shrmila
-
కొల్లేరు సమస్యలు పరిష్కరిస్తాం
సాక్షి, పెదవేగి రూరల్/ఏలూరు(సెంట్రల్): మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొల్లేరు ప్రజల సమస్యలను పరిష్కరిస్తాం.. కొల్లేరు విషయంలో శాశ్వత పరిష్కారం చూపించేందుకు తిరిగి సర్వే చేయిస్తాం.. కొల్లేరువాసులు ధైర్యంగా ఉండండి’ అంటూ వైఎస్ షర్మిల భరోసా ఇచ్చారు. పెదవేగి మండలం నడిపల్లి గ్రామంలో కొల్లేరు ప్రజలు, మహిళలు, మత్స్యకారులతో ఏర్పాటుచేసిన ముఖాముఖీలో బుధవారం ఆమె మాట్లాడారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అక్రమాలు, కొల్లేరు సమస్యలపై ప్రజలు ఆమె వద్ద ఏకరువు పెట్టారు. డ్వాక్రా రుణాలు మాఫీకాకపోవడంతో వడ్డీకి అప్పులు చేసి బ్యాంకు రుణాలు చెల్లించామని, పసుపు–కుంకుమ సొమ్ములు వడ్డీలకు కూడా సరిపోవడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన ఓ మహిళ తన బిడ్డకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదని, అధికార పార్టీ అనుయాయులకే పథకాలు అందిస్తున్నారని షర్మిల వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. మత్స్యకార అభివృద్ధి బోర్డు, రెగ్యులేటర్, ఎస్సీ సొసైటీలు, ఐదో కాంటూర్‌లో జిరాయితీ భూములు, నష్టపరిహారం, రీ సర్వే తదితర సమస్యలను కొల్లేరు గ్రామస్తులు షర్మిలకు వివరించారు. చింతమనేనికి ఓటుతో బుద్ధి చెప్పండి వైఎస్ షర్మిల మాట్లాడుతూ మహిళా తహసీల్డార్ వనజాక్షిని జుట్టు పట్టుకుని కొట్టిన సంఘటన తాను టీవీలో చూశానని.. చింతమనేని దుర్మార్గాలు ఒక్కొక్కటిగా తెలుస్తుంటే అతను మనిషా.. పశువా అని ప్రశ్నించారు. చింతమనేనికి పోయేకాలం వచ్చిందని అతడిపై 38కి పైగా కేసులు ఉన్నాయంటేనే అర్థమవుతుంది అతడు ఏలాంటి వాడో అని అన్నారు. చంద్రబాబు ప్రోత్సాహంతోనే చింతమనేని రెచ్చిపోతున్నారన్నారు. ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్న వ్యక్తికి తిరిగి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని.. ఇది అతడిని చంద్రబాబు ప్రోత్సహించడం కాదా అని ప్రశ్నించారు. చింతమనేని ప్రభాకర్‌కు ప్రజలంతా ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చింతమనేని అక్రమాలపై చర్యలు తీసుకునే బాధ్యత తీసుకుంటామని, కొల్లేరు సమస్యను జగనన్న పరిష్కరిస్తారని, కొల్లేరును రీసర్వే చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా నిర్ణయం తీసుకుంటారన్నారు. నవరత్నాలతో అందరి జీవితాల్లో వెలుగులు జగనన్న నవరత్నాలతో అందరి జీవితాల్లో వెలుగులు నింపుతారని, పిల్లలను బడికి పంపిస్తే ఏడాదికి రూ.15 వేలు ఇస్తారని, డ్వాక్రా రుణమాఫీ చేసి ఆ సొమ్మును నేరుగా అక్క, చెల్లెమ్మలకు అందిస్తారని షర్మిల అన్నారు. వృద్ధులకు పెన్షన్ రూ.2 వేల నుంచి రూ.3 వేలు చేస్తారని, జగనన్నకి ఒక్కసారి అవకాశం ఇస్తే అందరి కష్టాలు తీరుస్తారన్నారు. పిల్లల చదువులకు ఎంత ఖర్చయినా ప్ర భుత్వమే భరించేలా జగనన్న చూస్తారన్నారు. దీంతో పాటు మెస్ ఛార్జీలకు రూ.20 వేలు ఇస్తారన్నారు. ప్రతి రైతుకు మే నెలలో రూ.12 వేలు పెట్టుబడి సాయం అందిస్తారని, రూ.3 వేల కోట్లతో రైతులకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారని, కరువు, వరదలతో పంటలు నష్టపోతే ఆదుకునేందుకు రూ.4 వేల కోట్లతో నిధి ఏ ర్పాటుచేస్తారన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసీ టీడీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుదామన్నారు. రాజన్నరాజ్యం జగనన్నతోనే సా ధ్యమన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంటరీ ని యోజకవర్గ అభ్యర్థి కోటగిరి శ్రీధర్, దెందులూరు అసెంబ్లీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్ హామీతో సంతోషం: మండల కొండలరావు నా పేరు మండల కొండలరావు, మాది శ్రీపర్రు. కొల్లేరు చెరువులను చాలా వరకు ధ్వంసం చేయడంతో ఉపాధి కోల్పోతున్నాం. సుమారు లక్ష మంది వరకు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లారు. కొల్లేరు ప్రాంతాన్ని రీ సర్వే చేయాలని, సమస్యలు పరిష్కరించాలని జగన్మోహన్రెడ్డికి కొల్లేరు ప్రాంతంలో పాదయాత్ర చేసిన సమయంలో వినతిపత్రం ఇచ్చాం. మా సమస్యలు చట్టసభల్లో చెప్పేందుకు కొల్లేరు ప్రాంతానికి ఎమ్మెల్సీని ఇస్తానని ఆయన హామీ ఇవ్వడం సంతోషం. అన్ని సమస్యలు పరిష్కరిస్తాం: వైఎస్ షర్మిల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కొల్లేరు ప్రాంతంలోని ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయి. జగన్ ఇచ్చిన మాట తప్పరు. ఐదేళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజల సమస్యలను గాలికి వదిలేసింది. ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమైంది. చింతమనేని వేధింపులు ఎక్కువయ్యాయి: జీవమణి నాపేరు జీవమణి, మహిళా సమాఖ్య మాజీ అధ్యక్షురాలిని. మహిళా సమాఖ్య అధ్యక్షురాలుగా పనిచేస్తున్న నన్ను కాలపరిమితి ఉన్నా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కావాలనే పదవి నుంచి తొలగించారు. మానసికంగా వేధింపులకు దిగారు. మహిళ అని కూడా చూడకుండా ఇబ్బందులు పెట్టారు. దీంతో నా ఆరోగ్యం కూడా క్షీణించింది. ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్ధాలే..: భలే జయలక్ష్మి నా పేరు భలే జయలక్ష్మి, గుడివాకలంక. ఇల్లు నిర్మించుకునేందుకు రుణాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం మోసం చేసింది. ప్రభుత్వ సబ్సిడీ వస్తుంది కదా అని అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాం. అయినా సబ్సిడీ రాకపోవడంతో అప్పులు తీర్చలేని పరిస్థితి. మొదట డ్వాక్రా రుణమాఫీ విషయంలో మోసపోయాం. ఇళ్ల సబ్సిడీ విషయంలో మరోసారి మోసపోయాం. కేసులన్నీ బయటకు తీస్తాం: వైఎస్ షర్మిల బాధ్యత గత ఎమ్మెల్యే పదవిలో ఉన్న చింతమనేని ప్రభాకర్ ఆడామగా అనే తేడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. మహిళా తహసీల్దార్‌పై దాడిచేశారు. చింతమనేని ప్రభాకర్ మనిషా లేక పశువా. 