సిద్దిపేటజోన్, న్యూస్‌లైన్: ఇద్దరు నేతల చొరవ కారణంగానే ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు అందుబాటులోకి వచ్చాయని ఎంఐఎం నాయకుడు, బహదూర్‌పురా ఎమ్మెల్యే మోజంఖాన్ స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, ఎంఐఎం వ్యవస్థాపకుడు సలావుద్దీన్ ఒవైసీ కృషి ఫలితంగానే రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయన్నారు. శనివారం ఆయన సిద్దిపేటకు వచ్చిన సందర్భంగా పలు వార్డుల్లో ఎంఐఎం పార్టీ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనార్టీల పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోందన్నారు.
2004 సంవత్సరానికి ముందు ముస్లింల పరిస్థితి దారుణంగా ఉండేదన్నారు. 2004 నాటి సార్వత్రిక ఎన్నికల్లో ముస్లింలకు సముచిత రిజర్వేషన్లు ఇవ్వాలని ఎంఐఎం వ్యవస్థాపకుడు సలావుద్దీన్ ఒవైసీ వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకవచ్చారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మైనార్టీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామన్న వైఎస్ హామీ ఇచ్చి ఆ వెంటనే హామీని నెరవేర్చారని కొనియాడారు. నూతన రిజర్వేషన్లతో ప్రస్తుతం మైనార్టీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి గౌరవ ప్రదంగా బతుకుతున్నారని తెలిపారు. సామాన్యులకు దూరమైన కార్పొరేట్ విద్య అందుబాటులోకి రావడంతోపాటు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో వారికి ఎంతో లబ్ధిచేకూరిందన్నారు.
హైదరాబాద్‌కే పరిమితమైన ఎంఐఎం ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరిస్తోందని మోజంఖాన్ అన్నారు. జాతీయ స్థాయిలో కూడా విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఎమ్మెల్యే మోజంఖాన్‌కు స్థానిక కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పట్టణంలో ప్రధాన వీధులగుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు ఎమ్మెల్యే అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సాజీద్‌పురా, నసీర్‌నగర్, చార్‌వదాన్, భారాహిమామ్‌లలో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఒవైసీ చౌక్, సలార్‌చౌక్‌ల వద్ద కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.