Single teachers
-
విద్యాబోధకులు హుళక్కే!
ప్రతిపాదించిన ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్ల సంఖ్య 591 ఇప్పటికీ మంజూరు చేయని ప్రభుత్వం సర్కారు బడుల్లో కుంటుపడుతున్న చదువులు ఆందోళనలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన సంకటంలో పడింది. విద్యాసంవత్సరం ప్రారంభమై ఆర్నెల్లు పూర్తయినా పలు తరగతుల్లో బోధన అంతంతమాత్రంగానే సాగింది. ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయకపోవడం.. కనీసం ఖాళీ స్థానాల్లో విద్యా బోధకుల (ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్లు)ను సైతం నియమించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం జిల్లాలో 1,150 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ గుర్తించింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. అయితే డీఎస్సీ ద్వారా టీచర్ల నియామకాల ప్రక్రియపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో ఆయా పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. ఈ క్రమంలో పలు చోట్ల సింగిల్ టీచర్లు, కొన్నిచోట్ల టీచర్లు లేని పాఠశాలుండడంతో అక్కడ బోధన ప్రశ్నార్థకంగా మారింది. కనీసం కాంట్రాక్టు పద్ధతిలోనైనా విద్యాబోధకులను సైతం నియమించకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో 2,316 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో 1,639 ప్రాథమిక, 259 ప్రాథమికోన్నత, 418 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో దాదాపు 3.2 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో ఆరువందల ప్రభుత్వ పాఠశాల్లో టీచర్ల సమస్య నెలకొంది. ఆయా పాఠశాలల్లో 22,507 మంది విద్యార్థులు చదువుతున్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఏకంగా 493 తెలుగుమీడియం ప్రాథమిక పాఠశాలలు, 41 ఉర్దూ మీడియం పాఠశాలల్లో సింగిల్ టీచర్లున్నారు. మిగతా 66 పాఠశాలల్లో టీచర్ల కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ డిప్యూటేషన్లతో కొంతమంది టీచర్లను.. సమస్యాత్మక పాఠశాలల్లో నియమించినప్పటికీ.. పాఠ్యాంశాలబోధనలో మాత్రం ఆశించిన పురోగతి లేకుండాపోయింది. బోధకులు లేనట్లే.. సాధారణంగా టీచర్ల కొరత ఉన్న పాఠశాలల్లో ప్రభుత్వం విద్యాబోధకులను కొనసాగించేది. విద్యాహక్కు చట్టం ప్రకారం బోధకుల నియమించకూడదు. కానీ టీచర్ల నియామకాలు చేపట్టకపోవడంతో విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఆయా ఖాళీల్లో విద్యాబోధకులను నియమిస్తే పాఠ్యాంశాల బోధన సమయానుసారం జరిగేది. ఇందులో భాగంగా జిల్లాకు 591 మంది బోధకులు అవసరమని సర్వశిక్షా అభియాన్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ మరో మూడు మాసాల్లో విద్యా సంవత్సరం ముగుస్తున్నప్పటికీ.. ప్రభుత్వం విద్యాబోధకుల ఊసే ఎత్తడం లేదు. ఈపాటికే పాఠ్యాంశాల బోధన పూర్తికావాల్సి ఉండగా.. టీచర్ల సమస్యతో జిల్లాలో మెజారిటీ పాఠశాలల్లో బోధన నత్తనడకన సాగుతోంది. -
