ప్రతిపాదించిన ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్ల సంఖ్య 591
ఇప్పటికీ మంజూరు చేయని ప్రభుత్వం
సర్కారు బడుల్లో కుంటుపడుతున్న చదువులు
ఆందోళనలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన సంకటంలో పడింది. విద్యాసంవత్సరం ప్రారంభమై ఆర్నెల్లు పూర్తయినా పలు తరగతుల్లో బోధన అంతంతమాత్రంగానే సాగింది. ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయకపోవడం.. కనీసం ఖాళీ స్థానాల్లో విద్యా బోధకుల (ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్లు)ను సైతం నియమించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం జిల్లాలో 1,150 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ గుర్తించింది.
ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. అయితే డీఎస్సీ ద్వారా టీచర్ల నియామకాల ప్రక్రియపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో ఆయా పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. ఈ క్రమంలో పలు చోట్ల సింగిల్ టీచర్లు, కొన్నిచోట్ల టీచర్లు లేని పాఠశాలుండడంతో అక్కడ బోధన ప్రశ్నార్థకంగా మారింది. కనీసం కాంట్రాక్టు పద్ధతిలోనైనా విద్యాబోధకులను సైతం నియమించకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.
జిల్లాలో 2,316 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో 1,639 ప్రాథమిక, 259 ప్రాథమికోన్నత, 418 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో దాదాపు 3.2 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో ఆరువందల ప్రభుత్వ పాఠశాల్లో టీచర్ల సమస్య నెలకొంది. ఆయా పాఠశాలల్లో 22,507 మంది విద్యార్థులు చదువుతున్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి.
ఏకంగా 493 తెలుగుమీడియం ప్రాథమిక పాఠశాలలు, 41 ఉర్దూ మీడియం పాఠశాలల్లో సింగిల్ టీచర్లున్నారు. మిగతా 66 పాఠశాలల్లో టీచర్ల కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ డిప్యూటేషన్లతో కొంతమంది టీచర్లను.. సమస్యాత్మక పాఠశాలల్లో నియమించినప్పటికీ.. పాఠ్యాంశాలబోధనలో మాత్రం ఆశించిన పురోగతి లేకుండాపోయింది.
బోధకులు లేనట్లే..
సాధారణంగా టీచర్ల కొరత ఉన్న పాఠశాలల్లో ప్రభుత్వం విద్యాబోధకులను కొనసాగించేది. విద్యాహక్కు చట్టం ప్రకారం బోధకుల నియమించకూడదు. కానీ టీచర్ల నియామకాలు చేపట్టకపోవడంతో విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఆయా ఖాళీల్లో విద్యాబోధకులను నియమిస్తే పాఠ్యాంశాల బోధన సమయానుసారం జరిగేది. ఇందులో భాగంగా జిల్లాకు 591 మంది బోధకులు అవసరమని సర్వశిక్షా అభియాన్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ మరో మూడు మాసాల్లో విద్యా సంవత్సరం ముగుస్తున్నప్పటికీ.. ప్రభుత్వం విద్యాబోధకుల ఊసే ఎత్తడం లేదు. ఈపాటికే పాఠ్యాంశాల బోధన పూర్తికావాల్సి ఉండగా.. టీచర్ల సమస్యతో జిల్లాలో మెజారిటీ పాఠశాలల్లో బోధన నత్తనడకన సాగుతోంది.
విద్యాబోధకులు హుళక్కే!
Published Sun, Dec 21 2014 11:11 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement