ఇక దుర్గమ్మ శీఘ్రదర్శనం టికెట్ ధర రూ.300
విజయవాడ (ఇంద్రకీలాద్రి) :
తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో దుర్గగుడిని అభివృద్ధి చేస్తామని చెబుతున్న ఆలయ అధికారులు తొలిగా అమ్మవారి దర్శనం టికెట్ల ధరలను పెంచారు. శీఘ్రదర్శనం టికెట్ ధరను రూ.100 నుంచి ఏకంగా రూ.300కు పెంచుతూ దుర్గగుడి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పుష్కరాల్లో వీఐపీ, శీఘ్రదర్శనం టికెట్ల ధరలను దేవస్థానం రూ.500గా నిర్ణయించింది. దీనిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడంతో రూ.300కు మార్చారు. అయితే, ఈ ధర కేవలం పుష్కరాల వరకే అని భక్తులు భావించారు. పుష్కరాలు ముగిసినా అదే రేటు కొనసాగించారు. అలాగే, భవిష్యత్తులో అమ్మవారి అంతరాలయ దర్శనానికి అనుమతిస్తారా, అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే శుక్ర, ఆదివారాలు, పండుగ రోజుల్లో అంతరాలయ దర్శనాన్ని నిలిపివేస్తున్నారు. రూ.300 టికెట్ కూడా శీఘ్రదర్శనమే తప్ప అంతరాలయ దర్శనం కాదనే ప్రచారం జరుగుతోంది. కాగా, అమ్మవారి దర్శనం టికెట్‌ను ఒక్కసారిగా పెంచడంపై భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రూ.20 టికెట్‌ను యధావిధిగా కొనసాగిస్తారా.. లేదా అనే దానిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉచిత దర్శనం మూడు లైన్లు యధావిధిగానే కొనసాగుతాయని ఆలయ అధికారులు తెలిపారు.