పక్షపాతం నేపథ్యంలో రైతు సమస్యలు పరిష్కారం కావని జోషి నిత్యం చెబుతూనే వచ్చారు. మహారాష్ట్రలోని పుణేలో 80 ఏళ్ల వయస్సులో కన్నుమూ సిన రైతు నేత శరద్ జోషి కాలానికి ముందున్న వ్యక్తి. వ్యవసాయ ఉత్పత్తులకు న్యాయమైన ధరలు చెల్లించాలనీ, అదే సమయంలో, తాను ఏ పంటలు పండించుకోవాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ రైతుకు ఉండాలని ప్రబోధించిన వ్యక్తి జోషి. ప్రభుత్వం ఎప్పుడో ఒకసారి నామమాత్రపు పెంపుదలతో కూడిన ధాన్య సేకరణ ధరలను నిర్ణయిస్తుం డటంవల్ల వ్యవసాయానికి ఆటంకం కలగడమే కాకుండా వ్యవసాయాన్ని ప్రతిఫలం లేనిదిగా మార్చివేస్తోందని ఆయన నొక్కి చెప్పారు. ‘‘మాకు సరైన ధర చెల్లించండి. మా గ్రామాల్లో ప్రభు త్వాన్ని మేం కోరుకోం. మంచి వేతనం పొందే ఉపాధ్యాయు లతో మేం మా సొంత ప్రైవేట్ పాఠశాలలను నడిపించుకో గలం. పనిచేయని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులకు బదులుగా ఫీజులు చెల్లించి మరీ వైద్యసేవలు పొందగలం’’ అంటూ జోషి హేతుపూర్వక వివరణ ఇచ్చారు. రైతులు గడుపుతున్న జీవితం తీరును ఆయన మాటలు చెబుతాయి. ఆయన ప్రతిపాదన వడ్డీవ్యాపారుల పీడన నుంచి రైతు లోకాన్ని బయట పడేస్తుంది. 1980లలో ఉల్లి ధరలు కుప్పగూలినప్పుడు, నాసిక్ సమీపంలోని లాసల్గావ్ మార్కెట్‌ను శరద్ జోషీ మూసివే యించారు. అది దేశంలోనే అతి పెద్ద ఉల్లి మార్కెట్. రైతులు తాము అమ్మలేని ఉత్పత్తులను వెనక్కు తీసుకెళ్లేందుకు ట్రక్కర్లకు డబ్బులు కూడా చెల్లించలేక నిరసన తెలుపుతూ తమ వ్యవసాయ ఉత్పత్తులను రహదారుల మీదే పడవేసి వెళ్లిపోయేవారు. అప్పుడే ఆయన స్వేచ్ఛా మార్కెట్‌ను సమ ర్థించే సిద్ధాంతవేత్తగానే కాకుండా, ఆందోళనకారుడిగా మారి రైతు సమర్థకుడిగా వెలుగులోకి వచ్చారు. రాజకీయ నేతలు, రాజకీయాలు రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయన్నది ఆయన అభిప్రాయం. తాను అన్నమాటలో మరీ అంత తప్పేమీలేదు. సరిగ్గా ఏడాది తర్వాత ఉల్లి ధరలు చుక్కలంటినప్పుడు, శరద్ జోషి పేరును పోలి ఉన్న శరద్‌పవార్ ‘అధిక ధరలు ఉన్నాయంటే రైతులకు ప్రయోజనం కలుగుతోందని అర్థం’ అంటూ పరా చకాలాడారు. పవార్ స్పష్టంగానే వినియోగదారుల తోలు వలుస్తున్న మధ్య దళారీలను మర్చిపోయారు. జోషి ఉద్దేశంలో తగిన ధరలు అంటే రైతుల సంక్షేమం పునాదిగా ఉండాలి. ఎం.