బాల్ ఠాక్రే వర్ధంతి సభకు ముమ్మర ఏర్పాట్లు
సాక్షి, ముంబై: ఈ నెల 17న జరగనున్న బాల్ ఠాక్రే రెండో వర్ధంతి కార్యక్రమానికి శివసేన నాయకులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంతోపాటు దేశం నలుమూలల నుంచి వచ్చే లక్షలాది అభిమానులు, ఆ పార్టీ కార్యకర్తలకు ఆ రోజు ఎలాంటి అసౌకర్యాలు ఎదురుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా శివసేన పదాధికారులతో మేయర్ స్నేహల్ ఆంబేకర్ సమావేశమయ్యారు.
శివాజీపార్క్ మైదానంలో చేపడుతున్న ఏర్పాట్లపై ఆరా తీశారు. కాగా, ఆ రోజు హాజరయ్యే అభిమానులు ఇబ్బందులకు గురికాకుండా పార్క్ వద్ద అదనంగా మహానగర పాలక సంస్థ (బీఎంసీ) సిబ్బందిని మోహరించాలని, అక్కడక్కడ నీటి కుళాయిలు, సంచార మరుగుదొడ్లు, మొబైల్ చార్జర్ల వ్యవస్థ, నీటి ట్యాంకర్లు తదితర సదుపాయాలు కల్పించాలని ఆంబేకర్తో శివసేన నాయకులు విజ్ఞప్తి చేశారు. మైదానంలో ఎటువంటి తోపులాటలు జరుగకుండా బారికేడ్లు ఏర్పాటుచేయాలని, తగినంత పోలీసు సిబ్బందిని నియమించాలని కోరారు. ఈ మేరకు ఆంబేకర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు.