పట్నంలో నీటి గోస!
మొత్తం నగరాలు, పట్టణాలు.. 67
18 నగరాలు, పట్టణాల్లో రోజూ సరఫరా
28 చోట్ల రెండు రోజులకోసారి నీళ్లు
13 పట్టణాల్లో మూడు రోజులకు ఒకసారి
5 చోట్ల నాలుగు రోజులకోసారి
3 పట్టణాల్లో ఏడు రోజులకోసారి సరఫరా
పట్టణాల్లో తాగునీటి పథకాల సామర్థ్యం,
తగ్గుదల, సరఫరా వివరాలు
పథకాల గరిష్ట సామర్థ్యం : 747 ఎంఎల్‌డీ
ప్రస్తుత సరఫరా సామర్థ్యం : 459 ఎంఎల్‌డీ (61.5 శాతం)
తరుగుదల : 287 ఎంఎల్‌డీ (38.5 శాతం)
రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో తాగునీటి తీవ్ర కటకట
తాగునీటి సరఫరాలో 30-60 శాతం తరుగుదల
రాష్ట్రంలో పురజనుల గొంతెండుతోంది.. దాహం దాహం అంటూ పట్టణవాసులు అల్లాడిపోతున్నారు.. గుక్కెడు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఎండలు ముదరడంతో నగరాలు, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య మరింత పెరిగింది. వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలతో సిద్ధం కాకపోవడంతో పరిస్థితి మరింత దుర్భరంగా మారుతోంది. నిధులు లేక నగర, పురపాలక సంస్థలు తాగునీటి సరఫరా చేయలేక చేతులెత్తేస్తున్నాయి. దీంతో వందల కోట్లు కుమ్మరించి నిర్మించిన నీటి సరఫరా పథకాలు నిరుపయోగంగా మారిపోయాయి. మరోవైపు... ప్రైవేటు నీటి శుద్ధి కేంద్రాలు కోట్లాది రూపాయల దందాకు తెరలేపాయి.
- సాక్షి, హైదరాబాద్
‘కొత్త’ సమస్యలు
నగరాలు, పట్టణాల పరిధిలోని 26.85 శాతం ప్రాంతాలకు అసలు నీటిసరఫరా వ్యవస్థే లేదు. ప్రధానంగా శివారు ప్రాంతాలు, 25 కొత్త నగర పంచాయతీల్లో ఈ పరిస్థితి ఉంది. నల్లగొండ జిల్లా దేవరకొండలో ఆరు రోజులకోసారి నీటి సరఫరా జరుగుతోంది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో సైతం 4 రోజులకోసారి నీళ్లు ఇస్తున్నారు. కోరుట్ల, మెట్‌పల్లి, హుస్నాబాద్, వేములవాడ, హుజూరాబాద్, మధిర, దేవరకొండ, బడంగ్‌పేట, ఐజ, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, షాద్‌నగర్ పట్టణాల పరిధిలోని 50 శాతానికిపైగా ప్రాంతాలకు నీటి సరఫరా వ్యవస్థే లేదు. ట్యాంకర్ల ద్వారా సరఫరాకు ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయలేకపోయింది.
నీటిని విడుదల చేస్తేనే..
నీటి నిల్వలు తగ్గిపోవడంతో పట్టణాల్లో సరఫరా క్లిష్టంగా మారింది. పలుచోట్ల తక్షణమే సంబంధిత ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయాల్సి ఉంది. ఖమ్మం-పాలేరు రిజర్వాయర్ నుంచి మునేరుకు నీటిని విడుదల చేయాలి. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాలకు నీరందించడం కోసం ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాల్వ ద్వారా ఎస్‌ఎస్ ట్యాంకులు, వెంకటరావుపేట చెరువుకు నీళ్లు వదలాల్సి ఉంది.
సగం మందికి దాహమే!
నీటి సరఫరా నాణ్యత ప్రమాణాల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో సగటున ఒకరికి రోజుకు 140 లీటర్ల (ఎల్పీసీడీ) నీటిని సరఫరా చేయాల్సి ఉండగా.. రాష్ట్రంలో 40 నుంచి 100 లీటర్లలోపు మాత్రమే సరఫరా అవుతున్నాయి. సాధారణ పరిస్థితిలో ఒక రోజులో 43.11 శాతం జనాభాకే తాగునీరు అందుతోంది. భూగర్భ జలాలు అడుగంటిపోవడం, వేసవి నిల్వ ట్యాంకుల్లో నీటిమట్టాలు తరిగిపోవడంతో.. ఈ పరిస్థితి తలెత్తింది. రాష్ట్రంలోని 67 పట్టణాల్లో నీటి సరఫరా పరిస్థితి ఇలా ఉంది..
►18 పట్టణాల్లో నీటి సరఫరా 44 -100 ఎల్పీసీడీలు ఉండగా.. వేసవి ప్రభావంతో 30 శాతం తగ్గిపోయింది.
► 28 పట్టణాల్లో 8-56 ఎల్పీసీడీల మధ్య ఉన్న సరఫరా ప్రస్తుతం 40 శాతం తగ్గింది.
► 13 చోట్ల మూడు రోజులకోసారి 5-49 ఎల్పీసీడీలుగా ఉన్న సరఫరా.. ఇప్పుడు సగానికి పడిపోయింది.
► 5 పట్టణాల్లో నాలుగు రోజులకోసారి 11-17 ఎల్పీసీడీల నీటిని సరఫరా చేసేవారు. కానీ గత మూడు నెలల్లో సరఫరా 60 శాతం తగ్గింది.
► మిగతా 3 చోట్ల వారానికోసారి మాత్రమే సరఫరా చేస్తున్నారు.
‘నీరు’గారిన పథకాలు
రాష్ట్రంలోని పట్టణ తాగునీటి పథకాల ‘సరఫరా సామర్థ్యం’ దాదాపు 40 శాతం తగ్గిపోయింది. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని 67 నగరాలు, పట్టణాలకు తాగునీటిని సరఫరా చేసే పథకాల పనితీరుపై ఇంజనీరింగ్ నిపుణులతో చేయించిన సమగ్ర సర్వేలోనే ఈ విషయం బయటపడింది. తుప్పుపట్టిన ప్రధాన పైప్‌లైన్లు, లికేజీలు, శిథిలమైన ఓవర్‌హెడ్ ట్యాంకులు, మొరాయిస్తున్న పంపింగ్ స్టేషన్లతో నీటి పథకాలు సరిగా పనిచేయడం లేదు. ఈ పథకాలన్నీ తిరిగి పూర్తి సామర్థ్యాన్ని సంతరించుకోవాలంటే ఏకంగా రూ.624.33 కోట్లతో మరమ్మతులు చేయాల్సి ఉందని ప్రజారోగ్య, ఇంజనీరింగ్ విభాగం తేల్చింది.