shocaz notice
-
కలెక్టర్‌కు షోకాజ్ నోటీసు
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్‌కు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి షోకాజ్ నోటీసు జారీ చేసింది. విద్యుత్ కారిడార్ వ్యవహారంలో రైతుకు న్యాయం చేయని కలెక్టర్‌పై కమిషన్ సీరియస్ అయింది. రెండు వారాల్లో సరైన వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నట్టు ఏపీఈఆర్సీ వర్గాలు బుధవారం తెలిపాయి. ఏపీ ట్రాన్స్‌కో 2017లో పొదిలి–పర్చూరు మధ్య 220 కేవీ విద్యుత్ లైన్ వేసింది. ఈ క్రమంలో సుబాబుల్ సాగు చేస్తున్న వలేటి వెంకట శేషయ్య భూమి మీదుగా లైన్ వెళ్లింది. దీనివల్ల 80 సెంట్ల భూమి దెబ్బతింటుందని, పరిహారం ఇవ్వాలని విద్యుత్ ఉన్నతాధికారులను కోరాడు. దీనికి వాళ్లు నిరాకరించారు. అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయిన బాధితుడు జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించినా ఫలితం లేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 5న ఆ రైతు ఏపీఈఆర్సీని ఆశ్రయించాడు. కమిషన్ వివరణ కోరినా ప్రకాశం జిల్లా కలెక్టర్ స్పందించలేదు. దీంతో విద్యుత్ నియంత్రణ చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరించాలని కలెక్టర్‌కు కమిషన్ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. -
లవ్లీ ప్రొఫెషన్ల్ యునివర్సిటీకి నోటీసులు
చండీగఢ్ : లాక్డౌన్ నిబంధనలను ఉల్లఘింనందుకు పంజాబ్‌లోని లవ్లీ ఫ్రొఫెషనల్ యునివర్సటీ యాజమాన్యానికి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ శనివారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అత్యవసర సేవలు మినహా మిగతావన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదని కేంద్ర, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఇందుకు పంజాబ్ ప్రభుత్వం మార్చి 13నుంచే రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యా సంస్థలును మూసివేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలవుతున్న వేళ పగ్వారాలోని కపుర్తలా జిల్లాలో ఉన్న లవ్లీ ప్రొఫెషన్ల్ యునివర్సిటీ నిబంధనలను బేఖాతరు చేసింది. దాదాపు 3వేల మందిని( విద్యార్థులు, ఫ్యాకల్టీతో కలిపి) క్యాంపస్ అనుబంధ హాస్టల్లో ఉండేదుకు యునివర్సిటీ యాజమాన్యం అనుమతులు ఇచ్చింది. తాజాగా ఏప్రిల్ 12న యునివర్సిటీలో ఉంటున్న విద్యార్థికి కరోనా పాజిటివ్ రావడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు ఉల్లఘించిన సదరు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వెంటనే రంగంలోకి దిగిన ఉన్నత విద్యాశాఖ అధికారులు ఎల్పీయూ యాజమన్యం తీరును తప్పుబడుతూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. (డ్రగ్స్ కేసులో పంజాబ్ సింగర్ అరెస్ట్) కరోనా విస్తరిస్తున్న వేళ ఇలా వేలమందిని ఒక దగ్గరే ఉంచి వారిని ప్రమాదంలోకి నెట్టేస్తారా అంటూ మండిపడింది. ఇంత ఆపత్కాల సమయంలో నిర్లక్ష్యం, బాధ్యతారహితంగా ఉంటారా అంటూ చివాట్లు పెట్టింది. ఎల్పీయూ యాజమాన్యానికి ఏడు రోజుల గడువును నిర్ధేశించిన అధికారులు సమయంలోగా అన్ని వివరాలు తెలపాలని ఆదేశించింది. వేల మందిని హాస్టల్లో ఉంచడానికి అనుమతులు ఎవరు ఇచ్చారని, ఎన్వోసీ చూపించాలని షోకాజ్ నోటీసులో పేర్కొంది. అంతకుముందు ఎమ్మెల్యే రాణా గురుజిత్ సింగ్ ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ద్రుష్టికి తీసుకెళ్లారు. దీంతో అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందు జాగ్రత్తగా వారందరికి కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాయి. ఇప్పటివరకు పంజాబ్ రాష్ట్రంలో 200కు పైగా కరోనా పాజిటివ్ కేసులు రాగా, మృతుల సంఖ్య 13గా ఉంది. తాజా ఉదంతంతో పంజాబ్ రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో చూడాలి. -
పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్‌కు షోకాజ్
అనంతపురం టౌన్ : పుట్టపర్తి మునిసిపల్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నేత పీసీ గంగన్నకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి శనివారం షోకాజ్ నోటీసు జారీ చేశారు. కొంతకాలంగా మాజీ మంత్రి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డికి వ్యతిరేకంగా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ఐదు రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. సంజాయిషీ ఇవ్వని పక్షంలో తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
తహసీల్దార్‌కు షోకాజ్ నోటీసు
గుత్తిరూరల్ : సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన సమాచారం ఇవ్వని తహసీల్దార్ సరస్వతికి రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ నుంచి మంగళవారం నోటీసులు జారీ అయ్యాయి. పట్టణానికి చెందిన దుర్గా ప్రసాద్‌రెడ్డి పట్టణంలో ఎన్ని మీ సేవ కేంద్రాలు ఉన్నాయి? వాటి నిర్వాహకుల పేర్లు, ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్వహిస్తున్నారా? లేదా తగిన ఆధారాలతో ఇవ్వాలని గత ఏడాది ఆగష్టు 17, తిరిగి ఆగష్టు 23న రెండు మార్లు సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు అడిగారు. తహసీల్దార్ తమ వద్ద సమాచారం లేదని నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఫిర్యాదుదారుడు ఆర్డీఓకు అప్పీల్ చేశారు. ఆర్డీఓ నుంచి కూడా సరైన సమాధానం రాకపోవడంతో రాష్ట్ర కమిషన్‌కు అప్పీలు చేశాడు. స్పందించిన కమిషన్ విచారణ నిమిత్తం ఈనెల 27న అనంతపురం ఆర్డీఓ కమిషన్ ఎదుట హాజరుకావాలని షోకాజ్ నోటీసులు జారీ చేశారని ఫిర్యాదుదారుడు దుర్గాప్రసాద్‌రెడ్డి తెలిపారు. -
కునుకు తీసిన మాస్టారికి ‘షోకాజ్’
అనంతపురం ఎడ్యుకేషన్ : డీఈఓ శామ్యూల్ మంగళవారం ఉదయం తనకల్లు, కొక్కంటి, ఈతోడు ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 11.45 గంటలప్పుడు కొక్కంటి పాఠశాలకు వెళ్లారు. అక్కడ 6వ తరగతిలో కుర్చీలోనే కునుకు తీస్తున్న ఇంగ్లీష్ టీచరు ఎ.మురళీ ఆయన కంటపడ్డారు. తీవ్రంగా పరిగణించిన డీఈఓ క్లాస్ పీకి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయుల అటెండెన్స్ రిజిష్టర్లు, విద్యార్థుల హాజరు, బోధన తీరును పరిశీలించారు.