మళ్లీ ఫుట్‌పాత్‌లను ఆక్రమించం
హైకోర్టుకు 106 షాపుల యజమానుల హామీ
సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని సిద్ది అంబర్ బజార్లో మళ్లీ ఫుట్‌పాత్‌లను ఆక్రమించమని 106 షాపుల యజమానులు హైకోర్టుకు హామీ ఇచ్చారు. వాటిని రికార్డ్ చేసుకున్న హైకోర్టు, సీజ్ చేసిన షాపులను తెరవాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించింది. కోర్టుకిచ్చిన హామీకి విరుద్ధంగా మళ్లీ ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తే తిరిగి షాపులను సీజ్ చేయవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్, సిద్ది అంబర్ బజార్, మహబూబ్‌గంజ్ ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌ల ఆక్రమణల తొలగింపునకు జీహెచ్ఎంసీ అధికారులు చర్య లు తీసుకోవడం లేదంటూ లక్ష్మినివా స్ అగర్వాల్ అనే వ్యక్తి హైకోర్టులో పిల్ వేసిన సంగతి విదితమే. ఈ వ్యాజ్యం విచారణ సమయంలో ఫుట్‌పాత్‌లను ఆక్రమించమంటూ వ్యాపా రులు గతంలో కోర్టుకు హామీ ఇచ్చి ఉల్లంఘించడంతో వాటిని సీజ్ చేయాలని ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం అప్పట్లో జీహెచ్ఎంసీని ఆదేశించింది. దీంతో షాపుల యజమానులు తిరిగి హైకోర్టును ఆశ్రరుుంచారు.