ప్రాథమిక విద్య పటిష్టతే ధ్యేయం
వికారాబాద్: జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలను డిసెంబర్ నెల నుంచి ఎంఈవోలు తనిఖీ చేయాలని జిల్లా విద్యాధికారి సూచించారు. స్థానిక మెరీయానాట్స్ పాఠశాల ఆవరణలో జిల్లా హెచ్ఎంలు, ఎంఈవోలతో బుధవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రతీరోజు పాఠశాలలకు పిల్లల తల్లిదండ్రులు వచ్చి పాఠశాలల పనితీరును పరిశీలించాలనీ, కానీ టీచర్లను ప్రశ్నించొద్దని హితవు పలికారు. ఎదైనా సమస్య ఉంటే ప్రధానోపాధ్యాయుల దృష్టికి తీసుకురావాలన్నారు. తన లక్ష్యమంతా ప్రాథమిక విద్యను పటిష్టంగా తయారు చేయడమేనన్నారు. విద్యార్థులకు బట్టి వ్యవస్థను అలవాటు చేయకుండా, విభిన్న రంగాల్లో ప్రతిభావంతులుగా తయారయ్యే విధంగా చదవడం, రాయడంతోపాటు చతుర్విధ వ్యవస్థలకు అలవాటు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరుపై వచ్చే నెల నుంచి బృందాల తనిఖీలుంటాయన్నారు. ప్రధానోపాధ్యాయులు చొరవ తీసుకొని సాయంత్రం 5.30 గంటల సమయంలో విద్యార్థులకు స్వయంగా పాఠ్యంశాల బోధన చేయాలన్నారు. పాఠశాలలను కాపాడుకోవలసి బాధ్యత ఉపాధ్యాయులతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులపై ఉందన్నారు. విద్యార్థులను పాఠశాలలకు క్రమం తప్పకుండా పంపించే బాధ్యత తల్లిదండ్రులదేనన్నారు. జిల్లా వ్యాప్తంగా 344 మంది సింగిల్ టీచర్లు పనిచేస్తున్నారని, వారి ప్రాధాన్యతకు తప్పకుండా గుర్తింపునిస్తామన్నారు. గతేడాదికంటే ఈ ఏడాది పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించడమే తమ అంతిమ లక్ష్యమన్నారు. జిల్లా వ్యాప్తంగా 170 భవనాలు కూలడానికి సిద్ధంగా ఉన్నాయని, వాటిని పునరుద్ధరించడానికి జిల్లా పరిషత్ సీఈవో అనుమతి ఇచ్చారన్నారు. ఇంక ఎక్కడైనా శిథిలావస్థలో పాఠశాలల భవనాలుంటే ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. సమాచారమివ్వకుండా దీర్ఘకాలికంగా పాఠశాలలకు గైర్హాజర్ అయిన ఉపాధ్యాయుల వివరాలను వెంటనే తనకు అందించాలని ఎంఈవోలను ఆదేశించారు. ఉపాధ్యాయుల సీనియారిటీ లిస్టు జిల్లా విద్యాధికారి వెబ్సైట్లో ఉందనీ, ఏమైనా తప్పులుంటే సరిచేసి అందుబాటులో ఉన్న ఎంఈవోలకు ఇవ్వాలని ఉపాధ్యాయులకు తెలిపారు. సీనియారిటీ లిస్టును అధికారికంగా డిసెంబర్ 2న విడుదల చేస్తామన్నారు. ఉపాధ్యాయులు మెడికల్ లీవులను దుర్వినియోగం చేస్తే బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. సమస్యలుంటే ఉపాధ్యాయులు తనను నేరుగా ఫోన్లో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో వికారాబాద్ ఎంఈవో గోవర్ధన్‌రెడ్డి, ధారూరు ఎంఈవో శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులూ.. తీరు మార్చుకోండి చేవెళ్ల రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల తీరు మారాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని డీఈఓ రమేశ్ అన్నారు. మండలంలోని దామరగిద్ద ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్య తీరుపై గ్రామ సర్పంచ్ మధుసూదన్‌గుప్త ఫిర్యాదు చేయటంతో బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలోని ఉపాధ్యాయులు ఎక్కడి నుంచి వస్తున్నారని ప్రశ్నించారు. అనంతరం పాఠశాలలోని అన్ని తరగతులు తిరిగి ఉపాధ్యాయుల బోధన తీరును తెలుసుకునేందుకు విద్యార్థులకు వివిధ ప్రశ్నలు వేశారు. 4,5,7,8వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి, స్వయంగా విద్యార్థుల పేపర్లను దిద్దారు. ఉపాధ్యాయుల బోధన సక్రమంగా లేదని, అందుకే పాఠశాల విద్యార్థుల పురోగతి బాగా లేదన్నారు. ఉపాధ్యాయులు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. లేకుంటే కఠినచర్యలు తప్పవన్నారు. విద్యార్థుల పరిస్థితిని చూసి ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్యకు మోమో జారీ చేస్తున్నట్లు ప్రకటించారు. సర్పంచ్ ఫిర్యాదుతోనే ఆకస్మిక తనిఖీ.. గ్రామ సర్పంచ్ మధుసూదన్ గుప్త బుధవారం ఉదయం పాఠశాలను సందర్శించారు. ఆ సమయంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్య రాలేదు. ఎందుకు రాలేదని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. ఈ విషయాన్ని డీఈఓకు సర్పంచ్ ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన డీఈఓ ఎంఈఓను తనిఖీకి పంపుతానని చెప్పారు. కానీ డీఈఓ రమేశ్ తానే పాఠశాలను సందర్శించేందుకు ఆకస్మికంగా పాఠశాలకు వచ్చారు. -
సింగిల్ టీచర్లకు.. బడి భారం
విజయనగరం అర్బన్: విద్యార్థులకు ఒక వైపు పాఠాలు చెప్పేది..క్రమశిక్షణ నేర్పేది ఆయనే..మరోవైపు నూతన విద్యాబోధన విధానం నిరంతర సమగ్ర మూల్యాంకన(సీసీఈ)ం మేరకు ప్రతి విద్యార్థి ప్రతిభను వ్యక్తిగతంగా పరిశీలించి గ్రేడింగ్ వేయాల్సిన అదనపు పనిభారం. పని ఒత్తిడి నేపథ్యంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు బోధనకు దూరంగా ఉంటున్నాయి. మరో టీచర్ అవసరమని అడిగినా అదిగో..ఇదిగో అంటూ వాయిదాలు వేస్తారే కానీ, సిబ్బందిని మాత్రం కేటాయించరు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల నిష్పత్తికి మించి అదనంగా టీచర్లు ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడంతో జిల్లాలోని పాఠశాలల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. జిల్లాలో గత ఏడాదిలో ప్రతినెలాఖరున నిర్వహించిన సబ్జెక్టు టీచర్ల పదోన్నతుల భర్తీ వల్ల ఉన్నత పాఠశాలల్లో టీచర్ల కొరత కొంతమేరకు తీరింది. కానీ పదోన్నతుల భర్తీ వల్ల ప్రాథమిక పాఠశాలల్లో 624 పోస్టుల వరకు జిల్లాలో ఎస్జీటీ పోస్టులు ఖాళీ అయ్యాయి. వీటితో పాటు ఇప్పటికే ఈ పాఠశాలల్లో గత ఏడాది రద్దయిన విద్యావలంటీర్ల పోస్టుల ఎస్జీటీ స్థానాలు మరో 700 వరకు ఉన్నాయి. జిల్లాలో 2,844 ప్రాథమిక పాఠశాలల్లో గత సెప్టెంబర్‌లో నమోదైన డైస్ నివేదిక ప్రకారం 1.55 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరికి ఆరువేల మంది ఎస్జీటీ ఉపాధ్యాయులు బోధన