ఇదో రకం దోపిడీ!
శ్రీకాకుళం:ఈ ఫొటో చూసేవారికి సహజంగా ఏమనిపిస్తుంది?.. ఇదేదో ఇసుక రీచ్.. విక్రయానికి ఇసుక తరలిస్తున్నారులే అనుకుంటారు!.. కానీ ఇక్కడ విశేషమేమిటంటే ఇసుక రీచ్‌లకు ప్రభుత్వం వేలంపాటలు నిర్వహించలేదు. అధికారికం గా ఇసుక తవ్వకాలకు ఎవరికీ అనుమతుల్లేవు. మరి ఇంత దర్జాగా ఇసుకను తవ్విపోస్తున్నారేమిటి? అని ఆశ్చర్యపోతున్నారా!.. అదే ఇప్పుడు మన వార్తాంశం. అనుమతుల్లేకపోయినా వందలాది ట్రాక్టర్లు, లారీల్లో ఇసుక తరలిపోతోంది. దీనికి సీజ్డ్ ఇసుక అనే ముసుగు తొడిగారు. అక్రమార్కులకు అధికారులు సైతం వత్తాసు పలుకుతుండటంతో ఇసుక దోపిడీకి అడ్డులేకుండా పోయింది.
అసలు విషయం ఏమిటంటే..
ఇసుక రీచ్‌లకు వేలం పాటలు జరక్కపోవడంతో జిల్లాలోని అన్ని రీచ్‌ల నుంచి ఇసుక తరలించడం నేరం. ఇలా అక్రమంగా తరలిస్తున్న ఇసుకను అధికారులు అప్పుడప్పుడు దాడులు చేసి స్వాధీనం చేసుకుంటుంటారు. అలా బట్టేరు, పొన్నాం, కరజాడ, బైరి, పూసర్లపాడు రీచ్‌ల నుంచి అక్రమంగా తరలిస్తున్నప్పుడు స్వాధీనం చేసుకున్న 16,630.35 క్యూబిక్ మీటర్ల ఇసుకను అధికారులు ఇటీవలే టెండర్ ద్వారా వేలం వేశారు. ఇక్కడ కూడా నిబంధనలను తుంగలో తొక్కి సింగిల్ టెండర్ దాఖలైనా.. ఆ ఒక్క టెండరుదారునే ఖరారు చేశారు. ఇందులో మంత్రి బంధువు హస్తం ఉందని అప్పుడే ‘సాక్షి’లో వార్తా కథనం ప్రచురితమైంది. అలా దక్కించుకున్న సీజ్డ్ ఇసుకనే ఇప్పుడు తరలిస్తున్నామని చెబుతూ వంశధార తీరంలోని కరజాడ రీచ్‌లోని ఇసుకను యథేచ్ఛగా తరలించుకుపోతున్నారు. ఈ అక్రమాన్ని అడ్డుకోవాల్సిన మైన్స్ అధికారులు సైతం టెండరుదారుకే వంతపాడుతున్నారు.
ఓ ప్రజాప్రతినిధి అండదండలతో..
అధికారులు, టెండర్‌దారు చెబుతున్నదే నిజమని అనుకున్నా.. సీజ్ చేసిన ఇసుకను తీసుకొచ్చి మళ్లీ నదీతీరంలోని ఇసుకరీచ్‌లోనే ఎందుకు కుమ్మరిస్తారన్నది ప్రశ్న. అంతే కాకుండా అధికారులు ఐదు ప్రాంతాల్లో సీజ్ చేసిన ఇసుకను వేలం వేశారు. ఇక్కడ జరుగుతున్నదేమో వంశధార తీరంలోని కరజాడ రీచ్ దోపిడీయే. వేలం వేసిన ఇసుక పరిమాణం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఇసుక గత మూడు రోజులుగా ఇక్కడి నుంచి తరలిపోతోంది. స్థానికుల కథనం ప్రకారం రోజుకు 250 నుంచి 300 లారీల ఇసుకను కరజాడ నుంచి తరలించుకుపోతున్నారు. లారీలను నేరుగా రీచ్‌లోకి తీసుకొస్తే ఇసుకలో కూరుకుపోతాయన్న ఉద్దేశంతో వాటిని రోడ్డు పాయింట్‌లోనే ఉంచుతున్నారు. రీచ్ నుంచి వందలాది ట్రాక్టర్లలో ఇసుకను తరలించి లారీల్లో లోడ్ చేసి శ్రీకాకుళం, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు తరలించి అమ్ముకుంటున్నారు. చిన్న లారీ లోడ్ ఇసుకను మార్కెట్‌లో రూ.4,500కు అమ్ముతున్నారు. అదే పెద్ద లారీ అయితే రూ.10వేల వరకు పలుకుతుంది. డిమాండ్ ఎక్కువ ఉన్న రోజు ల్లో ఈ రేటు రూ.12వేల వరకు ఉంటుంది. ఇలా రోజూ వందలాది పెద్ద లారీల్లో ఇసుక తరలిపోతున్నా.. అదంతా సీజ్ చేసిన ఇసుకేనని అధికారులు, టెండరుదారు నమ్మబలుకుతున్నారు. టెండర్‌ను దక్కించుకోవడంలో చక్రం తిప్పిన జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి బంధువు ఈ తతంగం నడిపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
తనిఖీలు చేస్తాం
ఇసుక అక్రమ రవాణా గురించి మైన్స్ అసిస్టెంట్ డెరైక్టర్ గొల్లను వివరణ కోరగా సీజ్ చేసిన ఇసుకను ఇటీవల వేలం వేశామని, దా న్ని తరలిస్తున్నారని అన్నారు. అక్రమరవాణా విషయం తన దృష్టికి రాలేదన్నారు. తనిఖీలు చేయిస్తామని అంటూ తమ నిఘా బృందం అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తోందని చెప్పారు.