కొంప ముంచిన పుట్టినరోజు!!
ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ప్రతి ఒక్క విషయాన్నీ క్షుణ్ణంగా చూసుకోవాలి. పార్లమెంటుకు గానీ పోటీ చేయాలంటే కనీసం 25 ఏళ్ల వయసు ఉండాలని భారత రాజ్యాంగంలోని 84 (బి) అధికరణం స్పష్టంగా చెబుతోంది. అలాగే, అసెంబ్లీకి పోటీ చేయాలన్నా కూడా ఇంతే వయసు ఉండాలని రాజ్యాంగంలోని 173(బి) అధికరణం, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 36(2) సెక్షన్ చెబుతున్నాయి. తనకు ఎటూ పాతికేళ్ల వయసు వచ్చేసింది కదా అని ఓ యువకుడు ఉత్సాహం చూపించాడు. అభ్యర్థులు దొరకడం లేదు కదా.. దొరికిన వాళ్లు ఎవరో ఒకరికి ఇచ్చేద్దాం అని ఓ పార్టీ కూడా ఉత్సహం చూపించింది. అయితే అటు పార్టీ నాయకులు గానీ, ఇటు పోటీ చేసిన అభ్యర్థి గానీ.. ఇద్దరూ ఆయన వయసు విషయాన్ని పట్టించుకోలేదు.
పదోతరగతి సర్టిఫికెట్ ప్రకారం ఉన్న వయసును పరిగణనలోకి తీసుకుంటారు. విశాఖ జిల్లా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గానికి జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున వినోద్‌కుమార్ అనే యువకుడు నామినేషన్ దాఖలు చేశాడు. అయితే, అతడి వయసు 25 సంవత్సరాలకు రెండు రోజులు తక్కువగా ఉన్నట్లు నామినేషన్ల పరిశీలనలో తేలింది. దాంతో.. వినోద్‌కుమార్ నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి సుబ్బరాజు ప్రకటించారు. అంతే.. తొలిసారి అసెంబ్లీ బరిలోకి దూకుదామనుకున్న వినోద్‌కుమార్ ఆశలు కాస్తా అడియాసలయ్యాయి.