నా కొడుకుపై అంత కోపాన్ని చూపగలనా!?
దాదాపు నెలరోజులపాటు జరిగిన కుటుంబ ఆధిపత్యపోరులో నెగ్గి పార్టీపై పూర్తి పట్టు సాధించిన యూపీ సీఎం, ఎస్పీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ స్వరం మార్చారు. అందరూ తనవారేనంటూ దగ్గరికి తీసుకుంటున్నారు. ఒకప్పుడు బద్ధ శత్రువుగా పరిగణించిన అమర్‌సింగ్‌ను ఉద్దేశించి సైతం 'అంకుల్' అంటూ ఆప్యాయంగా మాట్లాడారు. ఓ హిందీ చానెల్ నిర్వహించిన సదస్సులో మాట్లాడిన అఖిలేశ్ తన వర్గం, కుటుంబం అంతా ఒక్కటే అన్న సంకేతం ఇవ్వడానికి ప్రయత్నించారు.
తండ్రి ములాయం సింగ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ 'ఆయన సమాజ్‌వాదీ (సోషలిస్ట్). ఇంట్లో, బయటా ఒకేవిధంగా కోపాన్ని వ్యక్తం చేస్తారు' అని అన్నారు. కుటుంబ వివాదంలో తనకు కలిగిన భావోద్వేగాలను వ్యక్తంచేస్తూ.. 'నా కొడుకుపై నేనెప్పుడైనా ఈవిధంగా కోప్పడగలనా? అని అనుకున్నాను' అని పేర్కొన్నారు. ములాయం పలుసందర్భాల్లో బాహాటంగానే అఖిలేశ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బహిరంగంగా అఖిలేశ్ పాలనను ఆయన విమర్శించారు కూడా. ఇక, తనను ఎస్పీ నుంచి గెంటేశారని అమర్‌సింగ్ ఒకవైపు ఆవేదన చెందుతుండగా.. ఆయన మంచి వ్యక్తి అని, తమ కుటుంబాన్ని ఎంతోగానో ప్రేమిస్తారని అఖిలేశ్ సాంత్వనపూరిత వ్యాఖ్యలు చేశారు.