అందిస్తున్నారు. విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయుల నిష్పత్తి లేదని రెండేళ్ల క్రితం 700 మంది విద్యావలంటీర్లతో బోధన ప్రక్రియను సాగించారు. అయితే విద్యాహక్కు చట్టం అమలు నేపథ్యంలో విద్యాశాఖ ఈ విధానానికి గత ఏడాది మంగళం పలికింది. ప్రత్యామ్నాయంగా అకడమిక్ ఇన్స్ట్రక్టర్స్ పేరుతో నిరుద్యోగ ఉపాధ్యాయలను వేసుకోవాలనే వెసులుబాటు ఇచ్చారు. కానీ రాష్ట్రస్థాయి అధికారులు అనుమతించిన 73 మంది పరిమితి సంఖ్యలో ప్రాథమిక పాఠశాలల ఎస్జీటీలకు కాకుండా కేవలం ఉన్నత పాఠశాలల్లోని సబ్జెక్టు టీచర్పోస్టులకు మాత్రమే వర్తింపజేశారు. పూర్వపు రోజుల మాదిరిగా ఏకోపాధ్యాయ పాఠశాలలు ప్రస్తుతం దర్శనమిస్తూ ప్రభుత్వ పనితీరును వెక్కిరిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 2,844 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఏకోపాధ్యాయ పాఠశాలలు 624 ఉన్నాయి. గత ఏడాది అధిక సంఖ్యలో పదోన్నతులు ఇవ్వడంతో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయుల సంఖ్య తగ్గింది. 25,257 మంది విద్యార్థులున్న ఏకోపాధ్యాయ పాఠశాలలు ఐటీడీఏ ప్రాంతాల్లో, ప్రభుత్వ పాఠశాలలు కలిపి 306, మండల ప్రజాపరిషత్ స్కూళ్లు 314, మున్సిపాలిటీల్లో 4 ఉన్నాయి. అసలు ఉపాధ్యాయులు లేని పాఠశాలలు 10వరకు ఉండగా, 50 నుంచి 70 మంది విద్యార్థులున్న పాఠశాలలు డజను వరకు ఉన్నాయి. వీటి స్థానాల్లో అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించాలని ఉపాధ్యాయ సంఘాలు ఎప్పటినుంచో కోరుతున్నాయి. అయితే దీనిపై విద్యాశాఖ నుంచి స్పందన లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆవేదన చెందుతున్నారు. ఏకోపాధ్యాయ పాఠశాలలో ఉపాధ్యాయుడు అత్యవసర సమయంలో సెలవు పెట్టిన రోజున ఇతర పాఠశాలల్లోని టీచర్లు ఇక్కడికి రావడానికి ససేమిరా.. అంటున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవట్లేదు. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టడం లేదు. దీంతో ఉపాధ్యాయుడు సెలవు పెట్టిన ప్రతిసారీ పాఠశాల మూసేయవలసిందే..! ఒకటి నుంచి ఐదోతరగతి వరకు ఒక్కరే ఉపాధ్యాయుడు పాఠాలు చెప్పాలంటే తలకు మించిన భారం. అన్ని తరగతుల విద్యార్థుల్ని ఒకే గదిలో కూర్చోబెట్టి పాఠాలు చెప్పడం ఉపాధ్యాయుల ఓపికకు సవాల్‌గా మారింది. మళ్లీ డీఎస్సీ నిర్వహిస్తే గాని పోస్టులు భర్తీ అయ్యే అవకాశాలు కనిపించ డం లేదు. ఒకేసారి బోధిస్తే, పాఠాలు ఎలా అర్థమవు తాయని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. రేషనలైజేషన్‌తో పరిష్కారం జిల్లాలో ప్రమోషన్లు, ఉద్యోగ విరమణల వల్ల పలు స్కూళ్లు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం వల్ల విద్యావలంటీర్లను వేయలేని పరిస్థితి ఉంది. దీంతో ఏకోపాధ్యాయ సమస్యలను పరిష్కరించలేక పోయాం. ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా సర్దుబాటు (రేషనలైజేషన్) ప్రక్రియ త్వరలో చేపట్టే అవకాశం ఉంది. సమస్య పరిష్కారం అవుతుంది. -జి. కృష్ణారావు, డీఈఓ