Shiv Pal
-
అఖిలేశ్ లిస్టులో బాబాయ్
210 మందితో సమాజ్‌వాదీ తొలి జాబితా విడుదల ఎస్పీ–ఆర్ఎల్డీ పొత్తు చర్చలు విఫలం చిన్న పార్టీలతో కలిసి పోటీచేయాలని ఆర్ఎల్డీ నిర్ణయం లక్నో, సాక్షి, న్యూఢిల్లీ: సమాజ్‌వాదీపై పట్టు కోసం తుది దాకా తలపడ్డ తండ్రీ కొడుకులు మళ్లీ ఒకటయ్యారు. ఎస్పీ అభ్యర్థుల జాబితాలో బాబాయ్ శివ్‌పాల్‌కు చోటిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ములాయం– అఖిలేశ్‌ల మధ్య సయోధ్య కుదిరినట్లేనని భావిస్తున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం సమాజ్‌వాదీ పార్టీ శుక్రవారం 210 మందితో జాబితా విడుదల చేయగా... జాబితాలో అఖిలేశ్ బద్ధ శత్రువు, ములాయం వర్గానికి చెందిన శివ్‌పాల్‌కు చోటుదక్కింది. శివ్‌పాల్‌కు జస్వంత్‌నగర్ స్థానాన్ని కేటాయించాలన్న ములాయం కోరికను కూడా అఖిలేశ్ పరిగణనలోకి తీసుకున్నారు. ఇక రాజ్యసభ సభ్యుడు బేణీ ప్రసాద్ వర్మ కుమారుడు రాకేశ్ వర్మకు ములాయం కోరినట్లు రాంనగర్ సీటు కాకుండా కైసర్‌గంజ్ స్థానం కేటాయించారు. గత నెల్లో ములాయం విడుదల చేసిన జాబితాలో లేని చాలా పేర్లు అఖిలేశ్ జాబితాలో ఉండడం విశేషం. మొత్తం 210 మందిలో 59 మంది ముస్లింలకు ఎస్పీ టికెట్లిచ్చింది. కాంగ్రెస్‌కు 85 స్థానాల వరకూ ఇవ్వగలమని, పొత్తు కుదిరితే ఆ పార్టీ సిట్టింగ్ స్థానాలకు ప్రకటించిన అభ్యర్థుల్ని ఉపసంహరించుకుంటామని పార్టీ ఉపాధ్యక్షుడు కిరణ్మయి నందా వెల్లడించారు. యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో మాత్రమే పొత్తుకు అఖిలేశ్ సానుకూలంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ములాయం సూచన మేరకే ఆర్ఎల్డీతో పొత్తుకు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో జేడీయూ, ఇతర చిన్న పార్టీల్ని కలుపుకుని ముందుకెళ్లాలని ఆర్ఎల్డీ నిర్ణయించింది. -
బాబాయ్ అబ్బాయ్ భేటీ
► అనంతరం ములాయంతో శివ్‌పాల్ మంతనాలు.. తేలని రాజీ చర్చలు ► ఎస్పీ నుంచి వైదొలగేందుకు సిద్ధమంటూ అమర్‌సింగ్ సంకేతాలు లక్నో: ఒక రోజు రాజీ చర్చలు, మరో రోజు ఆధిపత్య పోరుతో సమాజ్‌వాదీ రాజకీయాలు సస్పెన్స్ సినిమాను తలపిస్తున్నాయి. పార్టీ ప్రక్షాళనకు అఖిలేశ్ సిద్ధమవడంతో పరిస్థితి చేయి దాటుతుందని భావించిన బాబాయ్ శివ్‌పాల్ శుక్రవారం అఖిలేశ్‌తో చర్చలు జరిపారు. అనంతరం ములాయంను కలిసి చర్చల సారాంశాన్ని వివరించినా రాజీపై మాత్రం ఎలాంటి ప్రకటన వెలువడలేదు. తండ్రితో రాజీ కోసం బయలుదేరి... సంధి ప్రయత్నాల్లో భాగంగా గురువారం రాత్రే తండ్రిని కలిసేందుకు అఖిలేశ్ నిర్ణయించారు. ఢిల్లీ నుంచి లక్నో వస్తున్న తండ్రికి స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వెళ్లాలని మొదట భావించినా... ములాయం ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానంలో అమర్‌సింగ్ కూడా ఉన్నారన్న వార్తలతో ఆ ఆలోచన విరమించుకున్నారు. ఇదే సమయంలో ఎస్పీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల నుంచి అఖిలేశ్ వర్గం సంతకాల సేకరణ చేపట్టింది. చివరి ప్రయత్నంగా తండ్రికి అఖిలేశ్ ఫోన్ చేసి పార్టీపై 3 నెలల పాటు నియంత్రణ ఇవ్వాలని కోరినా... చర్చలు ఫలించలేదు. అఖిలేశ్ వర్గం మొత్తం 