రూ. 134 కోట్లతో భారీ కాంప్లెక్స్
జీహెచ్ఎంసీ సన్నాహాలు
చిలకలగూడలో నిర్మాణానికి యోచన
ప్రతిపాదనలు సిద్ధం
వచ్చేవారం స్టాండింగ్ కమిటీ ముందుకు..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో భారీ కాంప్లెక్స్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ప్రస్తుతం అబిడ్స్, కోఠి, సికింద్రాబాద్, హబ్సిగూడ, నాచారం తదితర ప్రాంతాల్లో భారీ షాపింగ్ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. మొత్తం 18 కాంప్లెక్స్‌లలో 600కు పైగా యూనిట్లు ఉన్నాయి. వీటన్నింటినీ తలదన్నేలా రెండెకరాలకు పైగా విస్తీర్ణంలో రెండు సెల్లార్లు, గ్రౌండ్‌ఫ్లోర్‌తో పాటు మరో నాలుగంతస్తుల్లో భారీ భవన సముదాయాన్ని నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీని అంచనా వ్యయం రూ.134 కోట్లు. వచ్చేవారం జరుగనున్న స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదం పొందాక ఈ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించనున్నారు.
సికింద్రాబాద్ చిలకలగూడలో కూల్చివేసిన జీహెచ్ఎంసీ పాత షాపింగ్ కాంప్లెక్స్ స్థానంలోనే కొత్తది నిర్మించనున్నారు. దీనిని జీహెచ్ఎంసీ అవసరాలకు వినియోగించుకోవడంతో పాటు మిగతా యూనిట్లను వివిధ సంస్థలు లేదా దుకాణాలకు అద్దెకుఇవ్వనున్నారు. ఇందులో ఒక అంతస్తును జీహెచ్ఎంసీ కార్యాలయాలకు వినియోగించుకొని, మిగతా వాటిని అద్దెకివ్వాలనేది ప్రస్తుత ఆలోచన. భవిష్యత్‌లో మార్పు చేర్పులకు వీలుంది. మొత్తం భవనాన్ని జీహెచ్ఎంసీయే వినియోగించుకోవడమా లేక అద్దెకివ్వడమా అనేది అప్పటి అవసరాలను బట్టి నిర్ణయిస్తారు.
అమలు ఎప్పటికో?
ఇదిలా ఉండగా, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయ అవసరాలకు కొత్త ఆఫీస్ కమ్ కౌన్సిల్ కార్యాలయ భవనాన్ని నిర్మించాలని సుమారు రెండేళ్ల క్రితం నిర్ణయించారు. రూ.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టగా, స్టాండింగ్ కమిటీ, జనరల్ కౌన్సిల్ ఆమోదం కూడా లభించాయి. ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదు.
లోయర్ ట్యాంక్ బండ్ వద్ద సన్నాహాలు చేయగా, ఆటంకాలు ఎదురయ్యాయి. భవన నిర్మాణానికి వీలుగా అక్కడి చెత్త ట్రాన్స్ఫర్ కేంద్రాన్ని వేరే ప్రాంతానికి తరలించాల్సి ఉంది. అందుకు వేరే ప్రదేశం కనిపించకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయ కాంప్లెక్స్ అవసరాలకు సరిపడా లేదని, జనరల్ కౌన్సిల్ సమావేశాల కోసం తగిన కౌన్సిల్ హాల్ కూడా లేనందున రెండింటి అవసరాలు తీరేలా కొత్త ఆఫీస్ కమ్ కౌన్సిల్ కార్యాలయాన్ని ఏడంతస్తుల్లో నిర్మించాలని భావించారు.
అదీ అమలుకు నోచలేదు. ఈ నేపథ్యంలో రూ. 134 కోట్ల వ్యయమయ్యే కొత్త భవనం నిర్మాణం కూడా ఎంతవరకూ కార్యరూపం దాల్చుతుందోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.