ఫైనల్లో శ్రేష్ట, శ్రావ్య
► హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ బాలికల సింగిల్స్ (అండర్-13) విభాగంలో శ్రేష్ట రెడ్డి, శ్రావ్య ఫైనల్లోకి దూసుకెళ్లారు. సోమవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో శ్రేష్ట 15-11, 11-15, 15-13 తేడాతో కె.వెన్నెలపై విజయం సాధించింది. మరో సెమీస్‌లో శ్రావ్య 17-15, 19-17తో పల్లవి జోషిని ఓడించింది. బాలుర విభాగం (అండర్-13)లో ఉన్నిత్ కృష్ణ, నికశిప్త శౌర్య తుది పోరుకు అర్హత సాధించారు.
తొలి సెమీస్‌లో ఉన్నిత్ 15-8, 15-12తో ఎం. శశాంక్ సాయిపై గెలుపొందగా, మరో సెమీస్‌లో నికశిప్త శౌర్య 15-8, 15-13తో శ్రీమాన్ ప్రీతమ్‌ను చిత్తు చేశాడు. అంతకు ముందు జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్ రెడ్డి ఈ పోటీలను ప్రారంభించారు. హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వి.చాముండేశ్వరీనాథ్, పాణీరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.