34 కేసులు ఉన్న ఈ రౌడీ ఎమ్మెల్యేకే సీఎం చంద్రబాబు మళ్లీ టికెట్ ఇచ్చారు. ఇటువంటి వ్యక్తి చట్టసభలకు వెళ్లడం అవసరమా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చింతమనేని ప్రభాకర్‌పై నమోదైన కేసులన్నీ బయటకు తీస్తాం. వలసలు పోవాల్సిన దుస్థితి: ఘంటసాల దుర్గ నా పేరు ఘంటసాల దుర్గ, మాది గుడిపాడు గ్రామం. డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చంద్రబాబు మహిళలను మోసం చేశారు. ఇప్పుడు ఎన్నికల వస్తున్నాయని చెప్పి పసుపు–కుంకుమ పేరుతో రూ.10 వేలు ఇస్తున్నారు. ఇవి వడ్డీలకు కూడా సరిపోవు. కొల్లేరు ప్రాంతంలోని చెరువులను కొట్టివేయడంతో ఉపాధి లేక వలసలు పోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికే చాలా మంది ఊళ్లు వదిలి వెళ్లిపోతున్నారు. ఓట్ల కోసం మోసం చేస్తున్నారు: వైఎస్ షర్మిల గత ఎన్నికల సమయంలో చంద్రబాబు చాలా హామీలు ఇచ్చారు. ఇప్పుడు మరలా ఎన్నికలు వస్తున్నాయని పసుపు–కుంకుమ అంటూ డబ్బులు ఇస్తూ మభ్యపెడుతున్నారు. ఆ సొమ్ము వడ్డీలకు కూడా సరిపోదు. ఓట్ల కోసం చంద్రబాబు మోసం చేస్తున్నారనే విషయాన్ని మహిళలంతా గుర్తించాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కొల్లేరు ప్రాంతంలో ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. చెరువులను స్వాధీనం చేసుకున్న ఎమ్మెల్యే: తిరుపతిరావు నా పేరు సైదు తిరుపతిరావు, మాది ప్రత్తికోళ్లలంక గ్రామం. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొల్లేరు గ్రామాల్లోని చెరువులన్నీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వాధీనం చేసుకుని, చెరువుల్లో చేపలను అమ్ముకున్నారు. ఇలా మూడేళ్లుగా రూ.13 కోట్ల వరకు దోచుకున్నారు. ఐక్యంగా ఉండే గ్రామస్తుల మధ్య గొడవలు పెట్టి వర్గాలుగా తయారుచేయడంతో గ్రామాల్లో ఉండలేని పరిస్థితి. ఏడు నెలల నుంచి ఏలూరులో తలదాచుకుంటున్నా. ఎమ్మెల్యే చింతమనేని చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోకపోగా తిరిగి ఆయనకే ఎమ్మెల్యే టికెట్ కట్టబెట్టారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే..: వైఎస్ షర్మిల సీఎం చంద్రబాబు అలా ఉన్నారు కాబట్టే ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇలా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, చింతమనేని ప్రభాకర్‌కు తగ్గిన బుద్ధి చెప్పాలని ప్రచారం చేయండి. త్వరలో రాబోయే రాజన్న రాజ్యంలో ప్రజలందరికీ మేలు జరుగుతుంది. కొల్లేరు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా రీ సర్వే చేయిస్తాం. మీరు ధైర్యంగా ఉండండి.. మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొల్లేరు ప్రజల సమస్యలు పరిష్కరిస్తాం. -
జన నీరాజనం
సాక్షి, ఉయ్యూరు/ పెడన : గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో మునిసిపల్ ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని షర్మిల జిల్లాకు వచ్చారు. విజయవాడలో ఆమెకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం పెనమలూరు, కంకిపాడు మీదుగా ఉయ్యూరు సెంటరుకు చేరుకున్నారు. షర్మిల రాకను తెలుసుకుని పెద్ద ఎత్తున జనం తరలిరావటంతో ఉయ్యూరు మెయిన్ సెంటరులో జనం పోటెత్తారు. సభలో ఏకధాటిగా షర్మిల చేసిన ప్రసంగం ప్రజలను ఆకట్టుకుంది. పామర్రులో నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త