singaraya konda
-
తీరనున్న కల.. హైవే.. లైన్ క్లియర్
కందుకూరు వాసులను ఐదు సంవత్సరాలుగా ఊరిస్తూ వస్తున్న 167–బి జాతీయ రహదారి నిర్మాణం త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ప్రకాశం జిల్లా సింగరాయకొండ నుంచి కందుకూరు మీదుగా వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు వరకు ఈ రోడ్డు నిర్మాణం చేస్తారు. ఇప్పటికే భూసేకరణను పూర్తి చేసిన అధికారులు పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. కందుకూరు ప్రజల జాతీయ రహదారి కల తీరనుంది. కందుకూరు(పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా): కేంద్ర ప్రభుత్వం పలు ప్రధాన రహదారుల విస్తరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 2017 సంవత్సరంలో రాష్ట్రంలో మూడు రోడ్లను జాతీయ రహదారులుగా ఎంపిక చేసింది. వాటిలో 167–బి ఒకటి. ప్రకాశం జిల్లా సింగరాయకొండ నుంచి (చెన్నై టు కోల్‌కతా – ఎన్‌హెచ్ 16) కడప జిల్లా మైదుకూరు వరకు (ఎన్‌హెచ్ 67) ఉన్న రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించి 195 కి.మీల మేర పదిమీటర్ల వెడల్పుతో నాలుగు లేన్ల రహదారిగా విస్తరించనున్నారు. ఈ రోడ్డు సింగరాయకొండ, కందుకూరు, పోకూరు, వలేటివారిపాళెం, మాలకొండ, పామూరు, సీఎస్‌పురం, డీజీపేట, అంబవరం, టేకూరుపేట, రాజాసాహెబ్‌పేట, వనిపెంట మీదుగా మైదుకూరు వరకు సాగనుంది. దీనికి 2018 కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ వర్చువల్ విధానంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వివిధ కారణాలతో నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. ప్రస్తుతం పనులను మొదలు పెట్టేందుకు అధికారులు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. తొలి ప్యాకేజీ కింద వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు సన్నాహాలు వేస్తున్నారు. మొదటి ప్యాకేజీ పనులిలా.. మొదటి ప్యాకేజీ కింద ప్రకాశం జిల్లా సింగరాయకొండ నుంచి నెల్లూరు జిల్లాలోని మాలకొండ వరకు 45 కి.మీ. మేర రోడ్డును విస్తరించనున్నారు. ఇందుకోసం రూ.263 కోట్లను ఇప్పటికే కేటాయించారు. సింగరాయకొండ, కందుకూరు, వలేటివారిపాళెం మండలాల్లోని పలు గ్రామాల్లో భూసేకరణను పూర్తి చేశారు. మొత్తం 150 ఎకరాలను సేకరించి సంబంధిత రైతుల బ్యాంకు ఖాతాల్లో పరిహారాన్ని కూడా జమ చేశారు. గతేడాది ఆగస్టులోనే టెండర్లు పిలిచారు. 32 శాతం తక్కువకు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ తర్వాత పనులు చేపట్టేందుకు ముందుకు రాలేదు. దీంతో దానిని రద్దు చేసిన ఎన్‌హెచ్ అధికారులు కొత్తగా టెండర్లు పిలిచారు. అది త్వరలో ఫైనల్ అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తైన వెంటనే మొదటి ప్యాకేజీ పనులు ప్రారంభించనున్నారు. అలాగే మాలకొండ నుంచి సీఎస్ పురం వరకు రెండో ప్యాకేజీగా, సీఎస్ పురం నుంచి నెల్లూరు, కడప అడ్డరోడ్డు వరకు మూడో ప్యాకేజీగా, కడప అడ్డరోడ్డు నుంచి మైదుకూరు వరకు నాలుగో ప్యాకేజీగా టెండర్లు కేటాయించి పనులు ప్రారంభించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. తీరనున్న కల నిన్నటి వరకు అతిపెద్ద రెవెన్యూ డివిజన్‌గా పేరు ప్రఖ్యాతలు పొందిన కందుకూరు పట్టణానికి భారీ స్థాయిలో రహదారి సౌకర్యం ఇప్పటివరకు లేదు. ప్రస్తుతం 167–బి నిర్మాణంతో కందుకూరు నియోజకవర్గంలో జాతీయ రహదారి కొరత తీరనుంది. మొదటి దశలో 45 కి.