Single tender
-
కుప్పలు..తెప్పలు
♦ మద్యం దుకాణాలకు దరఖాస్తుల వెల్లువ ♦ 138 దుకాణాలకు 1466 దరఖాస్తులు ♦ 13 దుకాణాలకు సింగిల్ టెండర్లు ♦ 5 దుకాణాలకు సున్నా దరఖాస్తులు ♦ అత్యధికంగా నిడమనూరు మండలం తుమ్మడం దుకాణానికి 52 ♦ దరఖాస్తుల రూపంలో వచ్చిన ఆదాయం రూ.14.66 కోట్లు ♦ నేటితో దరఖాస్తుల స్వీకరణ ఆఖరు నల్లగొండ : మద్యం దుకాణాలు కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చి పడ్డాయి. సోమవారం త్రయోదశి మంచి రోజు కావడంతో భారీ సంఖ్యలో దరఖాస్తు చేశారు. జిల్లాలో 138 దుకాణాలకు సోమవారం ఒక్క రోజే 875 దరఖాస్తులు రావడం విశేషం. దీంట్లో అత్యధికంగా నిడమనూరు మండలం తుమ్మడం దుకాణానికి 52 మంది పోటీ పడుతున్నారు. రెండో స్థానంలో కనగల్ మండలం దర్వేశిపురం దుకాణానికి 31మంది పోటీలో ఉన్నారు. సింగిల్ టెండర్లు వచ్చిన దుకాణాలు 13 ఉన్నాయి. వీటిల్లో నల్లగొండ మున్సిపాలిటీ, దేవరకొండ నగర పంచాయతీ దుకాణాలే ఉన్నాయి. అసలు దరఖాస్తులు రాని దుకాణాలు 5 ఉన్నాయి. ఇవి కూడా నల్లగొండ మున్సిపాలిటీలోనే చెందినవే. ఈ నెల 13నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకాగా తొలిరోజు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. 14 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకాగా, ఆదివారం నాటికి 591 దరఖాస్తులు వచ్చాయి. సోమవారం వచ్చిన 875 దరఖాస్తులతో కలిపి ఇప్పటివరకు 138 దుకాణాలకు 1466 మంది దరఖాస్తు చేశారు. ఒక్కో దరఖాస్తు రుసుము రూ.లక్షలు కాగా...ప్రభుత్వానికి దరఖాస్తుల రూపంలో ఇప్పటి వరకు రూ.14.66 కోట్ల ఆదాయం సమకూరింది. దరఖాస్తుల స్వీకరణ మంగళవారంతో ముగియనుంది. అంచనాలకు మించి... ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గతంలో మూడు వేలకుపైగా దరఖాస్తులు రాగా దాంట్లో కేవలం నల్లగొండ జిల్లాలోనే 1700 దరఖాస్తులు వచ్చాయి. ఈ లెక్కన ఈ దఫా 1300 దరఖాస్తులు వస్తాయని అధికారలు అంచనా వేశారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ రికార్డు స్థాయిలో వ్యాపారుస్తుల నుంచి పోటీ రావడంతో అధికారులు బిత్తరపోయారు. సూర్యాపేట జిల్లాలో పోటీ ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాంతానికి చెందిన వారు కూడా నల్లగొండ జిల్లాలోని దుకాణాలకు పోటీ పడుతున్నారు. అలాగే గుంటూరు జిల్లాకు చెందిన వ్యాపారులు కూడా మిర్యాలగూడ, దామరచర్ల ప్రాంతంలోన దుకాణాలకు టెండర్లు వేస్తున్నారు. ఆంధ్రాలో లిక్కర్ మాఫియాకు అడ్డుకట్టపడటంతో అక్కడి వ్యాపారులు నల్లగొండ జిల్లా పై కన్నేశారు. దరఖాస్తుదారుల్లో మహిళలు కూడా ఉండటం విశేషం. -
హంద్రీ–నీవా..ఇప్పట్లో రావా?
–హంద్రీ–నీవాకు అవాంతరాలు –నత్తనడకన ‘సాగు’తున్న పనులు – కొన్ని పనులకు రాని అనుమతులు – మరికొన్ని రద్దు .. కోర్టుకెళ్ళిన రైతులు – అనుమతులు ఇవ్వని విద్యుత్‌శాఖ –ప్రాజెక్టు పూర్తికి మరికొన్నాళ్లు కరువు తాండవిస్తున్న జిల్లాకు హంద్రీ–నీవానీరు ఇప్పట్లో చేరేలా లేదు. సర్కారు పెద్దలు మాత్రం ఎప్పటికప్పుడు ఇదిగో అదిగో అంటూ అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. వాస్తవ స్థితిగతులను పరిశీలిస్తే అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. అవాంతరాలను అధిగమించి నీరందిండం ఈ ఏడాది చివరికి కూడా సాధ్యం కాదని నిపుణులే లోపాయికారీగా అంగీకరిస్తున్నారు. పైగా ఈ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. జిల్లాలో హంద్రీ నీవా ద్వారా 2.17 లక్షల ఎకరాలకు సాగునీరు, 6 లక్షల మందికి తాగునీరందించాలని 2006లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో పనులు ప్రారంభమయ్యాయి. తొలుత కర్నూలు జిల్లా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి జీడిపల్లి రిజర్వాయర్ వరకు 212 కిలో మీటర్ల మేర పనులతో పాటు అనంతపురం జిల్లా గొల్లపల్లి రిజర్వాయర్ వరకు రెండో దశ పనులు పూర్తయ్యాయి. అక్కడ నుంచి చెర్లోపల్లె రిజర్వాయర్ వరకు ముదిగుబ్బ సమీపంలో చిత్రావతి నదిపై వంతెన కాలువను నిర్మించాల్సి ఉంది. ఇవిగో అడ్డంకులు –బిల్లావాండ్లపల్లె వద్ద 5.3 కి.మీ. మేర సొరంగం పనుల్లో 1.7 కిలోమీటర్ల మేర పనులు లూజ్‌సాయిల్ వలన ఆగిపోయాయి. రెండో ప్యాకేజిలో 1.47 కిలో మీటర్ల పనులను సింగిల్ టెండరు సాకుతో ప్రభుత్వం నిలుపుదల చేసింది. నాలుగో సొరంగం పనులకు ఇంతవరకు టెండర్లు పిలవలేదు. తాజాగా ఈ ప్రదేశంలో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని తీసుకెళ్ళాలనే ప్రతిపాదనకు సర్కారు నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. – వైఎస్సార్ జిల్లాలోని శ్రీనివాసపురం రిజర్వాయర్ ముంపు బాధితులైన అడవిలోవట్టంవాండ్లపల్లె గ్రామస్థులకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించలేదు. దీంతో వారు గ్రామాన్ని ఇప్పటి వరకు ఖాళీచేయలేదు. –అడవిపల్లె రిజర్వాయర్ నుంచి నీవానది వరకు గల ప్యాకేజి నెం. 27, 28 లలో పూర్తిగా అటవీప్రాంతం. పనులకు అటవీశాఖ నుంచి ఇటీవలే అనుమతులు వచ్చాయి. –బిల్లావాండ్ల పల్లె నుంచి చినమండ్యం మండలం కలిబండ వరకు గల 20వ ప్యాకేజి పనులు పూర్తయితే తప్ప నీవాకు నీరు రావడం కలగానే మిగలనుంది. –పుంగనూరు బ్రాంచి కెనాల్లో 6 ఎత్తిపోతల పథకాలు, రెండు మంచినీటి రిజర్వాయర్లు ఉన్నాయి. మదనపల్లి మండలం కోళ్లబైలు వద్ద చేపట్టిన 