బోగస్ కార్డుల మాయాజాలం
- ఏరివేత సాధ్యమేనా!
- జిల్లాలో 6.70 లక్షల కార్డులు జారీ
- డీలర్ల వద్దే 5 వేల తెల్లకార్డులు, 10 వేల కూపన్లు
- అధికారులు గుర్తించనివి ఎన్నో..
- షాపుల బైఫర్‌కేషన్‌ను అడ్డుకుంటున్న సిండికేట్
కలెక్టరేట్ : బోగస్ రేషన్ కార్డుల ఏరివేతపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు శనివారం సీఎం కేసీఆర్ ఆధికారులతో సమీక్ష నిర్వహించారు.అయితే జిల్లాలో బోగస్ కార్డుల ఏరివేత సాధ్యమేనా అన్న సంశయం తలెత్తుతోంది. జిల్లాలో దాదాపు 25 లక్షలకు పైగా జనాభా ఉండగా 6.70 లక్షల వరకు కార్డులు ఉంటాయి. నిజామాబాద్ నగరంలోని 87 రేషన్ షాపుల పరిధిలో 78,236 కార్డులు ఉన్నాయి. కాగా నిబంధనలకు విరుద్ధంగా రేషన్‌షాపులకు కార్డులను కేటాయించారు.
ఒక షాపులో 300 కార్డులు ఉంటే మరో షాపుకు 3వేలకు పైగా రేషన్‌కార్డులను జారీ చేశారు. ఒక్కోషాపుకు కార్డుల కేటాయింపులో ఇంత వ్యత్యాసం ఉండడం బోగర్ కార్డులను నిర్ధారిస్తోందని పలువురు పేర్కొంటున్నారు. అయితే రేషన్ షాపుల విభజన (బైఫరికేషన్)ను 2008 సంవత్సరంలోనే చేపట్టాల్సి ఉండగా అధికారులు, పాలక వర్గాలు మీనమేషాలు లెక్కించాయి.
ఇప్పటి వరకు బైఫరికేషన్ జరగలేదు. వాస్తవానికి నగరంలో ఒక్కో షాపునకు 650 కార్డులకంటే ఎక్కువ కార్డులు ఉండరాదన్నా నిబంధనలు ఉన్నాయి. 2009 సంవత్సరంలో నగరంలోని రేషన్ దుకాణాల బైఫర్కేషన్కు సంబంధించి నోటిపికేషన్‌ను జారీ చేశారు. అనంతరం యూనియన్ నాయకుల ఒత్తిడి మేరకు బైఫరికేషన్ ప్రక్రియను నిలిపివేశారు. అప్పటి నుంచి బైఫరికేషన్ను పట్టించుకున్నవారే లేరు. దుకాణాల్లో కార్డుల విభజన విషయం తెరమీదికి వచ్చేసరికి యూనియన్ నాయకులు రంగ ప్రవేశం చేసి అధికారులు, పాలక వర్గాలపై ఒత్తిడి తీసుకువచ్చేవారని ఆరోపణలు ఉన్నాయి.
ఇటీవల 26 రేషన్ షాపుల్లో 5 వేల బోగస్ తెల్ల కార్డులను అధికారులు గుర్తించారు. ఇంతే కాకుండా 10వేల రేషాన్ కూపన్ల వరకు డీలర్ల వద్దే పెట్టుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో నెలకు 20 వేల క్వింటాళ్ల రుపాయి కిలో బియ్యం పక్కదాని పడుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ. 40 లక్షల వరకు ఉంటుందని అధికారిక వర్గాలే చెబుతున్నాయి.
డీలర్లు ఇంత పెద్ద ఎత్తున రుపాయి కిలో బియ్యాన్ని మింగేస్తున్నారు. ఎక్కువ రేషాన్ కార్డులు డీలర్లే రుపాయి బియ్యాన్ని అధికారులతో కుమ్మక్కై రీసైక్లింగ్ కోసం రైస్ మిల్లులకు తరలిస్తున్నట్లు సమాచారం. ఇటీవల అర్సపల్లిలో దొరికిన పీడీఎస్ బియ్యం బస్తాలు నగరానికి సంబంధించిన రేషన్ షాపులవేనని అధికారులు పేర్కొన్నారు. బియ్యం కూడా ఎఫ్‌సీఐ నుంచి ఎంఎల్ఎస్ పాయింట్‌కు వెళ్లకుండా నేరుగా గోదాంకు తరలడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
బోగస్ లబ్ధిదారులను సృష్టించి వేలిముద్రలు రిజిష్టర్‌లో నమోదు చేసి బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. అయితే అధికారులు గుర్తించిన వాటిలో కూడ నగరంలో 26 షాపులను బైఫరికేషన్ చే యాల్సి ఉందని వారి విచారణలో తేలింది. ఈ విషయాన్ని నిజామాబాద్ తహశీల్దార్‌తో పాటు,ఆర్డీవో జిల్లా సివిల్ సప్లై అధికారులకు నివేదిక సమర్పించారు. వారు కమిషనర్‌కు నగరంలోని 26 రేషన్ షాపుల బైఫరికేషన్పై నివేదిక ఇచ్చారు. ఈ షాపులను బైఫరికేషన్ చేస్తే కొంతైన బోగస్ కార్డులకు చెక్ పడుతుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.