siddipeta zone
-
వర్షానికి పలు ఇళ్లు ధ్వంసం
సిద్దిపేట జోన్: సిద్దిపేటలో గత 24 గంటలుగా కురిసిన వర్షంతో పలు ఇళ్లకు నష్టం వాటిల్లగా, పలు చోట్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో ఇళ్లలోకి వర్షం నీరు చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం తెల్లవారు జాము వరకు ముసుర్లతో కురిసిన వర్షంతో ఇమాంబాద్‌లో 3 ఇళ్లు, లింగారెడ్డిపల్లిలో 2, సిద్దిపేట పట్టణంలోని దోబీగల్లిలో 2 ఇళ్లు మొత్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ఏడు ఇళ్లకు నష్టం వాటిల్లింది. దోబీగల్లిలోని అంతగిరి కనుకయ్య ఇల్లు ఆదివారం రాత్రి కూలిపోవడంతో వార్డు కౌన్సిలర్ వేణుగోపాల్‌రెడ్డి రెవెన్యూ అధికారులతో కలిసి గృహాన్ని పరిశీలించారు. అదే విధంగా పట్టణంలోని లోతట్టు ప్రాంతమైన శ్రీనివాస్‌నగర్‌లో వర్షపు నీరుతో కాలనీలు జలాశయాలుగా మారాయి. అపార్ట్మెంట్లలోని సెల్లార్లు అన్నీ పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయాయి. -
తాళికట్టిన వాడే కడతేర్చాడు
సిద్దిపేట అర్బన్ : జీవితాంతం తోడుంటానని ఏడడుగులు నడిచి మూడు ముళ్లు వేసిన భర్త భార్య పాలిట యముడయ్యాడు. గుట్టు చప్పుడు కాకుండా భార్యను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడో ప్రబుద్ధుడు. చివరు పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా హంతకుడైన భర్తను టూటౌన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట మండలం నారాయణరావుపేట గ్రామానికి చెందిన పంది నర్సయ్య కుమార్తె లావణ్యకు సిద్దిపేటలోని బోయిగల్లికి చెందిన పెద్దపల్లి రాంచంద్రంతో 11 ఏళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు పిల్లలు. కాగా కొంత కాలంగా లావణ్యను అదనపు కట్నం కోసం భర్త రాంచంద్రం తరచూ వేధింపులకు గురిచేసేవాడు. ఇదే విషయమై పంచాయితీ నిర్వహించిన కుల పెద్దలు ఇరువురికీ నచ్చజెప్పారు. అయితే జూన్ ఒకటో తేదీ తెల్లవారుజామున లావణ్య అలియాస్ వరలక్ష్మి మృతి చెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తమ కూతురును అల్లుడే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి తల్లిదండ్రులు పంది నర్సయ్య, పోచవ్వ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి పోస్టుమార్టం రిపోర్ట్‌లో లావణ్యను గొంతు నులిమి చంపినట్లు వైద్యులు నివేదిక ఇచ్చారు. దీంతో పోలీసులు అనుమానంతో భర్తను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ సమావేశంలో టూటౌన్ సీఐ సైదులు, ఎస్ఐ వరప్రసాద్ సిబ్బంది ఉన్నారు. -
సిద్దిపేట.. నీటి కటకట!
- నేటినుంచి వారంపాటు సరఫరా బంద్ - ఎల్ఎండీలో సాంకేతిక లోపం - పంపింగ్ మార్గంలో లీకేజీల నియంత్రణ - పనుల్లో హైదరాబాద్ బృందం నిమగ్నం - సహకరించాలని అధికారుల విన్నపం సిద్దిపేట జోన్: సిద్దిపేట పట్టణ ప్రజలకు వారంరోజుల పాటు నీటి కష్టాలు తప్పేటట్లు లేవు. కరీంనగర్ జిల్లా యశ్వాడ(లోయర్ మానేర్ డ్యాం) నుంచి లిఫ్టింగ్ విధానంతో పట్టణానికి సరఫరా అవుతున్న మానేరు నీటి పంపింగ్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో మంగళవారం నుంచి వారంరోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోనుంది. మరమ్మతు పనులను వేగవంతంగా నిర్వహించేందుకు యంత్రాంగం చర్యలు చేపడుతోంది. కరీంనగర్ జిల్లా నుంచి సిద్దిపేట వరకు, ఆయా వార్డుల్లో ఉన్న లీకేజీలను నియంత్రించేందుకు హైదరాబాద్‌కు చెందిన ప్రత్యేక బృందానికి పనులు అప్పగించినట్లు తెలిసింది. సిద్దిపేట పట్టణంతో పాటు ప్రశాంత్‌నగర్, హనుమాన్‌నగర్, గాడిచెర్లపల్లి, నర్సాపూర్, ఇమాంబాద్, రంగధాంపల్లి గ్రామాలను కలుపుతూ ఇటీవల స్పెషల్ గ్రేడ్ మున్సిపాల్టీగా రూపొందించారు. ఈ క్రమంలో మండల పరిధిలోని వంద పైచిలుకు గ్రామాలకు మంచినీటి పథకం(ఆర్డబ్ల్యూఎస్) ద్వారా తాగు నీరందిస్తున్నారు. పట్టణ ప్రజల దాహార్తిని తీర్చడానికి లోయర్ మానేర్ నుంచి 54 కిలోమీటర్ల పొడవున 3 పంపింగ్ స్టేషన్ల ద్వారా 189 పవర్ బోర్లతో పట్టణ ప్రజలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. పట్టణంలోని