2.3 కిలో మీటర్ల సొరంగ మార్గం పనులు ఓ స్థాయికి చేరినా, చిప్పిలి రిజర్వాయర్ పనులు ప్రారంభమే కాలేదు. మిగతా పనులన్నీ పూర్తయినా రిజర్వాయర్, సొరంగం పనుల పెండింగ్‌తో పుంగనూర్ కెనాల్ పనులు అగాయి. –కుప్పం బ్రాంచి కెనాల్ పనులు రూ.486 కోట్లతో చేపట్టారు. ఇందులో 3 ఎత్తిపోతల పథకాలు, రెండు సొరంగ మార్గం పనులు తొలుత డిజైన్ చేశారు. సొరంగం పనులు నత్తనడకన జరుగుతున్నాయని దూరాన్ని తగ్గించారు. –కుప్పం మండలం యామిగాని పల్లె వద్ద సొరంగం పనులు చేపట్టాల్సి ఉంది. గుడిపల్లి మండలంలో రైల్వే లైన్‌ను కాలువ క్రాస్ చేయాల్సి ఉంది. దీనికి రైల్వే శాఖ నుంచి ఇంతవరకూ అనుమతి రాలేదు. బైరెడ్డిపల్లె, పెద్దబరినేపల్లె, రాజుపేట, శాంతిపురం ప్రాంతాల రైతులు ప్రత్యామ్నాయ భూమిని చూపెట్టాలంటూ హైకోర్టుకు వెళ్ళడంతో పనులు ఆగాయి. లిఫ్ట్‌లకు అందని విద్యుత్ జిల్లాలోని 29 మండలాల్లో 1.75 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు ఇవ్వాల్సిన హంద్రీ నీవా పథకానికి 12 లిఫ్ట్‌లు 3 రిజర్వాయర్లకు 2012లోనే విద్యుత్ అనుమతుల కోసం రూ.430 కోట్లు చెల్లించినా ఇంతవరకు విద్యుత్ అనుమతి రాలేదు. దీంతో లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు విద్యుత్ గ్రహణం పట్టింది. హంద్రీ నీవా పనులను అత్యవసరంగాచేపట్టినా మరో రెండేళ్లు తప్పదని తెలుస్తోంది. -
మళ్లీ సింగిల్ టెండర్
జమ్మికుంట :జమ్మికుంట నగర పంచాయతీ అంటేనే సింగిల్ టెండర్ అన్నట్లుగా మారింది పరిస్థితి. అంతా ముందే సిద్ధం చేసుకున్నట్లుగా చాలా పనులకు ఆన్లైన్లో సింగిల్ టెండర్లు దాఖలు కావడం.. మొదట తిరస్కరించిన కౌన్సిల్ ఆనక ఆమోదం తెలపడం... అనేక విమర్శలు వస్తున్నా... తాజాగా వచ్చిన ఏడు పనులకు సైతం సింగిల్ టెండర్లే దాఖలు కావడం విస్మయపరుస్తోంది. జమ్మికుంట నగర పంచాయతీలో ప్లాన్ గ్రాంట్ నిధులతో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గత నెలలో రూ.1.77 కోట్లతో 28 పనులకు ఆన్లైన్ టెండర్లు పిలవగా అన్నీ సింగిల్ టెండర్లే రావడం, 0.01 నుంచి 0.75 శాతం లెస్‌కు దాఖలయ్యాయి. కాంట్రాక్టర్లు రింగై సింగిల్ టెండర్లు దాఖలు చేశారనే కథనాలు పత్రికల్లో రావడంతో అధికారులు వాటిని రద్దు చేశారు. అప్పటి 28 పనులతోపాటు మరికొన్నింటిని కలిపి మొత్తం 67 పనులకు రూ.3 కోట్ల 54 లక్షల అంచనా వ్యయంతో ఈ నెల 6న టెండర్లు పిలిచారు. 10వ తేదీ వరకు గడువు విధించారు. వీటిలో 48 పనులకు సింగిల్ టెండర్లే దాఖలు కాగా, రెండు 4.90 శాతం ఎక్సెస్‌తో దాఖలయ్యాయి. ఐదు టెండర్లు సాంకేతిక లోపంతో తెరుచుకోలేదు. ఎక్సెస్ టెండర్లతోపాటు తెరుచుకోని ఐదింటిని మినహాయించి మిగతావాటికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ ఏడు పనులకు ఈ నెల 24న రూ.45 లక్షల అంచనా వ్యయంతో మళ్లీ టెండర్లు పిలిచారు. 