ఉప్పులేటి కల్పన ఆధ్వర్యంలో షర్మిలను సాదరంగా ఆహ్వానించారు. జనసంద్రంగా పెడన... షర్మిల రాకకు ముందుగానే పెడన బస్టాండ్ ప్రాంతం జనసంద్రమైంది. ఉప్పొంగే ప్రజల ఉత్సాహం మధ్య ఆమె చేసిన ప్రసంగం అందరినీ ఆలోచింపజేసింది. ప్రసంగం ముగింపులో మునిసిపల్ అభ్యర్థిని సభికుల హర్షధ్వానాల నడుమ ప్రకటించారు. పెడనలో బహిరంగ సభ అనంతరం హనుమాన్‌జంక్షన్ వరకు షర్మిల బస్సు యాత్ర సాగింది. దారి పొడవునా స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలు షర్మిలకు ఆత్మీయ స్వాగతం పలికారు. జిల్లాకు చెందిన ముఖ్య నేతలు పేర్ని నాని, కొడాలి నాని, కేవీఆర్ విద్యాసాగర్, తాతినేని పద్మావతి, పడమట సురేష్‌బాబు, ఉప్పాల రాంప్రసాద్, మావులేటి వెంకటరాజు, గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిల వెంట ఉన్నారు. పేలిన మాటల తూటాలు... షర్మిల తన ప్రసంగంలో మాటల తూటాలను పేల్చారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర, సమైక్యాంధ్ర బస్సు యాత్ర రెండు సందర్భాల్లో జిల్లాకు వచ్చిన షర్మిల ఆయా సందర్భాలను ప్రజలకు వివరించగలిగారు. మూడో పర్యాయం మునిసిపల్ ఎన్నికల కోసం ప్రచారానికి వచ్చిన ఆమె చేసిన ఉపన్యాసశైలి ప్రజలను మరింత ఆకట్టుకుంది. వైఎస్సార్ చేపట్టిన పథకాలు, చంద్రబాబు వైఫల్యాలు, కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్లక్ష్యం వంటి అంశాలను సూటిగా ప్రస్తావించిన ఆమె అందుకు ఉదాహరణలను కూడా చెప్పి ప్రజలను ఆలోచింపజేశారు. వైఎస్ చేపట్టిన ప్రతి పథకం కొనసాగాలంటే జగనన్నను ఆదరించి సీఎంను చేయాలనే విషయాన్ని ఆమె వివరించిన తీరును ప్రజలు ప్రశంసించటం విశేషం. నక్క వాతలు పెట్టుకుంటే పులి కాదు... షర్మిల ఎన్నికల ప్రచారంలో వైఎస్‌కు, చంద్రబాబుకు ఉన్న పోలికపై పులి, నక్క ప్రస్తావన చేయటంతో ప్రజలు హర్షధ్వానాలు చేశారు. ఒక్క పన్ను వేయకుండా, చార్జీలు పెంచకుండా, ప్రజాసంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసిన రికార్డు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిదే అని ప్రస్తావించారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో వ్యవసాయం దండగని, ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరవేసుకోవాలని, రుణమాఫీ కుదరదని తెగేసి చెప్పారని విమర్శించారు. అంతేకాక విద్యుత్ చార్జీలపై ఉద్యమించినవారిని పోలీసులతో కాల్పించి, అంగన్వాడీ వర్కర్లను గుర్రాలతో తొక్కించిన చరిత్రహీనుడు బాబు అని విమర్శించారు. అటువంటి చంద్రబాబు ఇప్పుడు గతంలో వైఎస్ చేసిన పథకాలను అమలు చేస్తానంటూ ఉచిత హామీలు ఇస్తూ ఆల్ ఫ్రీ బాబుగా గుర్తింపు పొందారని ఎద్దేవా చేశారు. వైఎస్ పులి అని ఆయనను చూసి నక్క లాంటి చంద్రబాబు వాతలు పెట్టుకున్నా పులి పులే.. నక్క నక్కేనని షర్మిల వ్యాఖ్యానించటంతో పెడనలో ప్రజలు కరతాళ ధ్వనులు చేశారు. పెడన కలంకారీ పరిశ్రమకు ఊతమిద్దాం... పెడన మునిసిపాల్టీలో చేనేత, కలంకారీ కార్మికుల జీవనాన్ని మెరుగుపరిచేందుకు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో కృషి చేశారని షర్మిల గుర్తుచేశారు. ఇక్కడి కలంకారీ పరిశ్రమకు దేశ, విదేశాల్లో మంచి పేరు ఉందని, ఆ గొప్పతనాన్ని నిలబెట్టుకునేలా మనమంతా కలిసి కృషిచేద్దామని చెప్పారు. మోసపూరిత హామీలిచ్చే చంద్రబాబును, సీల్డు కవరులో సీఎంగా దిగబడ్డ కిరణ్‌కుమార్‌రెడ్డిని నమ్మవద్దని, వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్‌కు మద్దతుగా నిలిచి మన రాష్ట్రాన్ని మనమే అభివృద్ధి పునాదులపై పటిష్టంగా నిర్మించుకుందామన్నారు. కొత్త ఉత్సాహమిచ్చిన షర్మిల... మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థులను ప్రకటించిన షర్మిల వారిలో కొత్త ఉత్సాహం నింపారు. ఉయ్యూరు సభలో జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిగా తాతినేని పద్మావతిని, మునిసిపల్ చైర్మన్‌గా అబ్దుల్ రహీమ్‌ను దీవించాలని షర్మిల ప్రకటించారు. పెడన సభలో మునిసిపల్ చైర్మన్‌గా బండారు ఆనందప్రసాద్, మిగిలిన 22 మంది వైఎస్సార్ సీపీ కౌన్సిల్ అభ్యర్థులను దీవించి గెలిపించాలని షర్మిల పిలుపునిచ్చారు. మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలంటూ షర్మిల విజ్ఞప్తి చేశారు. మీ సంక్షేమం, మీ చిరునవ్వు జగనన్నకు ముఖ్యమని, మీరు ఆదరించి సీఎంను చేస్తే తన జీవితాన్ని సైతం మీ కోసం త్యాగం చేస్తారని షర్మిల భరోసా ఇచ్చారు. -
షర్మిల పర్యటన
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల గురువారం నుంచి జిల్లాలో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె నెల్లూరు జిల్లా కావలి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు చీమకుర్తి చేరుకుని అక్కడ సభలో ప్రసంగించిన తరువాత, సాయంత్రం 6 గంటలకు కనిగిరి వెళ్లి ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. రాత్రి అక్కడే బస చేస్తారు. ఈమేరకు జిల్లా కన్వీనరు డాక్టర్ నూకసాని బాలాజీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 21వ తేదీ ఉదయం ఆమె కనిగిరి నుంచి బయలుదేరి గిద్దలూరు చేరుకుంటారు. అక్కడ ఉదయం 10.30 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు మార్కాపురం వచ్చి అక్కడ ప్రసంగించిన తరువాత, గుంటూరు జిల్లా వినుకొండకు వెళతారు. రాత్రి అక్కడే బస చేసి, 22వ తేదీన ఉదయం పది గంటలకు అద్దంకి చేరుకుని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మధ్యాహ్నం గుంటూరు జిల్లా చిలకలూరిపేట చేరుకుని, అక్కడ ఎన్నికల ప్రచారం చేపట్టి, తిరిగి సాయంత్రం 6 గంటలకు చీరాల వచ్చి సభలో మాట్లాడతారు. షర్మిల రాక కోసం పార్టీ కార్యకర్తలు భారీగా స్వాగత ఏర్పాట్లు చే స్తున్నారు. ఈ సందర్భంగా నూకసాని బాలాజీ మాట్లాడుతూ షర్మిల సభలకు ప్రజలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని ఆరు మునిసిపాలిటీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం ఎగుర వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. షర్మిల పర్యటన సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ప్రచార సభలను విజయవంతం చేయడానికి ప్రతి కార్యకర్త ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.