లక్షన్నర పై చిలుకు జనాభాకు సంబంధించి 1.10 లక్షల గ్యాలన్ల తాగునీటిని నల్లాల ద్వారా అందిస్తున్నారు. ఈ సమయంలో ప్రతి రోజూ మెరుగైన నీటి సరఫరా చేసే ఉద్దేశంతో ఇటీవల మంత్రి హరీష్‌రావు భవిష్యత్తు ప్రణాళికను రూపొందించారు. ఈ నెల 15 నుంచి పట్టణంలో ప్రతిరోజూ మానేరు నీరును అందించేందుకు తొమ్మిది మంది సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. పలుమార్లు జరిగిన సమీక్షల్లో దశాబ్దాల క్రితం నిర్మించిన డిస్ట్రిబ్యూషన్ పైప్‌లైన్ ద్వారా ప్రభుత్వ లక్ష్యానికి ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉందని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించే క్రమంలో మున్సిపల్ వాటర్ వర్క్స్ అధికారులు సాంకేతిక సమస్యల అధ్యయనానికి రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నారు. నిర్దేశిత లక్ష్యం చేరుకునేందుకు చిన్న చిన్న సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో అధికారులు పంపింగ్ స్టేషన్లు, నీటి పంపిణీ పైప్ లైన్ల మరమ్మతు, లీకేజీల నియంత్రణ, పంపింగ్ పునరుద్ధరణ చర్యలకు దిగనున్నట్లు సమాచారం. అందులో భాగంగానే యశ్వాడలో నెలకొన్న సాంకేతిక సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తూ, భవిష్యత్తులో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా మరమ్మతులు చేపడుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఈ నెల 12 నుంచి వారం రోజుల పాటు పట్టణానికి నీటి సరఫరాను పూర్తిస్థాయిలో నిలిపివేసి, 54 కిలోమీటర్ల సుదీర్ఘ పంపింగ్ ప్రక్రియను ప్రక్షాళన చేసేందుకు వాటర్ సప్లై విభాగం సమాయత్తమవుతోంది. -
వైఎస్ వల్లే ముస్లింలకు రిజర్వేషన్లు
సిద్దిపేటజోన్, న్యూస్‌లైన్: ఇద్దరు నేతల చొరవ కారణంగానే ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు అందుబాటులోకి వచ్చాయని ఎంఐఎం నాయకుడు, బహదూర్‌పురా ఎమ్మెల్యే మోజంఖాన్ స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, ఎంఐఎం వ్యవస్థాపకుడు సలావుద్దీన్ ఒవైసీ కృషి ఫలితంగానే రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయన్నారు. శనివారం ఆయన సిద్దిపేటకు వచ్చిన సందర్భంగా పలు వార్డుల్లో ఎంఐఎం పార్టీ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనార్టీల పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోందన్నారు. 2004 సంవత్సరానికి ముందు ముస్లింల పరిస్థితి దారుణంగా ఉండేదన్నారు. 2004 నాటి సార్వత్రిక ఎన్నికల్లో ముస్లింలకు సముచిత రిజర్వేషన్లు ఇవ్వాలని ఎంఐఎం వ్యవస్థాపకుడు సలావుద్దీన్ ఒవైసీ వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకవచ్చారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మైనార్టీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామన్న వైఎస్ హామీ ఇచ్చి ఆ వెంటనే హామీని నెరవేర్చారని కొనియాడారు. నూతన రిజర్వేషన్లతో ప్రస్తుతం మైనార్టీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి గౌరవ ప్రదంగా బతుకుతున్నారని తెలిపారు. సామాన్యులకు దూరమైన కార్పొరేట్ విద్య అందుబాటులోకి రావడంతోపాటు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో వారికి ఎంతో లబ్ధిచేకూరిందన్నారు. హైదరాబాద్‌కే పరిమితమైన ఎంఐఎం ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరిస్తోందని మోజంఖాన్ అన్నారు. జాతీయ స్థాయిలో కూడా విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఎమ్మెల్యే మోజంఖాన్‌కు స్థానిక కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పట్టణంలో ప్రధాన వీధులగుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు ఎమ్మెల్యే అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సాజీద్‌పురా, నసీర్‌నగర్, చార్వదాన్, భారాహిమామ్లలో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఒవైసీ చౌక్, సలార్చౌక్ల వద్ద కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.