229 మంది ఎమ్మెల్యేలకు గాను 212 మంది, 68 మంది ఎమ్మెల్సీలకు 56 మంది , 24 మంది ఎంపీల్లో 15 మంది, 5 వేల మంది ప్రతినిధుల నుంచి సంతకాలు సేకరించింది. ఈసీకి సమర్పించేందుకు సిద్ధమవుతోంది. పార్టీలో మార్పులతో కలవరం శివ్‌పాల్ నియమించిన జిల్లా అధ్యక్షుల్ని తొలగించి తన అనుకూల నేతల్ని నియమించేందుకు శుక్రవారం అఖిలేశ్ కసరత్తు మొదలుపెట్టడంతో రాయబారం కోసం శివ్‌పాల్ యాదవ్ హడావుడిగా సీఎం నివాసానికి వెళ్లారు. ఇదే సమయంలో పార్టీ నుంచి వైదొలగేందుకు సిద్ధమంటూ ఎస్పీ ఎంపీ అమర్ సింగ్ కూడా పరోక్ష సంకేతాలిచ్చారు. తండ్రీ కొడుకులు ఏకమవ్వాలనే తాను కోరుకుంటున్నానని, సీఎం అఖిలేశ్ దారికి అడ్డంకి కాబోనని చెప్పారు. అయితే బాబాయ్, అబ్బాయ్ మధ్య చర్చల సారాంశంపై పార్టీ వర్గాలు మాత్రం ఇంకా స్పందించలేదు. అఖిలేశ్‌తో భేటీ అనంతరం మళ్లీ ములాయంను కలిసిన శివ్‌పాల్ రాజీ ఫార్ములాపై చర్చించారు. ఖాతాల్ని ఫ్రీజ్ చేయండి: అఖిలేశ్ వర్గం సమాజ్‌వాదీ ఖాతాల్ని స్తంభింపచేయాలం టూ అఖిలేశ్ వర్గం బ్యాంకులకు లేఖ రాసింది. బ్యాంకుల్లో రూ. 500 కోట్లు ఉండగా... శివ్‌పాల్ సంతకం తప్పనిసరి కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. -
235 మందితో అఖిలేశ్ జాబితా
-
235 మందితో అఖిలేశ్ జాబితా
► అనుకూల వర్గం పేర్లతో విడుదల ► ఎస్పీలో మళ్లీ రాజకీయ ముసలం లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో చీలిక అనివార్యమైనట్లు కనబడుతోంది. తండ్రి (ములాయం), కుమారుడు (అఖిలేశ్) మధ్య వివాదం మరింత ముదిరింది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో తన వర్గానికి ములాయం మొండిచేయి చూపటంపై సీఎం అఖిలేశ్ బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కారు. తన వర్గం నేతలతో కలిసి 235 మంది సభ్యులతో జాబితాను విడుదల చేసి సోషల్ మీడియాలో ఉంచారు. అఖిలేశ్‌కు సన్నిహితంగా ఉన్నందుకు ములాయం జాబితాలో చోటు దక్కించుకోని వారంతా కొత్త లిస్టులో స్థానం సంపాదించారు. అంతకుముందు అఖిలేశ్ తన వర్గం నేతలు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తను ప్రత్యేకంగా చెప్పిన వారినీ కావాలని తప్పించటంపై ములాయం వర్గం నేతలపై అసహనం వ్యక్తం చేశారు. ‘మాకు అఖిలేశ్ ఆశీర్వాదాలు ఉన్నాయి. ములాయం మా నేత. కానీ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ప్రజలకు అఖిలేశ్ అవసరం. అతనిపై కొన్ని కుట్రలు జరుగుతున్నాయి. 2019లో ములాయంను ప్రధానిగా చూడాలనుకుంటున్నాం. మమ్మల్ని ప్రచారం చేసుకోమని అఖిలేశ్ చెప్పారు’అని సీఎం వర్గం నేత చెప్పారు. మొత్తం 403 సీట్లకు గాను 325 స్థానాలకు ములాయం అభ్యర్థులను ప్రకటించగా.. అందులో సీఎం అనుకూల మంత్రులతోపాటు 50 మంది ఎమ్మెల్యేల పేర్లు లేవు. శివ్‌పాల్ మద్దతుదారుల తొలగింపు కాగా అఖిలేశ్ తన మద్దతుదార్ల పేర్లు జాబితాలో లేనందుకు ప్రతీకార చర్యగా శివ్‌పాల్ మద్దతుదారులిద్దరిని పదవుల నుంచి తొలగించారు. యూపీ ఆవాస్ వికాస్ పరిషత్ వైస్ చైర్పర్సన్ గా ఉన్న సురభి శుక్లా, ఆమె భర్త, రాజకీయ నిర్మాణ నిగమ్ సలహాదారుగా ఉన్న సందీప్ శుక్లాలను ఆయా పదవుల నుంచి తొలగిస్తున్నట్లు సీఎం ఉత్తర్వులు జారీ చేశారు.