ఫిల్ పూర్తి చేసి భారతీయ తపాలాశాఖ ఉద్యోగిగా ఉండి ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ అయిన యూనివర్శల్ పోస్టల్ యూనియన్‌లో పనిచేసిన ఈయన రైతు సమస్యను తన జీవిత లక్ష్యంగా ఎందుకు ఎంచుకున్నట్లు? ఎందుకంటే ఐక్యరాజ్యసమితిలో దశాబ్దం పాటు పనిచేసిన కాలంలో వ్యవసాయ రుణాల కోసం భారతీయ నేతలు బిక్షాపాత్ర పట్టుకుని తిరగటాన్ని జోషి చూస్తూవచ్చారు. అయినా రైతులు ఎందుకు సంతోషంగా ఉండలేకపోయారు? వ్యక్తి గత వ్యవసాయ సంక్షోభానికి పరిష్కారంగా రైతులు ఆత్మ హత్యలకు పాల్పడటానికి ముందు రోజుల మాట ఇది. తర్వాత ఆయన భారత్‌కు తిరిగివచ్చి భూమి కొను గోలు చేసి వ్యవసాయం ప్రారంభించారు. బతకడానికి వ్యవ సాయం తగిన వృత్తిగా లేదేమో అన్న భయాలను ఆయన పక్కన బెట్టేశారు. ‘రైతు ఇంక ఏమాత్రం రైతుగా మిగలని రోజు వస్తుంది’ అంటూ కర్నూలుకి చెందిన రాజకీయనేత మద్దూరి సుబ్బారెడ్డి తరచుగా చేస్తూవచ్చిన హెచ్చరికను నేను జోషితో పంచుకున్నప్పుడు ఆయన నాతో ఏకీభవిం చారు. ‘మీరు కర్నూలులో ఆ సత్యాన్ని గ్రహించారు. నేను కూడా ఆ విషయాన్నే చెబుతూవస్తున్నాను’ అన్నారు. కానీ ఈ హెచ్చరికల్లో వేటినీ ఎవరూ పట్టించుకోలేదు. వినిపిం చుకోలేదు. గ్రామాల్లో తాను నిర్వహించిన లెక్కలేనన్ని సమావే శాల్లో జోషీ ప్రారంభంలోనే చెబుతూ వచ్చిన మాటేమి టంటే, రాజకీయ పక్షపాతం నేపథ్యంలో రైతు సమస్యలు పరిష్కారం కావనే. తన కేంపెయిన్‌లో చేరదల్చుకున్నవారు ‘‘తమ రాజకీయ తొడుగులను, జెండాలను ఇంటివద్దే వది లేసి రావాల’’ని ఆయన తేల్చి చెప్పేవారు. రైతు సమస్య లపై పోరాట నిమగ్నత రాజకీయ విశ్వాసాలకు అతీతంగా ఉండాలన్నది ఆయన అభిప్రాయం. అయితే తనకు తాను గా విధించుకున్న నిబంధన నుంచి ఆయనే తప్పుకోవాల్సి వచ్చింది. తన పోరాట రంగస్థలాన్ని దేశంలో ప్రధాన పంచాయతీ అయిన పార్లమెంటుకు తీసుకుపోవడానికి ఆయన శివసేన మద్దతు కోసం కూడా ప్రయత్నించారు. ఒకప్పుడు ఇదే శివసేనను ఆయన ‘మతతత్వం’ పునాదిగా పెరిగిన ‘రాబందులు’గా వర్ణించారు. లోక్‌సభలో రైతు సమస్యకు అనుకూల ఓటును పొంద డానికి పలు ప్రయత్నాలు చేసిన తర్వాత ఆయన రాజ్యసభ తలుపులు తట్టారు. కమ్యూనిస్టులకు లాగే ఈయన కూడా రైతులను నిరంతరం సమీకరించడంపైనే విశ్వాసం పెట్టుకు న్నారు. ఆయన వెన్నంటి నడిచినప్పుడు తాను నిర్వహించే కేంపెయిన్ ఎంతో భిన్నంగా ఉండేది. రైతు సమావేశాలను ఎక్కడైనా ఇళ్లలోపలే నిర్వహించేవారు. పెద్ద గదిలోనో, లేదా మిద్దెపైనో స్థలం విశాలంగా ఉంటే అక్కడకూడా సమా వేశాలు నిర్వహించేవారు. లౌడ్ స్పీకర్ల అవసరం ఉండేది కాదు. ఆయన ఖర్చులు కూడా తక్కువే. కేంపెయిన్ చేస్తున్న ప్పుడు ఎవరు ఏది పెడితే దాన్నే ఆరగించేవారు. రాజాజీ స్వతంత్ర పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసు కుపోవడానికి జోషి ‘స్వతంత్ర భారత్ పక్ష్’ అనే సొంత పార్టీని ఏర్పాటు చేయవలసివచ్చింది. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థిని సోషలిజం పేరుతో ప్రమాణ స్వీకారం చేయవల సిందిగా బలవంతం చేయవలసిన అవసరం లేదంటూ జోషి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉదారవాద సమర్థకుడికి సోషలిజం అనే పదం చేదుమాత్రలా ఉంటుం దని ఆయన ఉద్దేశం. దీనికి సంబంధించి ఆయన రాజ్య సభలో ఒక ప్రైవేట్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అయితే ఇందిరాగాంధీ హయాంలో ‘లౌకికవాదం’ అనే పదాన్ని చొప్పించి నందున రాజ్యాంగంలో ‘సోషలిజం’ అనే పదం కొనసాగుతోంది. అయితే ఉచిత విద్యుత్తు, రుణ మాఫీలను డిమాండ్ చేయడంలో ఒక స్పష్టమైన వైరుధ్యాన్ని ఆయనలో గమనిం చవచ్చు. ధరవరలపై ప్రభుత్వ విధానాల కారణంగా రైతు లు తీవ్రమైన ఆర్థిక అసమగ్రతా స్థాయిల్లో కూరుకుపోతు న్నంత కాలం ఈ డిమాండ్ చేయవలసిందేనని ఆయన అభి ప్రాయం. రైతు సమస్యలపై లాబీ చేస్తున్నామని చెప్పుకునే ఇతరుల్లాగా కాకుండా, అయన అధిక ధరల డిమాండ్ వద్దే ఆగిపోయేవారు కాదు. రైతులకు ప్రయోజనం కలిగించే ఏకైక సాధనంగా స్వేచ్ఛామార్కెట్ కోసం ఆయన కేంపె యిన్ చేశారు. రైతులు లబ్ధి పొందితే ఇతరులూ ప్రయో జనం పొందుతారన్నది ఆయన విశ్వాసం. ఆయన సాగించిన రైతు సమీకరణలో ఆసక్తికరమైన అంశం ఏదంటే, ఆయన కేంపెయిన్లలో ప్రముఖ పాత్ర వహించిన కార్యకర్తలందరూ ఆయన తోటే కొనసాగేవారు కాదు. విభేదాల కారణంగా వారు తమ తమ మార్గాలను ఆశ్రయించేవారు కానీ రైతు సమస్యను మాత్రం ముందుకు తీసుకెళ్లేవారు. అందుకే ‘షేత్కారి సంఘటన’ను ముద్రిం చిన పోస్ట్‌బాక్స్ ఎరుపు రంగు పిన్ను ధరించడం వారు కొన సాగించేవారు. ఆయన సంస్థ సార్వత్రికమైనదని దీనర్థం. విభే దాలవల్ల వారు విడిపోయనప్పటికీ అదేమంత పెద్ద విషయం కాదు మరి. - మహేశ్ విజాపుర్కార్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్: mvijapurkar@gmail.com -
రైతు నేత శరద్ జోషి కన్నుమూత
పుణె : ప్రముఖ రైతు నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు శరద్ జోషి(81) శనివారం పుణెలో కన్నుమూశారు. మహారాష్ట్రకు చెందిన జోషి రైతు సంక్షేమం కోసం అలుపెరుగని పోరాటాలు చేసి రైతు బాంధవుడిగా పేరు గాంచారు. రైతుల పక్షాన పోరాడేందుకు 1979లో షెట్కారీ సంఘటన్ పేరుతో సంస్థ స్థాపించారు. అలాగే స్వతంత్ర భారత్ అనే పార్టీని కూడా స్థాపించారు. ముఖ్యంగా 1980లో ఉల్లి మద్దతు ధర కోసం జోషి జరిపిన ఉద్యమం దేశ వ్యాప్తంగా అందరినీ ఆకర్షించింది. ఆర్ధికవేత్తగా ప్రఖ్యాత జర్నలిస్టుగా కూడా సమాజానికి ఎనలేని సేవలందించారు. 2004 నుంచి 2010 వరకు రాజ్యసభ సభ్యునిగా పనిచేసిన జోషికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మరణం రైతు లోకానికి, రైతు ఉద్యమాలకు తీరని లోటని భారతీయ కిసాన్ యూనియన్ నేత భూపిందర్ సింగ్ అన్నారు. ఆయన మృతి పట్ల వివిధ పార్టీల నేతలు, రైతు సంఘాల నేతలు సంతాపం వ్యక్తం చేశారు.