మీ. రహదారి నిర్మాణంలో నాలుగైదు కిలోమీటర్లు మినహా మిగిలింది మొత్తం కందుకూరు నియోజకవర్గంలోనే జరుగుతుంది. ప్రధానంగా పట్టణానికి దక్షిణం వైపు భారీ ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే పోకూరు, వలేటివారిపాళెం వంటి ప్రాంతాల్లోనూ ఊరిబయటి నుంచి హైవే వెళ్తుందని భావిస్తున్నారు. ప్రవిత్ర పుణ్యక్షేత్రం మాలకొండకు మెరుగైన రహదారి సౌకర్యం ఏర్పడనుంది. -
దంపతులను బలిగొన్న మనస్పర్థలు
సింగరాయకొండ : చిన్నపాటి మనస్పర్థలు దంపతులను బలిగొన్న సంఘటన సింగరాయకొండలో విషాదం నింపింది. ఆ వివరాల్లోకెళ్తే... సింగరాయకొండ ఇస్లాంపేటకు చెందిన కుంచాల శ్రీను (55), అంకమ్మ (50) దంపతులు వృత్తిరీత్యా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. స్థానికంగా అమ్మవారి కొలుపుల సందర్భంగా ఇటీవల సింగరాయకొండ వచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్లారు. కాగా, కొలుపుల ఖర్చులకు సంబంధించిన లెక్కలు చూసుకునేందుకు శ్రీను గత గురువారం మళ్లీ సింగరాయకొండ బయలుదేరాడు. ఆ సమయంలో తాను కూడా వస్తానని అంకమ్మ అడిగింది. అయితే, అతను నిరాకరించి ఒంటరిగా వచ్చేశాడు. ఆ వెంటనే శ్రీనుకు తెలియకుండా అంకమ్మ కూడా సింగరాయకొండ వచ్చింది. తనకు చెప్పకుండా వచ్చినందుకు ఆమెపై శ్రీను ఆగ్రహించాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాదన జరిగింది. దీనిపై మనస్తాపానికి గురైన అంకమ్మ శుక్రవారం రాత్రి స్థానిక తమ నివాసంలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా, తమ సోదరిచావుకు బావ శ్రీను కారణమంటూ అంకమ్మ సోదరులు తన్నీరు కృష్ణ అలియాస్ రేకుల కృష్ణ, మురికోడు నాగేశ్వరరావు అలియాస్ తన్నీరు నాగేశ్వరరావు, జిల్లా శ్రీను, మెంటల్ రమణయ్య ఆరోపించారు. దీనిపై తీవ్రమనస్తాపానికి గురైన శ్రీను.. ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. బంధువులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం బజారుకని వచ్చి టీ తాగాడు. అనంతరం స్థానిక ఎంపీడీవో కార్యాలయం పక్కన హాస్టల్ కోసం నిర్మిస్తూ నిలిచిపోయిన భవనంలోకి వెళ్లి మెట్లకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కందుకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుని జేబులో సిగరెట్ ప్యాకెట్ అట్టపై ‘రేకుల కృష్ణ, మురికోడు నాగేశ్వరరావు, జిల్లా శ్రీను, మెంటల్ రమణయ్య, నాకు కాలం’ అని రాసి ఉంది. దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మనస్పర్థల కారణంగా రెండు రోజుల వ్యవధిలో భార్యభర్తలు ఆత్మహత్య చేసుకుని మృతిచెందడంతో వారి ముగ్గురు కుమారులతో పాటు బంధువులంతా కన్నీటిపర్యంతమయ్యారు. -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
సింగరాయకొండ, న్యూస్‌లైన్ : ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుడ్రైవర్ నిర్లక్ష్యం మహిళ ప్రాణాన్ని బలితీసుకుంది. మరో 10 మందిని గాయాలపాలు చేసింది. ఇటీవల వరుస బస్సు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా మంగళవారం వేకువజామున సింగరాయకొండలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రయాణికులను ఉలికిపాటుకు గురిచేసింది. ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణమంటేనే భయపడే పరిస్థితికి దారితీసింది. ప్రైవేట్ ట్రావెల్స్తో పాటు అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది. ఆ వివరాల్లోకెళ్తే... కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి నెల్లూరు బయలుదేరింది. మంగళవారం వేకువజామున 4.30 గంటలకు సింగరాయకొండ చేరుకుంది. ఆ సమయంలో బస్సులో మొత్తం 34 మంది ప్రయాణికులున్నారు. వారిలో ఇద్దరు ప్రయాణికులను సింగరాయకొండలో దించిన అనంతరం మళ్లీ జాతీయ రహదారిపైకి ఎక్కేందుకు పాత సింగరాయకొండ పంచాయతీలోని అయ్యప్పగుడి మీదుగా వస్తూ అక్కడున్న మలుపు వద్ద అదుపుతప్పి పక్కనే ఉన్న గుంతలో బోల్తాపడింది. డ్రైవర్ అతివేగంగా నడపడం వల్లే మలుపులో అదుపుతప్పి బస్సు బోల్తాకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న నెల్లూరు జిల్లా అల్లూరు మండలం నార్త్మోపూర్కు చెందిన కొండా పద్మావతి (50) బస్సు కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. జడా కృపారావు, ముగ్గు శ్రీనివాసరావు, వెన్నపూస ఓపుల్రెడ్డి, ముగ్గు శ్రీధర్, జి.శేఖర్, వై.స్వాతి, షేక్ మహబూబ్‌బాషా, వి.వెంకటేష్, వై.భవానీ, కార్తీక్ అనే ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న 108 సిబ్బంది అంబులెన్స్‌తో వెంటనే అక్కడకు చేరుకుని క్షతగాత్రులకు ప్రథమచికిత్స చేశారు. అదృష్టవశాత్తూ ఎలాంటి గాయాలూకాకుండా బయటపడిన మిగతా 21 మంది ఇతర వాహనాల్లో గమ్యస్థానాలకు తరలివెళ్లారు. కుమార్తె వివాహానికి దుస్తులు తీసుకెళ్తూ... ఈ ప్రమాదంలో మృతిచెందిన నెల్లూరు జిల్లా అల్లూరు మండలం నార్త్మోపూర్కు చెందిన కొండా పద్మావతి (50) హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న పెద్దకుమార్తె, అల్లుడు వద్ద ఉంటూ.. త్వరలో జరగనున్న రెండో కుమార్తె వివాహానికి దుస్తులు కొనుగోలుచేసి తీసుకుని స్వగ్రామం బయలుదేరింది. మార్గమధ్యంలోనే డ్రైవర్ నిర్లక్ష్యానికి బలైపోయింది. సంఘటన స్థలానికి చేరుకున్న ఆమె భర్త రాఘవరెడ్డి, బంధువులు భోరున విలపించారు. బస్సు కింద ఇరుక్కుపోయిన ఆమె మృతదేహాన్ని బయటకు తీసేందుకు సింగరాయకొండ పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. సంఘటన స్థలానికి చేరుకున్న ఏఎస్సై మహబూబ్‌బాషా రెండు క్రేన్లను తెప్పించి బస్సును పైకిలేపి మృతదేహాన్ని బయటకుతీశారు. పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌తో పాటు పక్కనే ఉన్న మరో డ్రైవర్, క్లీనర్ కూడా పరారయ్యారు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సింగరాయకొండ పోలీసులు తెలిపారు.