28 వరకు గడువు ఇవ్వగా బుధవారం వచ్చిన ఆన్లైన్ బిడ్లను అధికారులు తెరిచినట్లు సమాచారం. ఏడు పనులకు సింగిల్ టెండర్లే దాఖలయ్యాయి. ప్రతీ పనికి 0.20, 0.40, 1.40, 1.80 , 1.10, 1.50 శాతం లెస్ కోట్తో టెండర్లు వచ్చినట్లు తెలిసింది. మొన్న ఎక్సెస్... నేడు లెస్ సీసీ రోడ్డు పనుల కోసం రూ.19 లక్షల వ్యయంతో పిలిచిన రెండు టెండర్లకు గతంలో 4.90 శాతం ఎక్సెస్‌తో దాఖలయ్యాయి. ఎక్సెస్‌పై అనుమతి కోసం అధికారులు ఇంజినీర్ ఇన్ చీఫ్‌కు సమర్పించగా... ఎక్సెస్ కావడం... అదీ సింగిల్ టెండర్ రావడంతో అధికారులు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు పనులకు మళ్లీ టెండర్లు పిలవగా బుధవారం తెరిచిన బిడ్లలో ఈ పనులకు 1.40 శాతం లెస్తో టెండర్ దాఖలైనట్లు తెలిసింది. టెండర్లు మళ్లీ పిలవడంతో నగర పంచాయతీ ఖజానాకు రూ.30 వేల దాకా ప్రయోజనం చేకూరినట్లయిందనే చర్చ జరుగుతోంది. 48 పనులకు సింగిల్ టెండర్లు వచ్చినా గత సమావేశంలో కౌన్సిల్ ఆమోదం తెలపగా, ఈ ఏడు టెండర్లను సైతం ఆమోదించేందుకు నగరపంచాయతీ కౌన్సిల్లో ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. పట్టణంలో 20 వార్డుల్లో ఏకకాలంలో సీసీ రోడ్లు, మురికికాలువ పనులు సాగేలా అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. సింగల్ టెండర్లు రావడం... అదికూడా స్థానికులే పనులు దక్కించుకోవడం... ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ టెండర్లలో పోటీ పడకపోవడం... ఆన్లైన్ విధానంలో మతలబు ఏంటో? ఎవరికీ అంతుచిక్కడం లేదు. -
ఇదో రకం దోపిడీ!
శ్రీకాకుళం:ఈ ఫొటో చూసేవారికి సహజంగా ఏమనిపిస్తుంది?.. ఇదేదో ఇసుక రీచ్.. విక్రయానికి ఇసుక తరలిస్తున్నారులే అనుకుంటారు!.. కానీ ఇక్కడ విశేషమేమిటంటే ఇసుక రీచ్‌లకు ప్రభుత్వం వేలంపాటలు నిర్వహించలేదు. అధికారికం గా ఇసుక తవ్వకాలకు ఎవరికీ అనుమతుల్లేవు. మరి ఇంత దర్జాగా ఇసుకను తవ్విపోస్తున్నారేమిటి? అని ఆశ్చర్యపోతున్నారా!.. అదే ఇప్పుడు మన వార్తాంశం. అనుమతుల్లేకపోయినా వందలాది ట్రాక్టర్లు, లారీల్లో ఇసుక తరలిపోతోంది. దీనికి సీజ్డ్ ఇసుక అనే ముసుగు తొడిగారు. అక్రమార్కులకు అధికారులు సైతం వత్తాసు పలుకుతుండటంతో ఇసుక దోపిడీకి అడ్డులేకుండా పోయింది. అసలు విషయం ఏమిటంటే.. ఇసుక రీచ్‌లకు వేలం పాటలు జరక్కపోవడంతో జిల్లాలోని అన్ని రీచ్‌ల నుంచి ఇసుక తరలించడం నేరం. ఇలా అక్రమంగా తరలిస్తున్న ఇసుకను అధికారులు అప్పుడప్పుడు దాడులు చేసి స్వాధీనం