చండీగఢ్ : లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లఘింనందుకు పంజాబ్‌లోని లవ్లీ ఫ్రొఫెషనల్ యునివర్సటీ యాజమాన్యానికి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ శనివారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రం లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అత్యవసర సేవలు మినహా మిగతావన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదని కేంద్ర, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఇందుకు పంజాబ్ ప్రభుత్వం మార్చి 13నుంచే రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యా సంస్థలును మూసివేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది.
లాక్‌డౌన్ కట్టుదిట్టంగా అమలవుతున్న వేళ పగ్వారాలోని కపుర్తలా జిల్లాలో ఉన్న లవ్లీ ప్రొఫెషన్‌ల్ యునివర్సిటీ నిబంధనలను బేఖాతరు చేసింది. దాదాపు 3వేల మందిని( విద్యార్థులు, ఫ్యాకల్టీతో కలిపి) క్యాంపస్ అనుబంధ హాస్టల్‌లో ఉండేదుకు యునివర్సిటీ యాజమాన్యం అనుమతులు ఇచ్చింది. తాజాగా ఏప్రిల్ 12న యునివర్సిటీలో ఉంటున్న విద్యార్థికి కరోనా పాజిటివ్ రావడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు ఉల్లఘించిన సదరు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వెంటనే రంగంలోకి దిగిన ఉన్నత విద్యాశాఖ అధికారులు ఎల్‌పీయూ యాజమన్యం తీరును తప్పుబడుతూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. (డ్రగ్స్ కేసులో పంజాబ్ సింగర్ అరెస్ట్)
కరోనా విస్తరిస్తున్న వేళ ఇలా వేలమందిని ఒక దగ్గరే ఉంచి వారిని ప్రమాదంలోకి నెట్టేస్తారా అంటూ మండిపడింది. ఇంత ఆపత్కాల సమయంలో నిర్లక్ష్యం, బాధ్యతారహితంగా ఉంటారా అంటూ చివాట్లు పెట్టింది. ఎల్‌పీయూ యాజమాన్యానికి ఏడు రోజుల గడువును నిర్ధేశించిన అధికారులు సమయంలోగా అన్ని వివరాలు తెలపాలని ఆదేశించింది. వేల మందిని హాస్టల్‌లో ఉంచడానికి అనుమతులు ఎవరు ఇచ్చారని, ఎన్‌వోసీ చూపించాలని షోకాజ్ నోటీసులో పేర్కొంది. అంతకుముందు ఎమ్మెల్యే రాణా గురుజిత్ సింగ్ ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ద్రుష్టికి తీసుకెళ్లారు. దీంతో అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందు జాగ్రత్తగా వారందరికి కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాయి. ఇప్పటివరకు పంజాబ్ రాష్ట్రంలో 200కు పైగా కరోనా పాజిటివ్ కేసులు రాగా, మృతుల సంఖ్య 13గా ఉంది. తాజా ఉదంతంతో పంజాబ్ రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment