గజ్వేల్, న్యూస్‌లైన్: వేసవిలో తలెత్తనున్న తాగునీటి సమస్యను అధిగమించేందుకు జిల్లాలోని పది నియోజకవర్గాల నుంచి సుమారు రూ.35 కోట్లకుపైగా ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లాయి. ఇందులో భాగంగానే గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, జగదేవ్‌పూర్, వర్గల్, కొండపాక మండలాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కోసం రూ.3.81 కోట్లు, 19 గ్రామాల్లో 39 బోరుబావుల అద్దె కోసం రూ.6.24 లక్షలు, 338 బోరుబావుల ఫ్లషింగ్ కోసం రూ.39.27 లక్షలు, 405 బోరుబావుల్లో పూడికతీత కోసం రూ.34.83 లక్షలు కావాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. కానీ ఎన్నికల ‘కోడ్’ నేపథ్యంలో నిధుల మంజూరుపై ప్రతిష్టంభన నెలకొంది.
సాధారణంగా ఎన్నికల వేళ తాగునీటి పథకాలకు నిధుల మంజూరుకు సంబంధించి ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలను పంపుతారు. కానీ ఈ సారి అలాంటి పరిస్థితి లేకపోవడంతో అధికారులు కూడా స్పష్టతకోసం ఎదురుచూస్తున్నారు. వేసవి ముంచుకొస్తున్న వేళ ఇలాంటి పరిస్థతి నెలకొనడంతో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యపై ఆందోళన వ్యక్తమవుతోంది. బోరుబావుల్లో నీటి మట్టం తగ్గి ఇప్పటికే గుక్కెడు నీటి కోసం జనం దూరంగా ఉన్న వ్యవసాయక్షేత్రాల బోరుబావుల వద్దకు వెళ్తున్నారు. కొద్ది రోజుల్లో ఈ సమస్య మరింత జఠిలమయ్యే అవకాశం కనిపిస్తుండగా, సమస్యను పరిష్కరించే దిశగా ఎలాంటి చర్యలు కనిపించపోవడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.
తడారనున్న.. గొంతు
Published Wed, Mar 12 2014 11:21 PM | Last Updated on Tue, Aug 14 2018 5:45 PM
Advertisement
Advertisement