సిద్ధూ మానవబాంబు లాంటివాడు: డిప్యూటీ సీఎం
కాంగ్రెస్ పార్టీలో చేరడం అంటే మళ్లీ మాతృసంస్థలోకి వచ్చినట్లుందన్న మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్‌సింగ్ సిద్ధూ వ్యాఖ్యలపై పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్, ఆయన భార్య హర్సిమ్రత్ బాదల్ మండిపడ్డారు. సిద్ధూ మానవబాంబు లాంటివాడని, అతడు ఆరు నెలల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేయడం ఖాయమని, కావాలంటే రాసిస్తానని కూడా అన్నారు. సిద్ధూ ప్రతి రెండు రోజులకు ఒకసారి తన తల్లిని మార్చేస్తారని, ఆయనకు ఎంతమంది తల్లులు (పార్టీలు) ఉన్నారో అడగాలనుకుంటున్నానని ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ బాదల్ ఎద్దేవా చేశారు. ఇక అరవింద్ కేజ్రీవాల్‌కు పంజాబ్ ముఖ్యమంత్రి కావాలన్నదే ఏకైక ఎజెండా అని, దాంతోపాటు ప్రతి విషయానికీ ప్రధానమంత్రిని వ్యతిరేకిస్తుంటారని విమర్శించారు.
సిక్కులను ఊచకోత కోసిన పార్టీలోకి వెళ్లి, దాన్ని ఘర్వాప్సీ అంటూ వ్యాఖ్యానించిన సిద్ధూకు అభినందనలని సుఖ్బీర్ భార్య హర్సిమ్రత్ బాదల్ ఎద్దేవా చేశారు. కొంతమంది వ్యక్తులు తమ కాళ్లను రెండు పడవల మీద కాకుండా మూడు పడవల మీద పెడతారని, కొన్నాళ్లు బీజేపీ.. మరికొన్నాళ్లు కాంగ్రెస్ అంటారని, ఇంకొంత దూరం వెళ్లి పాకిస్థాన్‌లో కూడా చేరొచ్చు కదా అని మండిపడ్డారు. ఇక పంజాబ్‌లో 70 శాతం మంది ఎప్పుడూ మత్తులో ఉంటారన్న రాహుల్ గాంధీయే బహుశా అందరికంటే ఎక్కువ మత్తులో ఉండి ఉంటారని తనకు అనిపిస్తోందని కూడా హర్సిమ్రత్ విమర్శించారు.