సింగిల్ టీచర్లకు.. బడి భారం
విజయనగరం అర్బన్: విద్యార్థులకు ఒక వైపు పాఠాలు చెప్పేది..క్రమశిక్షణ నేర్పేది ఆయనే..మరోవైపు నూతన విద్యాబోధన విధానం నిరంతర సమగ్ర మూల్యాంకన(సీసీఈ)ం మేరకు ప్రతి విద్యార్థి ప్రతిభను వ్యక్తిగతంగా పరిశీలించి గ్రేడింగ్ వేయాల్సిన అదనపు పనిభారం. పని ఒత్తిడి నేపథ్యంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు బోధనకు దూరంగా ఉంటున్నాయి. మరో టీచర్ అవసరమని అడిగినా అదిగో..ఇదిగో అంటూ వాయిదాలు వేస్తారే కానీ, సిబ్బందిని మాత్రం కేటాయించరు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల నిష్పత్తికి మించి అదనంగా టీచర్లు ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడంతో జిల్లాలోని పాఠశాలల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. జిల్లాలో గత ఏడాదిలో ప్రతినెలాఖరున నిర్వహించిన సబ్జెక్టు టీచర్ల పదోన్నతుల భర్తీ వల్ల ఉన్నత పాఠశాలల్లో టీచర్ల కొరత కొంతమేరకు తీరింది. కానీ పదోన్నతుల భర్తీ వల్ల ప్రాథమిక పాఠశాలల్లో 624 పోస్టుల వరకు జిల్లాలో ఎస్జీటీ పోస్టులు ఖాళీ అయ్యాయి. వీటితో పాటు ఇప్పటికే ఈ పాఠశాలల్లో గత ఏడాది రద్దయిన విద్యావలంటీర్ల పోస్టుల ఎస్జీటీ స్థానాలు మరో 700 వరకు ఉన్నాయి.
జిల్లాలో 2,844 ప్రాథమిక పాఠశాలల్లో గత సెప్టెంబర్‌లో నమోదైన డైస్ నివేదిక ప్రకారం 1.55 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరికి ఆరువేల మంది ఎస్జీటీ ఉపాధ్యాయులు బోధన అందిస్తున్నారు. విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయుల నిష్పత్తి లేదని రెండేళ్ల క్రితం 700 మంది విద్యావలంటీర్లతో బోధన ప్రక్రియను సాగించారు. అయితే విద్యాహక్కు చట్టం అమలు నేపథ్యంలో విద్యాశాఖ ఈ విధానానికి గత ఏడాది మంగళం పలికింది. ప్రత్యామ్నాయంగా అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్స్ పేరుతో నిరుద్యోగ ఉపాధ్యాయలను వేసుకోవాలనే వెసులుబాటు ఇచ్చారు. కానీ రాష్ట్రస్థాయి అధికారులు అనుమతించిన 73 మంది పరిమితి సంఖ్యలో ప్రాథమిక పాఠశాలల ఎస్జీటీలకు కాకుండా కేవలం ఉన్నత పాఠశాలల్లోని సబ్జెక్టు టీచర్‌పోస్టులకు మాత్రమే వర్తింపజేశారు.
పూర్వపు రోజుల మాదిరిగా ఏకోపాధ్యాయ పాఠశాలలు ప్రస్తుతం దర్శనమిస్తూ ప్రభుత్వ పనితీరును వెక్కిరిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 2,844 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఏకోపాధ్యాయ పాఠశాలలు 624 ఉన్నాయి. గత ఏడాది అధిక సంఖ్యలో పదోన్నతులు ఇవ్వడంతో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయుల సంఖ్య తగ్గింది. 25,257 మంది విద్యార్థులున్న ఏకోపాధ్యాయ పాఠశాలలు ఐటీడీఏ ప్రాంతాల్లో, ప్రభుత్వ పాఠశాలలు కలిపి 306, మండల ప్రజాపరిషత్ స్కూళ్లు 314, మున్సిపాలిటీల్లో 4 ఉన్నాయి. అసలు ఉపాధ్యాయులు లేని పాఠశాలలు 10వరకు ఉండగా, 50 నుంచి 70 మంది విద్యార్థులున్న పాఠశాలలు డజను వరకు ఉన్నాయి. వీటి స్థానాల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించాలని ఉపాధ్యాయ సంఘాలు ఎప్పటినుంచో కోరుతున్నాయి. అయితే దీనిపై విద్యాశాఖ నుంచి స్పందన లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆవేదన చెందుతున్నారు.
ఏకోపాధ్యాయ పాఠశాలలో ఉపాధ్యాయుడు అత్యవసర సమయంలో సెలవు పెట్టిన రోజున ఇతర పాఠశాలల్లోని టీచర్లు ఇక్కడికి రావడానికి ససేమిరా.. అంటున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవట్లేదు. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టడం లేదు. దీంతో ఉపాధ్యాయుడు సెలవు పెట్టిన ప్రతిసారీ పాఠశాల మూసేయవలసిందే..! ఒకటి నుంచి ఐదోతరగతి వరకు ఒక్కరే ఉపాధ్యాయుడు పాఠాలు చెప్పాలంటే తలకు మించిన భారం. అన్ని తరగతుల విద్యార్థుల్ని ఒకే గదిలో కూర్చోబెట్టి పాఠాలు చెప్పడం ఉపాధ్యాయుల ఓపికకు సవాల్‌గా మారింది. మళ్లీ డీఎస్సీ నిర్వహిస్తే గాని పోస్టులు భర్తీ అయ్యే అవకాశాలు కనిపించ డం లేదు. ఒకేసారి బోధిస్తే, పాఠాలు ఎలా అర్థమవు తాయని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
రేషనలైజేషన్‌తో పరిష్కారం
జిల్లాలో ప్రమోషన్లు, ఉద్యోగ విరమణల వల్ల పలు స్కూళ్లు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం వల్ల విద్యావలంటీర్లను వేయలేని పరిస్థితి ఉంది. దీంతో ఏకోపాధ్యాయ సమస్యలను పరిష్కరించలేక పోయాం. ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా సర్దుబాటు (రేషనలైజేషన్) ప్రక్రియ త్వరలో చేపట్టే అవకాశం ఉంది. సమస్య పరిష్కారం అవుతుంది.
-జి. కృష్ణారావు, డీఈఓ