బాబాయ్ అబ్బాయ్ భేటీ
► అనంతరం ములాయంతో శివ్‌పాల్ మంతనాలు.. తేలని రాజీ చర్చలు
► ఎస్పీ నుంచి వైదొలగేందుకు సిద్ధమంటూ అమర్‌సింగ్ సంకేతాలు
లక్నో: ఒక రోజు రాజీ చర్చలు, మరో రోజు ఆధిపత్య పోరుతో సమాజ్‌వాదీ రాజకీయాలు సస్పెన్స్ సినిమాను తలపిస్తున్నాయి. పార్టీ ప్రక్షాళనకు అఖిలేశ్ సిద్ధమవడంతో పరిస్థితి చేయి దాటుతుందని భావించిన బాబాయ్ శివ్‌పాల్ శుక్రవారం అఖిలేశ్‌తో చర్చలు జరిపారు. అనంతరం ములాయంను కలిసి చర్చల సారాంశాన్ని వివరించినా రాజీపై మాత్రం ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
తండ్రితో రాజీ కోసం బయలుదేరి...
సంధి ప్రయత్నాల్లో భాగంగా గురువారం రాత్రే తండ్రిని కలిసేందుకు అఖిలేశ్ నిర్ణయించారు. ఢిల్లీ నుంచి లక్నో వస్తున్న తండ్రికి స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వెళ్లాలని మొదట భావించినా... ములాయం ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానంలో అమర్‌సింగ్ కూడా ఉన్నారన్న వార్తలతో ఆ ఆలోచన విరమించుకున్నారు. ఇదే సమయంలో ఎస్పీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల నుంచి అఖిలేశ్ వర్గం సంతకాల సేకరణ చేపట్టింది. చివరి ప్రయత్నంగా తండ్రికి అఖిలేశ్ ఫోన్ చేసి పార్టీపై 3 నెలల పాటు నియంత్రణ ఇవ్వాలని కోరినా... చర్చలు ఫలించలేదు. అఖిలేశ్ వర్గం మొత్తం 229 మంది ఎమ్మెల్యేలకు గాను 212 మంది, 68 మంది ఎమ్మెల్సీలకు 56 మంది , 24 మంది ఎంపీల్లో 15 మంది, 5 వేల మంది ప్రతినిధుల నుంచి సంతకాలు సేకరించింది. ఈసీకి సమర్పించేందుకు సిద్ధమవుతోంది.
పార్టీలో మార్పులతో కలవరం
శివ్‌పాల్ నియమించిన జిల్లా అధ్యక్షుల్ని తొలగించి తన అనుకూల నేతల్ని నియమించేందుకు శుక్రవారం అఖిలేశ్ కసరత్తు మొదలుపెట్టడంతో రాయబారం కోసం శివ్‌పాల్ యాదవ్ హడావుడిగా సీఎం నివాసానికి వెళ్లారు. ఇదే సమయంలో పార్టీ నుంచి వైదొలగేందుకు సిద్ధమంటూ ఎస్పీ ఎంపీ అమర్ సింగ్ కూడా పరోక్ష సంకేతాలిచ్చారు. తండ్రీ కొడుకులు ఏకమవ్వాలనే తాను కోరుకుంటున్నానని, సీఎం అఖిలేశ్ దారికి అడ్డంకి కాబోనని చెప్పారు. అయితే బాబాయ్, అబ్బాయ్ మధ్య చర్చల సారాంశంపై పార్టీ వర్గాలు మాత్రం ఇంకా స్పందించలేదు. అఖిలేశ్‌తో భేటీ అనంతరం మళ్లీ ములాయంను కలిసిన శివ్‌పాల్ రాజీ ఫార్ములాపై చర్చించారు.
ఖాతాల్ని ఫ్రీజ్ చేయండి: అఖిలేశ్ వర్గం
సమాజ్‌వాదీ ఖాతాల్ని స్తంభింపచేయాలం టూ అఖిలేశ్ వర్గం బ్యాంకులకు లేఖ రాసింది. బ్యాంకుల్లో రూ. 500 కోట్లు ఉండగా... శివ్‌పాల్ సంతకం తప్పనిసరి కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.