షిల్లింగ్‌ఫోర్డ్ యాక్షన్ సందేహాస్పదం
ముంబై: భారత్‌తో టెస్టు సిరీస్‌లో ఘోర పరాజయం నుంచి కోలుకోకముందే వెస్టిండీస్ జట్టుకు మరో దెబ్బ తగిలింది. సిరీస్‌లో విశేషంగా రాణించిన స్పిన్నర్ షిల్లింగ్ఫోర్డ్తో పాటు ఆల్‌రౌండర్ శామ్యూల్స్ బౌలింగ్ యాక్షన్ సందేహాస్పదంగా ఉందని రెండో టెస్టుకు అంపైరింగ్ చేసిన కెటిల్‌బొరో, లాంగ్ ఐసీసీకి నివేదిక ఇచ్చారు. రెండో రోజు ఆట తర్వాత తమ రిపోర్ట్‌ను అందించారు. దీనిని ఐసీసీ ప్రతినిధులు వెస్టిండీస్ మేనేజర్‌కు ఇచ్చారు. శామ్యూల్స్ క్వికర్ బంతులు, షిల్లింగ్‌ఫోర్డ్ దూస్రాలు వేస్తున్న సమయంలో వీరి బౌలింగ్ యాక్షన్ సందేహాస్పదంగా ఉందని ఈ నివేదికలో పేర్కొన్నారు. ఈ క్రికెటర్లిద్దరూ 21 రోజుల్లోగా తమ బౌలింగ్‌ను విశ్లేషించుకుని ఆ తర్వాత 14 రోజుల్లోగా ఐసీసీకి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
అప్పటివరకూ బౌలింగ్ చేయొచ్చు. మధ్యలో ఏదైనా మ్యాచ్‌లో అంపైర్లకు సందేహాస్పదంగా అనిపిస్తే బౌలింగ్‌ను ఆపేయాలి. గతంలోనూ ఈ ఇద్దరి యాక్షన్ సందేహాస్పదంగా ఉంటే కొంతకాలం ఆపారు. తిరిగి యాక్షన్‌ను సవరించుకున్న తర్వాత ఐసీసీ అనుమతి ఇచ్చింది. శామ్యూల్స్ 2008లో సెప్టెంబరు నుంచి 2011 సెప్టెంబరు వరకు బౌలింగ్‌కు దూరమయ్యాడు. షిల్లింగ్‌ఫోర్డ్ 2010 నవంబరు నుంచి 2011 జూన్ వరకు బౌలింగ్ చేయలేదు.