సాక్షి, ఉయ్యూరు/ పెడన : గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో మునిసిపల్ ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని షర్మిల జిల్లాకు వచ్చారు. విజయవాడలో ఆమెకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం పెనమలూరు, కంకిపాడు మీదుగా ఉయ్యూరు సెంటరుకు చేరుకున్నారు. షర్మిల రాకను తెలుసుకుని పెద్ద ఎత్తున జనం తరలిరావటంతో ఉయ్యూరు మెయిన్ సెంటరులో జనం పోటెత్తారు. సభలో ఏకధాటిగా షర్మిల చేసిన ప్రసంగం ప్రజలను ఆకట్టుకుంది. పామర్రులో నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త ఉప్పులేటి కల్పన ఆధ్వర్యంలో షర్మిలను సాదరంగా ఆహ్వానించారు.
జనసంద్రంగా పెడన...
షర్మిల రాకకు ముందుగానే పెడన బస్టాండ్ ప్రాంతం జనసంద్రమైంది. ఉప్పొంగే ప్రజల ఉత్సాహం మధ్య ఆమె చేసిన ప్రసంగం అందరినీ ఆలోచింపజేసింది. ప్రసంగం ముగింపులో మునిసిపల్ అభ్యర్థిని సభికుల హర్షధ్వానాల నడుమ ప్రకటించారు. పెడనలో బహిరంగ సభ అనంతరం హనుమాన్‌జంక్షన్ వరకు షర్మిల బస్సు యాత్ర సాగింది. దారి పొడవునా స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలు షర్మిలకు ఆత్మీయ స్వాగతం పలికారు. జిల్లాకు చెందిన ముఖ్య నేతలు పేర్ని నాని, కొడాలి నాని, కేవీఆర్ విద్యాసాగర్, తాతినేని పద్మావతి, పడమట సురేష్‌బాబు, ఉప్పాల రాంప్రసాద్, మావులేటి వెంకటరాజు, గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిల వెంట ఉన్నారు.
పేలిన మాటల తూటాలు...
షర్మిల తన ప్రసంగంలో మాటల తూటాలను పేల్చారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర, సమైక్యాంధ్ర బస్సు యాత్ర రెండు సందర్భాల్లో జిల్లాకు వచ్చిన షర్మిల ఆయా సందర్భాలను ప్రజలకు వివరించగలిగారు. మూడో పర్యాయం మునిసిపల్ ఎన్నికల కోసం ప్రచారానికి వచ్చిన ఆమె చేసిన ఉపన్యాసశైలి ప్రజలను మరింత ఆకట్టుకుంది. వైఎస్సార్ చేపట్టిన పథకాలు, చంద్రబాబు వైఫల్యాలు, కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్లక్ష్యం వంటి అంశాలను సూటిగా ప్రస్తావించిన ఆమె అందుకు ఉదాహరణలను కూడా చెప్పి ప్రజలను ఆలోచింపజేశారు. వైఎస్ చేపట్టిన ప్రతి పథకం కొనసాగాలంటే జగనన్నను ఆదరించి సీఎంను చేయాలనే విషయాన్ని ఆమె వివరించిన తీరును ప్రజలు ప్రశంసించటం విశేషం.
నక్క వాతలు పెట్టుకుంటే పులి కాదు...
షర్మిల ఎన్నికల ప్రచారంలో వైఎస్‌కు, చంద్రబాబుకు ఉన్న పోలికపై పులి, నక్క ప్రస్తావన చేయటంతో ప్రజలు హర్షధ్వానాలు చేశారు. ఒక్క పన్ను వేయకుండా, చార్జీలు పెంచకుండా, ప్రజాసంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసిన రికార్డు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిదే అని ప్రస్తావించారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో వ్యవసాయం దండగని, ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరవేసుకోవాలని, రుణమాఫీ కుదరదని తెగేసి చెప్పారని విమర్శించారు. అంతేకాక విద్యుత్ చార్జీలపై ఉద్యమించినవారిని పోలీసులతో కాల్పించి, అంగన్‌వాడీ వర్కర్లను గుర్రాలతో తొక్కించిన చరిత్రహీనుడు బాబు అని విమర్శించారు. అటువంటి చంద్రబాబు ఇప్పుడు గతంలో వైఎస్ చేసిన పథకాలను అమలు చేస్తానంటూ ఉచిత హామీలు ఇస్తూ ఆల్ ఫ్రీ బాబుగా గుర్తింపు పొందారని ఎద్దేవా చేశారు. వైఎస్ పులి అని ఆయనను చూసి నక్క లాంటి చంద్రబాబు వాతలు పెట్టుకున్నా పులి పులే.. నక్క నక్కేనని షర్మిల వ్యాఖ్యానించటంతో పెడనలో ప్రజలు కరతాళ ధ్వనులు చేశారు.
పెడన కలంకారీ పరిశ్రమకు ఊతమిద్దాం...
పెడన మునిసిపాల్టీలో చేనేత, కలంకారీ కార్మికుల జీవనాన్ని మెరుగుపరిచేందుకు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో కృషి చేశారని షర్మిల గుర్తుచేశారు. ఇక్కడి కలంకారీ పరిశ్రమకు దేశ, విదేశాల్లో మంచి పేరు ఉందని, ఆ గొప్పతనాన్ని నిలబెట్టుకునేలా మనమంతా కలిసి కృషిచేద్దామని చెప్పారు. మోసపూరిత హామీలిచ్చే చంద్రబాబును, సీల్డు కవరులో సీఎంగా దిగబడ్డ కిరణ్‌కుమార్‌రెడ్డిని నమ్మవద్దని, వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్‌కు మద్దతుగా నిలిచి మన రాష్ట్రాన్ని మనమే అభివృద్ధి పునాదులపై పటిష్టంగా నిర్మించుకుందామన్నారు.
కొత్త ఉత్సాహమిచ్చిన షర్మిల...
మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థులను ప్రకటించిన షర్మిల వారిలో కొత్త ఉత్సాహం నింపారు. ఉయ్యూరు సభలో జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా తాతినేని పద్మావతిని, మునిసిపల్ చైర్మన్‌గా అబ్దుల్ రహీమ్‌ను దీవించాలని షర్మిల ప్రకటించారు. పెడన సభలో మునిసిపల్ చైర్మన్‌గా బండారు ఆనందప్రసాద్, మిగిలిన 22 మంది వైఎస్సార్ సీపీ కౌన్సిల్ అభ్యర్థులను దీవించి గెలిపించాలని షర్మిల పిలుపునిచ్చారు. మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలంటూ షర్మిల విజ్ఞప్తి చేశారు. మీ సంక్షేమం, మీ చిరునవ్వు జగనన్నకు ముఖ్యమని, మీరు ఆదరించి సీఎంను చేస్తే తన జీవితాన్ని సైతం మీ కోసం త్యాగం చేస్తారని షర్మిల భరోసా ఇచ్చారు.
జన నీరాజనం
Published Wed, Mar 26 2014 3:53 AM | Last Updated on Sat, Sep 2 2017 5:09 AM
Advertisement