సిద్దిపేట.. నీటి కటకట!
- నేటినుంచి వారంపాటు సరఫరా బంద్
- ఎల్‌ఎండీలో సాంకేతిక లోపం
- పంపింగ్ మార్గంలో లీకేజీల నియంత్రణ
- పనుల్లో హైదరాబాద్ బృందం నిమగ్నం
- సహకరించాలని అధికారుల విన్నపం
సిద్దిపేట జోన్: సిద్దిపేట పట్టణ ప్రజలకు వారంరోజుల పాటు నీటి కష్టాలు తప్పేటట్లు లేవు. కరీంనగర్ జిల్లా యశ్వాడ(లోయర్ మానేర్ డ్యాం) నుంచి లిఫ్టింగ్ విధానంతో పట్టణానికి సరఫరా అవుతున్న మానేరు నీటి పంపింగ్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో మంగళవారం నుంచి వారంరోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోనుంది. మరమ్మతు పనులను వేగవంతంగా నిర్వహించేందుకు యంత్రాంగం చర్యలు చేపడుతోంది. కరీంనగర్ జిల్లా నుంచి సిద్దిపేట వరకు, ఆయా వార్డుల్లో ఉన్న లీకేజీలను నియంత్రించేందుకు హైదరాబాద్‌కు చెందిన ప్రత్యేక బృందానికి పనులు అప్పగించినట్లు తెలిసింది.
సిద్దిపేట పట్టణంతో పాటు ప్రశాంత్‌నగర్, హనుమాన్‌నగర్, గాడిచెర్లపల్లి, నర్సాపూర్, ఇమాంబాద్, రంగధాంపల్లి గ్రామాలను కలుపుతూ ఇటీవల స్పెషల్ గ్రేడ్ మున్సిపాల్టీగా రూపొందించారు. ఈ క్రమంలో మండల పరిధిలోని వంద పైచిలుకు గ్రామాలకు మంచినీటి పథకం(ఆర్‌డబ్ల్యూఎస్) ద్వారా తాగు నీరందిస్తున్నారు. పట్టణ ప్రజల దాహార్తిని తీర్చడానికి లోయర్ మానేర్ నుంచి 54 కిలోమీటర్ల పొడవున 3 పంపింగ్ స్టేషన్ల ద్వారా 189 పవర్ బోర్లతో పట్టణ ప్రజలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. పట్టణంలోని లక్షన్నర పై చిలుకు జనాభాకు సంబంధించి 1.10 లక్షల గ్యాలన్ల తాగునీటిని నల్లాల ద్వారా అందిస్తున్నారు.
ఈ సమయంలో ప్రతి రోజూ మెరుగైన నీటి సరఫరా చేసే ఉద్దేశంతో ఇటీవల మంత్రి హరీష్‌రావు భవిష్యత్తు ప్రణాళికను రూపొందించారు. ఈ నెల 15 నుంచి పట్టణంలో ప్రతిరోజూ మానేరు నీరును అందించేందుకు తొమ్మిది మంది సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. పలుమార్లు జరిగిన సమీక్షల్లో దశాబ్దాల క్రితం నిర్మించిన డిస్ట్రిబ్యూషన్ పైప్‌లైన్ ద్వారా ప్రభుత్వ లక్ష్యానికి ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉందని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించే క్రమంలో మున్సిపల్ వాటర్ వర్క్స్ అధికారులు సాంకేతిక సమస్యల అధ్యయనానికి రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నారు.
నిర్దేశిత లక్ష్యం చేరుకునేందుకు చిన్న చిన్న సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో అధికారులు పంపింగ్ స్టేషన్లు, నీటి పంపిణీ పైప్ లైన్ల మరమ్మతు, లీకేజీల నియంత్రణ, పంపింగ్ పునరుద్ధరణ చర్యలకు దిగనున్నట్లు సమాచారం. అందులో భాగంగానే యశ్వాడలో నెలకొన్న సాంకేతిక సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తూ, భవిష్యత్తులో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా మరమ్మతులు చేపడుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఈ నెల 12 నుంచి వారం రోజుల పాటు పట్టణానికి నీటి సరఫరాను పూర్తిస్థాయిలో నిలిపివేసి, 54 కిలోమీటర్ల సుదీర్ఘ పంపింగ్ ప్రక్రియను ప్రక్షాళన చేసేందుకు వాటర్ సప్లై విభాగం సమాయత్తమవుతోంది.