జీతూ ఖాతాలో కాంస్యం
ప్రపంచకప్ షూటింగ్ టోర్నీ
న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా పతకాలు సాధిస్తున్న భారత స్టార్ షూటర్ జీతూ రాయ్ సొంతగడ్డపై తొలిసారి జరుగుతోన్న ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో మెరిశాడు. సోమవారం మిక్స్డ్ పిస్టల్ టెస్ట్ ఈవెంట్లో భారత్‌కే చెందిన హీనా సిద్ధూతో జతగా స్వర్ణం గెలిచిన జీతూ అదే జోరును మంగళవారం కొనసాగించాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మూడో స్థానంలో నిలిచి తన ఖాతాలో కాంస్య పతకాన్ని జమ చేసుకున్నాడు. ఎనిమిది మంది పాల్గొన్న ఫైనల్లో 29 ఏళ్ల జీతూ రాయ్ 216.7 పాయింట్లు స్కోరు చేశాడు. తొమొయుకి మత్సుద (జపాన్) 240.1 పాయింట్లు సాధించి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. విన్ జువాన్ హోంగ్ (వియత్నాం) 236.6 పాయింట్లతో రజత పతకాన్ని గెల్చుకున్నాడు. 35 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్ రౌండ్లో జీతూ రాయ్ 577 పాయింట్లు సాధించి ఆరో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందాడు. టాప్–8లో ఉన్న షూటర్లు ఫైనల్లో పోటీపడ్డారు. భారత్‌కే చెందిన ఓంకార్ సింగ్ 574 పాయింట్లు, అమన్‌ప్రీత్ సింగ్ 572 పాయింట్లు సాధించి వరుసగా 14వ, 19వ స్థానాల్లో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. ‘ఫైనల్ ఆరంభంలో నేను తడబడ్డాను. మిగతా వారికంటే వెనుకబడ్డాను. ఒకదశలో పతకం గెలుస్తానో లేదో అనే అనుమానం కలిగింది. అయితే ఎలాగైనా పతకం నెగ్గాలనే లక్ష్యంతో ఏకాగ్రతతో లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించాను. నిలకడగా పాయింట్లు సాధించి చివరకు కాంస్య పతకాన్ని గెలిచాను’ అని జీతూ రాయ్ వ్యాఖ్యానించాడు. ‘క్వాలిఫయింగ్ సందర్భంగా స్కోరు బోర్డును చూడలేదు. దానిపై దృష్టి పెడితే ఏకాగ్రత దెబ్బతింటుందని తెలుసు. తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటాను. ఫైనల్‌కు చేరుకోవడంతో నాపై ఉన్న ఒత్తిడి తొలగిపోయింది. రియో ఒలింపిక్స్‌లో వైఫల్యం తర్వాత నేను నెగ్గిన మూడో అంతర్జాతీయ పతకమిది. వరల్డ్ కప్ ఫైనల్స్‌లో రజతం, అదే టోర్నీలో చాంపియన్ ఆఫ్ చాంపియన్స్ టైటిల్‌ను సాధించాను’ అని జీతూ రాయ్ తెలిపాడు.
గగన్, చెయిన్ సింగ్‌లకు నిరాశ
మరోవైపు పురుషుల 50 మీటర్ల ప్రోన్ ఈవెంట్లో పోటీపడ్డ చెయిన్ సింగ్, గగన్ నారంగ్, సుశీల్ ఘాలే పతకం నెగ్గడంలో విఫలమయ్యారు. చెయిన్ సింగ్ ఫైనల్‌కు చేరుకున్నా 141.9 పాయింట్లు సాధించి ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. క్వాలిఫయింగ్‌లో సుశీల్ 617.9 పాయింట్లు, గగన్ నారంగ్ 617 పాయింట్లు స్కోరు చేసి వరుసగా 12వ, 15వ స్థానాల్లో నిలిచి ఫైనల్ రౌండ్‌కు అర్హత పొందలేకపోయారు. ఫైనల్లో తొషికాజు యమషిటా (జపాన్) 249.8 పాయింట్లతో ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు పసిడి పతకాన్ని గెల్చుకున్నాడు. లియు యుకున్ (చైనా–249.3 పాయింట్లు) రజతం, డానియల్ రోమన్జికి (పోలాండ్–226.6 పాయింట్లు) కాంస్యం సాధించారు. ఇప్పటివరకు భారత్ ఈ టోర్నీలో ఒక రజతం, రెండు కాంస్యాలు నెగ్గి మూడు పతకాలతో ఐదో స్థానంలో ఉంది. చైనా ఆరు స్వర్ణాలు, ఐదు రజతాలతో అగ్రస్థానంలో ఉంది.