చేసుకుంటుంటారు. అలా బట్టేరు, పొన్నాం, కరజాడ, బైరి, పూసర్లపాడు రీచ్‌ల నుంచి అక్రమంగా తరలిస్తున్నప్పుడు స్వాధీనం చేసుకున్న 16,630.35 క్యూబిక్ మీటర్ల ఇసుకను అధికారులు ఇటీవలే టెండర్ ద్వారా వేలం వేశారు. ఇక్కడ కూడా నిబంధనలను తుంగలో తొక్కి సింగిల్ టెండర్ దాఖలైనా.. ఆ ఒక్క టెండరుదారునే ఖరారు చేశారు. ఇందులో మంత్రి బంధువు హస్తం ఉందని అప్పుడే ‘సాక్షి’లో వార్తా కథనం ప్రచురితమైంది. అలా దక్కించుకున్న సీజ్డ్ ఇసుకనే ఇప్పుడు తరలిస్తున్నామని చెబుతూ వంశధార తీరంలోని కరజాడ రీచ్‌లోని ఇసుకను యథేచ్ఛగా తరలించుకుపోతున్నారు. ఈ అక్రమాన్ని అడ్డుకోవాల్సిన మైన్స్ అధికారులు సైతం టెండరుదారుకే వంతపాడుతున్నారు. ఓ ప్రజాప్రతినిధి అండదండలతో.. అధికారులు, టెండర్‌దారు చెబుతున్నదే నిజమని అనుకున్నా.. సీజ్ చేసిన ఇసుకను తీసుకొచ్చి మళ్లీ నదీతీరంలోని ఇసుకరీచ్లోనే ఎందుకు కుమ్మరిస్తారన్నది ప్రశ్న. అంతే కాకుండా అధికారులు ఐదు ప్రాంతాల్లో సీజ్ చేసిన ఇసుకను వేలం వేశారు. ఇక్కడ జరుగుతున్నదేమో వంశధార తీరంలోని కరజాడ రీచ్ దోపిడీయే. వేలం వేసిన ఇసుక పరిమాణం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఇసుక గత మూడు రోజులుగా ఇక్కడి నుంచి తరలిపోతోంది. స్థానికుల కథనం ప్రకారం రోజుకు 250 నుంచి 300 లారీల ఇసుకను కరజాడ నుంచి తరలించుకుపోతున్నారు. లారీలను నేరుగా రీచ్‌లోకి తీసుకొస్తే ఇసుకలో కూరుకుపోతాయన్న ఉద్దేశంతో వాటిని రోడ్డు పాయింట్లోనే ఉంచుతున్నారు. రీచ్ నుంచి వందలాది ట్రాక్టర్లలో ఇసుకను తరలించి లారీల్లో లోడ్ చేసి శ్రీకాకుళం, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు తరలించి అమ్ముకుంటున్నారు. చిన్న లారీ లోడ్ ఇసుకను మార్కెట్లో రూ.4,500కు అమ్ముతున్నారు. అదే పెద్ద లారీ అయితే రూ.10వేల వరకు పలుకుతుంది. డిమాండ్ ఎక్కువ ఉన్న రోజు ల్లో ఈ రేటు రూ.12వేల వరకు ఉంటుంది. ఇలా రోజూ వందలాది పెద్ద లారీల్లో ఇసుక తరలిపోతున్నా.. అదంతా సీజ్ చేసిన ఇసుకేనని అధికారులు, టెండరుదారు నమ్మబలుకుతున్నారు. టెండర్‌ను దక్కించుకోవడంలో చక్రం తిప్పిన జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి బంధువు ఈ తతంగం నడిపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తనిఖీలు చేస్తాం ఇసుక అక్రమ రవాణా గురించి మైన్స్ అసిస్టెంట్ డెరైక్టర్ గొల్లను వివరణ కోరగా సీజ్ చేసిన ఇసుకను ఇటీవల వేలం వేశామని, దా న్ని తరలిస్తున్నారని అన్నారు. అక్రమరవాణా విషయం తన దృష్టికి రాలేదన్నారు. తనిఖీలు చేయిస్తామని అంటూ తమ నిఘా బృందం అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తోందని చెప్పారు.