
పి.గన్నవరం: గోదావరి వరదల్లో ప్రమాదవశాత్తు గల్లంతై మరణించిన ఇద్దరి కుటుంబాలకు పోస్టుమార్టం పూర్తయిన రోజునే రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున సాయం అందించింది. ఈ నెల 16న కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం మానేపల్లి పల్లిపాలేనికి చెందిన కడలి శ్రీనివాసరావు (48) ఏటిగట్టు నుంచి 100 మీటర్ల దూరంలో ఉన్న తన ఇంటికి నదిలో ఈదుకుంటూ వస్తూ వరద ఉధృతిలో కొట్టుకుపోయాడు. అతడి మృతదేహాన్ని మంగళవారం ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది వెలికి తీశారు. 18వ తేదీన అదే గ్రామానికి చెందిన కారాడి రామకృష్ణ (68) శివాయలంకకు పడవపై గ్రామస్తులను తీసుకువెళ్లాడు. తిరిగి వస్తుండగా పడవ బోల్తా పడటంతో నదిలో కొట్టుకుపోయాడు. ఇతడి మృతదేహాన్ని ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది బుధవారం అప్పనపల్లిలో వెలికితీశారు. ఇద్దరి మృతదేహాలకు రాజోలు ప్రభుత్వాస్పత్రిలో బుధవారం సాయంత్రం పోస్టుమార్టం జరిగింది. ఇదే సమయంలో సీఎం జగన్ ఆదేశాల మేరకు కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు.. బాధితుల ఇళ్లకు మోకాలి లోతు వరద నీటిలో నడిచి వెళ్లి రూ.4 లక్షల చొప్పున ప్రభుత్వ సాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. ప్రభుత్వం స్పందించిన తీరును గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర తదితరులు పాల్గొన్నారు.
కాలినడకన 4 కిలోమీటర్లు
నాతవరం (అనకాపల్లి జిల్లా): రోడ్డు సౌకర్యం లేని గిరిజన గ్రామానికి అనకాపల్లి కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి బుధవారం కాలినడకన వెళ్లారు. కొండలు, గుట్టలు ఎక్కి 4 కిలోమీటర్లు నడిచి వెళ్లి నాతవరం మండలంలోని అసనగిరి గ్రామంలో గిరిజనుల కష్టసుఖాలు తెలుసుకున్నారు. గ్రామంలో అన్ని వీధులూ కలియతిరిగి సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. తాటాకు గుడిసెల్లోకి కూడా వెళ్లి వారితో మాట్లాడారు. ఆ ఆదివాసీ గ్రామానికి వచ్చిన తొలి కలెక్టర్ కావడంతో గిరిజనులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. సుందరకోట పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసి, సరుగుడు సచివాలయంలో వలంటీర్లతో సమావేశమయ్యారు. అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులతో ముచ్చటించారు.
ఇదీ చదవండి: సహాయం.. శరవేగం
Comments
Please login to add a commentAdd a comment