సింగరాయకొండ, న్యూస్‌లైన్ : ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుడ్రైవర్ నిర్లక్ష్యం మహిళ ప్రాణాన్ని బలితీసుకుంది. మరో 10 మందిని గాయాలపాలు చేసింది. ఇటీవల వరుస బస్సు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా మంగళవారం వేకువజామున సింగరాయకొండలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రయాణికులను ఉలికిపాటుకు గురిచేసింది. ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణమంటేనే భయపడే పరిస్థితికి దారితీసింది. ప్రైవేట్ ట్రావెల్స్‌తో పాటు అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది. ఆ వివరాల్లోకెళ్తే...
కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి నెల్లూరు బయలుదేరింది. మంగళవారం వేకువజామున 4.30 గంటలకు సింగరాయకొండ చేరుకుంది. ఆ సమయంలో బస్సులో మొత్తం 34 మంది ప్రయాణికులున్నారు.
వారిలో ఇద్దరు ప్రయాణికులను సింగరాయకొండలో దించిన అనంతరం మళ్లీ జాతీయ రహదారిపైకి ఎక్కేందుకు పాత సింగరాయకొండ పంచాయతీలోని అయ్యప్పగుడి మీదుగా వస్తూ అక్కడున్న మలుపు వద్ద అదుపుతప్పి పక్కనే ఉన్న గుంతలో బోల్తాపడింది. డ్రైవర్ అతివేగంగా నడపడం వల్లే మలుపులో అదుపుతప్పి బస్సు బోల్తాకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న నెల్లూరు జిల్లా అల్లూరు మండలం నార్త్‌మోపూర్‌కు చెందిన కొండా పద్మావతి (50) బస్సు కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. జడా కృపారావు, ముగ్గు శ్రీనివాసరావు, వెన్నపూస ఓపుల్‌రెడ్డి, ముగ్గు శ్రీధర్, జి.శేఖర్, వై.స్వాతి, షేక్ మహబూబ్‌బాషా, వి.వెంకటేష్, వై.భవానీ, కార్తీక్ అనే ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న 108 సిబ్బంది అంబులెన్స్‌తో వెంటనే అక్కడకు చేరుకుని క్షతగాత్రులకు ప్రథమచికిత్స చేశారు. అదృష్టవశాత్తూ ఎలాంటి గాయాలూకాకుండా బయటపడిన మిగతా 21 మంది ఇతర వాహనాల్లో గమ్యస్థానాలకు తరలివెళ్లారు.
కుమార్తె వివాహానికి దుస్తులు తీసుకెళ్తూ...
ఈ ప్రమాదంలో మృతిచెందిన నెల్లూరు జిల్లా అల్లూరు మండలం నార్త్‌మోపూర్‌కు చెందిన కొండా పద్మావతి (50) హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న పెద్దకుమార్తె, అల్లుడు వద్ద ఉంటూ.. త్వరలో జరగనున్న రెండో కుమార్తె వివాహానికి దుస్తులు కొనుగోలుచేసి తీసుకుని స్వగ్రామం బయలుదేరింది. మార్గమధ్యంలోనే డ్రైవర్ నిర్లక్ష్యానికి బలైపోయింది. సంఘటన స్థలానికి చేరుకున్న ఆమె భర్త రాఘవరెడ్డి, బంధువులు భోరున విలపించారు. బస్సు కింద ఇరుక్కుపోయిన ఆమె మృతదేహాన్ని బయటకు తీసేందుకు సింగరాయకొండ పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. సంఘటన స్థలానికి చేరుకున్న ఏఎస్సై మహబూబ్‌బాషా రెండు క్రేన్లను తెప్పించి బస్సును పైకిలేపి మృతదేహాన్ని బయటకుతీశారు. పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌తో పాటు పక్కనే ఉన్న మరో డ్రైవర్, క్లీనర్ కూడా పరారయ్యారు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సింగరాయకొండ పోలీసులు తెలిపారు.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
Published Wed, Nov 20 2013 4:15 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 AM
Advertisement
Advertisement