దంపతులను బలిగొన్న మనస్పర్థలు
సింగరాయకొండ : చిన్నపాటి మనస్పర్థలు దంపతులను బలిగొన్న సంఘటన సింగరాయకొండలో విషాదం నింపింది. ఆ వివరాల్లోకెళ్తే... సింగరాయకొండ ఇస్లాంపేటకు చెందిన కుంచాల శ్రీను (55), అంకమ్మ (50) దంపతులు వృత్తిరీత్యా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. స్థానికంగా అమ్మవారి కొలుపుల సందర్భంగా ఇటీవల సింగరాయకొండ వచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్లారు.
కాగా, కొలుపుల ఖర్చులకు సంబంధించిన లెక్కలు చూసుకునేందుకు శ్రీను గత గురువారం మళ్లీ సింగరాయకొండ బయలుదేరాడు. ఆ సమయంలో తాను కూడా వస్తానని అంకమ్మ అడిగింది. అయితే, అతను నిరాకరించి ఒంటరిగా వచ్చేశాడు. ఆ వెంటనే శ్రీనుకు తెలియకుండా అంకమ్మ కూడా సింగరాయకొండ వచ్చింది. తనకు చెప్పకుండా వచ్చినందుకు ఆమెపై శ్రీను ఆగ్రహించాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాదన జరిగింది. దీనిపై మనస్తాపానికి గురైన అంకమ్మ శుక్రవారం రాత్రి స్థానిక తమ నివాసంలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
కాగా, తమ సోదరిచావుకు బావ శ్రీను కారణమంటూ అంకమ్మ సోదరులు తన్నీరు కృష్ణ అలియాస్ రేకుల కృష్ణ, మురికోడు నాగేశ్వరరావు అలియాస్ తన్నీరు నాగేశ్వరరావు, జిల్లా శ్రీను, మెంటల్ రమణయ్య ఆరోపించారు. దీనిపై తీవ్రమనస్తాపానికి గురైన శ్రీను.. ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. బంధువులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం బజారుకని వచ్చి టీ తాగాడు. అనంతరం స్థానిక ఎంపీడీవో కార్యాలయం పక్కన హాస్టల్ కోసం నిర్మిస్తూ నిలిచిపోయిన భవనంలోకి వెళ్లి మెట్లకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కందుకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుని జేబులో సిగరెట్ ప్యాకెట్ అట్టపై ‘రేకుల కృష్ణ, మురికోడు నాగేశ్వరరావు, జిల్లా శ్రీను, మెంటల్ రమణయ్య, నాకు కాలం’ అని రాసి ఉంది. దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మనస్పర్థల కారణంగా రెండు రోజుల వ్యవధిలో భార్యభర్తలు ఆత్మహత్య చేసుకుని మృతిచెందడంతో వారి ముగ్గురు కుమారులతో పాటు బంధువులంతా కన్నీటిపర్యంతమయ్యారు.