Shubham Jaglan
-
శుభం కొత్త చరిత్ర
వరుసగా 2 టైటిల్స్ నెగ్గిన భారత కుర్రాడు న్యూఢిల్లీ: ఐజేజీఏ వరల్డ్ స్టార్స్ జూనియర్ గోల్ఫ్ ఈవెంట్లో భారత కుర్రాడు శుభం జగ్లాన్ కొత్త చరిత్ర సృష్టించాడు. వరుసగా రెండు జూనియర్ టైటిల్స్ నెగ్గి రికార్డులకెక్కాడు. లాస్ వెగాస్‌లో జరిగిన బాలుర 9-10 కేటగిరీలో పదేళ్ల శుభం... మూడు రౌండ్లలో ఐదు స్ట్రోక్‌లతో 106 స్కోరు చేసి టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు. అమెరికాకు చెందిన జస్టిన్ డాంగ్, సిహాన్ సంధు, పోంగ్స్పార్క్ లియోపాక్డీ (పోలెండ్) శుభంకు గట్టిపోటీ ఇచ్చారు. గత ఆదివారం కాలిఫోర్నియాలో జరిగిన జూనియర్ వరల్డ్ గోల్ఫ్ చాంపియన్‌షిప్‌లో శుభం టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. శుభం తండ్రి హరియాణాలోని ఓ గ్రామంలో పాలు అమ్ముతుంటాడు. -
చరిత్ర సృష్టించిన 10 ఏళ్ల బాలుడు!
లాస్ వెగాస్: సంపన్నుల క్రీడగా చెలామణి అవుతున్న గోల్ఫ్ లో అతి సాధారణ కుటుంబానికి చెందిన బాలుడు సత్తా చాటాడు. భారత గోల్ఫ్ క్రీడాకారుడు శుభమ్ జగ్లాన్(10) క్రీడా ప్రపంచంలో చరిత్ర సృష్టించాడు. రెండు వారాల వ్యవధిలో రెండు ప్రపంచ టైటిళ్లు గెలిచి సత్తా చాటాడు. అమెరికాలోని లాస్ వెగాస్ లో జరిగిన ఐజేజీఏ వరల్డ్స్ స్టార్స్ ఆఫ్ జూనియర్ గోల్ఫ్ ఈవెంట్ లో విజేతగా నిలిచి ఈ ఘనత సాధించాడు. అంతకుముందు కాలిఫోర్నియాలో జరిగిన వెలక్క్ రిసార్ట్ ఫౌంటెయిన్ కోర్స్ టోర్నిలోనూ విజయకేతనం ఎగురవేశాడు. హర్యానా గ్రామీణ ప్రాంతానికి చెందిన శుభమ్ జగ్లాన్ తండ్రి పాలు అమ్ముకుని జీవిస్తుంటాడు. ఒక సాధారణ కుటుంబానికి చెందిన శుభమ్ గోల్ఫ్ క్రీడలో రెండు వారాల్లోనే అరుదైన టైటిళ్లు సాధించడం విశేషం. తన విజయాల పట్ల శుభమ్ సంతోషం వ్యక్తం చేశాడు. తనను అభినందిస్తుంటే గొప్పగా ఉందని ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. నిజాయితీగా కష్టపడి ఈ విజయాలు సాధించానని, తనకు అడ్డదారులు లేవని పేర్కొన్నాడు. తన తండ్రి చాలా నిరాబండర జీవితం గడుపుతాడని వెల్లడించాడు. -
పాలబ్బాయి కొడుకు.. వరల్డ్ చాంపియన్!
న్యూఢిల్లీ: శుభమ్ జగ్లాన్.. భారత్ కు చెందిన ఈ కుర్రాడు గత మూడు సంవత్సరాల క్రితం వరకూ ప్రపంచానికి తెలియదు. అయితే భారత మాజీ టాప్ గోల్ఫర్ నోనితా లాల్ ఖరేషి అతనిలోని ప్రతిభను గుర్తించింది. చిన్నారుల విభాగంలో జరిగిన ప్రతీ చిన్న గోల్ఫ్ టోర్నమెంట్ కు ఆ కుర్రాడి పేరును ఆమె సిఫార్సు చేస్తూ ఉండేది. ప్రస్తుతం ఆ యువకుడే వరల్డ్ చాంపియన్ గా నిలిచాడు. ఏమాత్రం పరిచయం లేని ఆ బుడతడు వరల్డ్ జూనియర్ గోల్ఫ్ చాంపియన్ గా అవతరించి యావత్తు భారత్ జాతిని తనవైపుకు తిప్పుకున్నాడు. ఇంతకీ ఇదంతా సాధించింది ఒక పాలబ్బాయి కొడుకు. శుభమ్ జగ్లాన్ ది హర్యానా రాష్ట్రంలోని పానిప్పా జిల్లా ఇస్రానా గ్రామం. నిరక్ష్యరాస్యుడైన ఓ పాల వ్యాపారి కొడుకు. ఈ కుర్రాడికి చిన్నప్పట్నుంచి గోల్ఫ్ పై ఆసక్తి ఎక్కువ. దానిలో భాగంగానే పొలంలోనే తన ప్రాక్టీస్ ను కొనసాగించేవాడు. దీంతో పాటుగా ఇసుకలో కూడా ఎక్కువగా సాధన చేసేవాడు. దీనికి సంబంధించిన కొన్ని చిట్కాలను యూ ట్యూబ్ ద్వారా నిపుణుల సలహాలు తీసుకుంటూ తన ఇష్టాన్ని, కలను సాధించే దిశగా సాగిపోయాడు. ఆ క్రమంలోనే గత సంవత్సరం రన్నరప్‌గా నిలిచిన శుభమ్ ఈసారి చాంపియన్‌గా అవతరించాడు. 9-10 మధ్య వయస్సు కేటగిరీలో గురువారం అమెరికాలోని శాండిగోలోఐఎంజీ అకాడమీ నిర్వహించిన ప్రపంచ జూనియర్ గోల్ఫ్ చాంపియన్‌షిప్‌లో శుభమ్ జగ్లాన్ చాంపియన్ గా అవతరించి సంచలనం సృష్టించాడు. ఇప్పటికే వంద టోర్నమెంట్లలో విజయాలను సొంతం చేసుకున్న శుభమ్ మరిన్ని విజయాలను సాధించి దేశ కీర్తిని మరింత ఇనుమడింప జేస్తాడని ఆశిద్దాం.