'షోలే సీన్' ను ఫాలో అయ్యారు..
ఔరంగాబాద్ (మహారాష్ట్ర) : భారతదేశం గర్వించదగిన సినిమాల లిస్ట్ లో 'షోలే' ఒకటి. బాలీవుడ్ లో బంపర్ హిట్ అయిన ఆ సినిమాలోని ప్రతీ సీన్ అభిమానులకు కొట్టిన పిండే. అలాంటి ఓ సీన్నే గ్రామస్తులు తమ నిరసన వ్యక్తం చేయడానికి వాడుకున్నారు.
షోలే సినిమాలో బసంతి(హేమా మాలిని)ని పెళ్లి చేసుకోవడానికి ఆమె పిన్ని నిరాకరించినందుకు నిరసనగా వీరూ(ధర్మేంద్ర) వాటర్ ట్యాంక్ పైకెక్కి నానా రచ్చ చేస్తాడు. సరిగ్గా అదే సీన్ ను ప్రేరణగా తీసుకుని కొన్ని గ్రామాలకు చెందినవారంతా కలిసి వాటర్ ట్యాంక్ ఎక్కారు. కానీ ఇక్కడ బసంతి కోసం కాదు.. తాగునీటి కోసం.
మహారాష్ట్రలోని మరథ్వాడా జిల్లా పరిధిలో గల కొన్ని గ్రామాలు గత కొంతకాలంగా తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. అధికారుల చుట్టూ తిరిగి తిరిగి చెప్పులరిగిపోయాయిగానీ నీటి కష్టాలు మాత్రం తీరలేదు. విసిగిపోయిన గ్రామస్తులు ఆదివారం ఓ వాటర్ ట్యాంకు పైకెక్కి తమ నిరసన వ్యక్తం చేశారు. జైక్వాడ్ డ్యాం నుంచి నీటిని విడుదల చేసేదాకా దిగేది లేదంటూ హెచ్చరించారు.
వేసవి మొదలుకాకముందే మహారాష్ట్రలోని పలు ప్రాంతాలు తీవ్రమైన నీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి. ప్రత్యేకించి మరథ్వాడా జిల్లాలోని డ్యాంలలో ఇప్పటికే నీటి శాతం ఎనిమిదికి పడిపోయింది. కాగా దీనిపై నీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖ స్పందిస్తూ.. డ్యాంలలో నీటి నిల్వలు లేనందున ఇబ్బందులు తప్పవని, అయితే గత ఏడాదితో పోలిస్తే ఈసారి 5 రెట్లు ఎక్కువ సంఖ్యలో వాటర్ ట్యాంకులను గ్రామాలకు సప్లై చేస్తామని వెల్లడించారు.