భారత్‌లో, పాక్‌లో సేమ్ టు సేమ్!
కొత్త కరెన్సీపై ఒవైసీ వ్యాఖ్యలు
కొత్త కరెన్సీ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్ని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు. కరెన్సీ నోట్లను ముద్రించడానికి అవసరమైన ఇంక్‌ను, సిల్వర్ థ్రెడ్లను (వెండిపోగులను) ఇటు భారత్‌కు, అటు పాకిస్థాన్ ఒకే సరఫరాదారు అందిస్తున్నారని, అలాంటప్పుడు నకిలీ కరెన్సీకి అడ్డుకట్టవేయడం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు.
‘మనకు ఇంక్‌ను, సిల్వర్థ్రెడ్లను సరఫరా చేస్తున్నవారే పాకిస్థాన్‌కు కూడా చేస్తున్నారు. అలాంటప్పుడు నకిలీ కరెన్సీని అడ్డుకోవడానికి ప్రభుత్వం ఏం చేయబోతోంది. ఎలాంటి వ్యూహం అనుసరించనుందో చెప్పాలి’ అని ఒవైసీ పీటీఐతో అన్నారు. ఆకస్మికంగా తీసుకున్న పెద్దనోట్ల రద్దు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. పెద్దనోట్ల బదిలీకి ప్రజలకు మొదట తగినంత సమయం ఇచ్చి ఆ తర్వాత వీటిని రద్దుచేసి ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవి కావని చెప్పారు. ఎవరైనా ఎక్కువ డబ్బు బ్యాంకులో డిపాజిట్ చేసినా ఆ విషయం తెలిసిపోయేదని పేర్కొన్నారు. ఫిలిప్పీన్స్‌లో, యూరప్‌లో పాతట్ల బదిలీ కోసం ప్రజలకు తగినంత సమయాన్ని ఇచ్చారని చెప్పారు. ఉన్ననోట్లను రద్దుచేసి ఏకంగా రూ. 2వేలనోటు విడుదల చేయడంతో చిల్లర దొరకక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు.