పట్నా: బీహార్‌లోని పట్నాలో ఓ విచిత్ర ఉదంతం వెలుగు చూసింది. నిందితుడు జరిపిన కాల్పుల్లో ఒక గేదె మృతి చెందగా, దానికి పోలీసులు పోస్టుమార్టం నిర్వహింపజేస్తున్నారు. గేదెకు పోస్టుమార్టం నిర్వహించడం ఇదే తొలిసారని సమాచారం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం రాత్రి పట్నాకు 40 కిలోమీటర్ల దూరంలోని ధన్రువాలోని నద్వాన్ సోన్‌మై గ్రామంలో గేదెలను మేపిన అనంతరం మున్నా కుమార్, నావల్ కుమార్ అనే అన్నదమ్ములు ఇంటికి తిరిగి వస్తున్నారు.ఇంతలో నలుగురు వ్యక్తులు మోటార్‌సైకిల్‌పై వచ్చారు. వారు ముందుగా నావల్ ప్రసాద్‌ను కత్తితో పొడిచారు. ఆ తర్వాత అతనిపై కాల్పులు జరిపారు. అయితే మున్నా ప్రసాద్ తృటిలో తప్పించుకోగా, నిందితులు అక్కడున్న గేదెపై కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో గేదె అక్కడికక్కడే మృతి చెందింది. కాల్పుల శబ్ధం విన్న సమీప గ్రామస్తులు అక్కడికి వచ్చి నిందితులను తరిమికొట్టారు. వారు మోటార్‌సైకిల్‌పై పరారయ్యేందుకు ప్రయత్నించారు. ఇంతలోనే వారు కిందపడిపోయారు. దీంతో వారు మోటార్‌సైకిల్‌ను అక్కడే వదిలేసి పారిపోయారు.
సమాచారం అందుకున్న వెంటనే ధన్రువా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బైక్, పిస్టల్, బుల్లెట్, కత్తి, బుల్లెట్ కేసింగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్నాలోని మసౌరీ సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ కన్హయ్య సింగ్ మాట్లాడుతూ, నిందితులు రైతుతోపాటు ఒక గేదెపై కాల్పులు జరిపారన్నారు. ప్రస్తుతం రైతు నావల్ ప్రసాద్ మృతదేహానికి పోస్ట్‌మార్టం జరుగుతుండగా, గేదెకు కూడా పశువైద్యశాలలో పోస్ట్‌మార్టం చేస్తున్నారు. ఆ గేదె ఎలా మృతిచెందిందనే విషయాన్ని తెలుకునేందుకే దానికి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. పరారైన నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment