short films competition
-
రాజకీయ ప్రవేశంపై రాజేంద్రుడి కామెంట్
పాలకొల్లు అర్బన్: రాజకీయాలు తనకు పడవని, తన 40 ఏళ్ల సినిమా కెరీర్లో అందర్నీ ఆనందింపజేయడమే ఇష్టమని నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో క్షీరపురి అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ సంస్థ ఆయనను ‘జీవిత సాఫల్యతా పురస్కారం’తో ఘనంగా సత్కరించింది. టామీ సినిమాలో ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నంది అవార్డు అందుకున్నందుకు ఆయనకు ఈ పురస్కారం ఇచ్చింది. ఉత్తమ లఘుచిత్రం ‘క్రీమిలేయర్’ పాలకొల్లు అర్బన్: క్షీరపురి అంతర్జాతీయ లఘు చలన చిత్రోత్సవ పోటీల్లో ఉత్తమ లఘుచిత్రంగా స్కైవ్యూ క్రియేషన్స్, శ్రీకాకుళం కథా రచయిత విజయ్‌కుమార్ చిత్రీకరించిన ‘క్రీమిలేయర్’ ఎంపికైంది. ఈ చిత్రోత్సవం స్థానిక రామచంద్ర గార్డెన్స్‌లో శనివారం కోలాహలంగా సాగింది. ద్వితీయ ఉత్తమ చిత్రంగా మాజీ ఎంపీ చేగొండి హరరామ జోగయ్య నిర్మించిన ఇండియా ఈజ్ డెడ్, తృతీయ ఉత్తమ చిత్రంగా గోదావరి టాకీస్ చిత్రం, రాజమండ్రి కథా రచయిత సి.కల్యాణ్ రూపొందించిన ‘బి అలర్ట్’ ఎంపికయ్యాయి. విజేతలకు వరుసగా రూ.60 వేలు, రూ.40 వేలు, రూ.20 వేల నగదు పారితోషికాలతో పాటు షీల్డ్‌లు అందజేశారు. స్పెషల్ జ్యూరీ అవార్డులను ఇండియా ఈజ్ డెడ్‌లో ఇండియా పాత్రధారి చంద్రిక, పేరులో వికలాంగుడు పాత్రధారి సతీష్ సుంకర దక్కించుకున్నారు. స్పెషల్ జ్యూరీ చిత్రాలుగా మాతృదేవోభవ, హెల్మెట్ ఎంపికయ్యా యి. ఉత్తమ ఎడిటింగ్ మీ కోసమే లఘుచిత్రం ఫణిశ్రీ, ఉత్తమ కెమెరామెన్‌గా ఇండియా ఈజ్ డెడ్‌లో మోహన్‌చంద్, ఉత్తమ కథా రచయితగా బి అలర్ట్ కల్యాణ్, ఉత్తమ దర్శకుడిగా ఇండియా ఈజ్ డెడ్‌లో రాజేంద్రకుమార్ బహుమతులు అందుకున్నారు. జ్యూరీ కమిటీ సభ్యులుగా జనా ర్థన మహర్షి, ఎంవీ రఘు, పద్మిని, కె.వెంకట్రాజు, ఎ.బాబూరావు, కె.సురేష్, ఎన్. గోపాల్, డి.రవీంద్ర వ్యవహరించారు. -
ఐడియాతో రండి.. షార్ట్‌ఫిల్మ్‌తో వెళ్లండి
ఐడియా ఉంటే చాలు షార్ట్ ఫిల్మ్ తీసేయొచ్చు. బుల్లి సినిమా తీసే క్రమంలో ఏ సహకారం, సమాచారం కావాలన్నా ఇట్టే అందిస్తోంది ఓ వెబ్సైట్ www.shortfilmsintelugu.in తెలుగులో షార్ట్ ఫిలింస్ తీస్తున్నవారు చాలా మందే ఉన్నారు. వారి కోసమే ఒక ఎక్స్‌క్లూజివ్ వెబ్సైట్ రూపొందించారు. విజయ్.కె.అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆ వివరాలేంటో ఆయన మాటల్లో... ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ ట్రెండ్ నడుస్తోంది. ఎవరైనా మా వెబ్‌సైట్‌కి ఐడియాతో వస్తే షార్ట్‌ఫిల్మ్‌తో బయటకు వెళ్తారు. బుల్లి సినిమాలకు వన్ డోర్ సొల్యూషన్ ఇవ్వాలని స్టార్ట్ చేశాను. మా వెబ్సైట్ ఓన్లీ తెలుగు షార్ట్‌ఫిల్మ్స్ గురించి మాత్రమే. మొదట్లో షార్ట్ఫిల్మ్స్కి చిన్న, చిన్న రివ్యూస్ రాసేవాడిని. నా కామెంట్స్‌కి రెస్పాన్స్ బాగా వచ్చింది. ఈ క్రమంలో నటన, దర్శకత్వం వంటి వాటిపై దరఖాస్తులను ఆహ్వానిస్తే వారంలోనే 100 అప్లికేషన్స్ వచ్చాయి. ఇప్పుడు రోజుకు 300, 400 మంది అప్రోచ్ అవుతున్నారు. అందరికీ రెస్పాన్స్ ఇస్తున్నాం. సినిమా ఎందుకు తియ్యాలనుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకుంటాను. సినిమాలను కెరీర్‌గా చేసుకోవాలంటే గ్రౌండ్ వర్క్, హోంవర్క్ చేసుకోవాలని గైడ్ చేస్తుంటాను. ఎవరైనా స్టోరీ, కాన్సెప్ట్‌తో వస్తే అతని ఆ కలని రియాలిటీలోకి తీసుకువస్తాం. షార్ట్ ఫిల్మ్ మేకింగ్‌లో మూడు స్టెప్స్ ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ ఉంటాయి. వీటితోపాటు ప్లానింగ్‌లో కూడా హెల్ప్ చేస్తాం. ఏ స్టేజ్‌లో ఉన్నా చెక్ లిస్ట్ ద్వారా సహకరిస్తాం. ఇంకా ఇండివిడ్యువల్‌గా వెబ్సైట్లో షార్ట్‌ఫిల్మ్‌కి సంబంధించిన అన్ని కేటగిరీస్ ఉన్నాయి. వాటిల్లో ఫారం ఫిల్ చేసి మాకుడిటెయిల్స్ పంపిస్తారు. దానికి లింక్ తయారు చేస్తాం. ఆ డేటా ద్వారా ఫిలిం మేకర్స్ అడిగినప్పుడు వారిని సజెస్ట్ చేస్తాం. షార్ట్ ఫిలింస్‌లో హద్దులు మీరే సన్నివేషాలుండవనే అమ్మాయిలూ నటనపట్ల ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. స్క్రిప్ట్‌ను ఓకే చేసిన తర్వాత మేకర్స్‌కి వీళ్ల డిటెయిల్స్ పంపిస్తాం. కాలేజీ, లవ్వు, అమ్మాయి, బ్రేక్అప్ వీటి గురించి తీస్తున్నారు. నిజ జీవితకథలను తెరకెక్కించడమే ధ్యేయం. మా సర్వీసుకు ఎటువంటి చార్జెస్ లేపు. ఉచితంగా ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. వి మేక్ కనెక్షన్స్... షార్ట్ఫిల్మ్స్కి ఏం కావలసినా మా వెబ్సైట్ పేరు వినిపించాలనేది గోల్. షార్ట్‌ఫిల్మ్ డెరైక్టర్స్‌లో నుంచిఒక్కరైనా టాలీవుడ్ సినిమా తియ్యాలని నా ఆశ. - మధు -
దాసరి లఘుచిత్రాల పోటీ
సాక్షి, సిటీబ్యూరో : దాసరి పుట్టిన రోజు సందర్భంగా లఘు చిత్రాల పోటీని నిర్వహిస్తున్నామని దాసరి కల్చరల్ కమిటీ అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ్ చెప్పారు. మే 4న డా. దాసరి నారాయణరావు పుట్టిన రోజు సందర్భంగా జరిపే కార్యక్రమాల వివరాలను సోమవారం హైదరాబాద్‌లో జరిపిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. అనంతరం దాసరి కల్చరల్ కమిటీ కన్వీనర్ రేలంగి నరసింహారావు మాట్లాడుతూ ‘సామాజిక బాధ్యత కథాంశాలతో తీసిన 5 నుంచి 25 నిమిషాల నిడివిగల చిత్రాలను పోటీకి ఆహ్వానిస్తున్నాం. ఏడాది లోపు తీసిన చిత్రాలు మాత్రమే ఈ పోటీలోకి తీసుకుంటాం. అవి సోషల్ నెట్‌వర్క్‌లో ప్రదర్శించిన చిత్రాలైనా పర్లేదు. ఈనెల 26వ తేదీలోపు లఘుచిత్రాలను డీవీడీ రూపంలో చరిత్ర ఆఫీసు, ప్లాట్ నెం.183, గ్రీన్‌బావర్చీ హోటల్ వెనుక, కమలాపురికాలనీ, హైదరాబాద్-73 చిరుమానాలో అందజేయాలి. మే 4న హైదరాబాద్‌లో జరిగే దాసరి జన్మదిన వేడుకలో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు రెండు ప్రోత్సాహక బహుమతులు కూడా అందిస్తాం’ అని తెలిపారు. కార్యక్రమంలో జర్నలిస్ట్ ప్రభు, లఘుచిత్ర దర్శకుడు కత్తి మహేశ్ కూడా మాట్లాడారు.