బిల్లావాండ్లపల్లె వద్ద జరుగుతున్న సొరంగం పనులు
హంద్రీ–నీవా..ఇప్పట్లో రావా?
Published Thu, Sep 29 2016 10:49 PM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM
–హంద్రీ–నీవాకు అవాంతరాలు
–నత్తనడకన ‘సాగు’తున్న పనులు
– కొన్ని పనులకు రాని అనుమతులు
– మరికొన్ని రద్దు .. కోర్టుకెళ్ళిన రైతులు
– అనుమతులు ఇవ్వని విద్యుత్‌శాఖ
–ప్రాజెక్టు పూర్తికి మరికొన్నాళ్లు
కరువు తాండవిస్తున్న జిల్లాకు హంద్రీ–నీవానీరు ఇప్పట్లో చేరేలా లేదు. సర్కారు పెద్దలు మాత్రం ఎప్పటికప్పుడు ఇదిగో అదిగో అంటూ అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. వాస్తవ స్థితిగతులను పరిశీలిస్తే అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. అవాంతరాలను అధిగమించి నీరందిండం ఈ ఏడాది చివరికి కూడా సాధ్యం కాదని నిపుణులే లోపాయికారీగా అంగీకరిస్తున్నారు. పైగా ఈ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి.
జిల్లాలో హంద్రీ నీవా ద్వారా 2.17 లక్షల ఎకరాలకు సాగునీరు, 6 లక్షల మందికి తాగునీరందించాలని 2006లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో పనులు ప్రారంభమయ్యాయి. తొలుత కర్నూలు జిల్లా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి జీడిపల్లి రిజర్వాయర్ వరకు 212 కిలో మీటర్ల మేర పనులతో పాటు అనంతపురం జిల్లా గొల్లపల్లి రిజర్వాయర్ వరకు రెండో దశ పనులు పూర్తయ్యాయి. అక్కడ నుంచి చెర్లోపల్లె రిజర్వాయర్ వరకు ముదిగుబ్బ సమీపంలో చిత్రావతి నదిపై వంతెన కాలువను నిర్మించాల్సి ఉంది.
ఇవిగో అడ్డంకులు
–బిల్లావాండ్లపల్లె వద్ద 5.3 కి.మీ. మేర సొరంగం పనుల్లో 1.7 కిలోమీటర్ల మేర పనులు లూజ్‌సాయిల్ వలన ఆగిపోయాయి. రెండో ప్యాకేజిలో 1.47 కిలో మీటర్ల పనులను సింగిల్ టెండరు సాకుతో ప్రభుత్వం నిలుపుదల చేసింది. నాలుగో సొరంగం పనులకు ఇంతవరకు టెండర్లు పిలవలేదు. తాజాగా ఈ ప్రదేశంలో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని తీసుకెళ్ళాలనే ప్రతిపాదనకు సర్కారు నుంచి ఆమోదం లభించాల్సి ఉంది.
– వైఎస్సార్ జిల్లాలోని శ్రీనివాసపురం రిజర్వాయర్ ముంపు బాధితులైన అడవిలోవట్టంవాండ్లపల్లె గ్రామస్థులకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించలేదు. దీంతో వారు గ్రామాన్ని ఇప్పటి వరకు ఖాళీచేయలేదు.
–అడవిపల్లె రిజర్వాయర్ నుంచి నీవానది వరకు గల ప్యాకేజి నెం. 27, 28 లలో పూర్తిగా అటవీప్రాంతం. పనులకు అటవీశాఖ నుంచి ఇటీవలే అనుమతులు వచ్చాయి.
–బిల్లావాండ్ల పల్లె నుంచి చినమండ్యం మండలం కలిబండ వరకు గల 20వ ప్యాకేజి పనులు పూర్తయితే తప్ప నీవాకు నీరు రావడం కలగానే మిగలనుంది.
–పుంగనూరు బ్రాంచి కెనాల్‌లో 6 ఎత్తిపోతల పథకాలు, రెండు మంచినీటి రిజర్వాయర్లు ఉన్నాయి. మదనపల్లి మండలం కోళ్లబైలు వద్ద చేపట్టిన 2.3 కిలో మీటర్ల సొరంగ మార్గం పనులు ఓ స్థాయికి చేరినా, చిప్పిలి రిజర్వాయర్ పనులు ప్రారంభమే కాలేదు. మిగతా పనులన్నీ పూర్తయినా రిజర్వాయర్, సొరంగం పనుల పెండింగ్‌తో పుంగనూర్ కెనాల్ పనులు అగాయి.
–కుప్పం బ్రాంచి కెనాల్ పనులు రూ.486 కోట్లతో చేపట్టారు. ఇందులో 3 ఎత్తిపోతల పథకాలు, రెండు సొరంగ మార్గం పనులు తొలుత డిజైన్ చేశారు. సొరంగం పనులు నత్తనడకన జరుగుతున్నాయని దూరాన్ని తగ్గించారు.
–కుప్పం మండలం యామిగాని పల్లె వద్ద సొరంగం పనులు చేపట్టాల్సి ఉంది. గుడిపల్లి మండలంలో రైల్వే లైన్‌ను కాలువ క్రాస్ చేయాల్సి ఉంది. దీనికి రైల్వే శాఖ నుంచి ఇంతవరకూ అనుమతి రాలేదు.
బైరెడ్డిపల్లె, పెద్దబరినేపల్లె, రాజుపేట, శాంతిపురం ప్రాంతాల రైతులు ప్రత్యామ్నాయ భూమిని చూపెట్టాలంటూ హైకోర్టుకు వెళ్ళడంతో పనులు ఆగాయి.
లిఫ్ట్‌లకు అందని విద్యుత్
జిల్లాలోని 29 మండలాల్లో 1.75 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు ఇవ్వాల్సిన హంద్రీ నీవా పథకానికి 12 లిఫ్ట్‌లు 3 రిజర్వాయర్‌లకు 2012లోనే విద్యుత్ అనుమతుల కోసం రూ.430 కోట్లు చెల్లించినా ఇంతవరకు విద్యుత్ అనుమతి రాలేదు. దీంతో లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు విద్యుత్ గ్రహణం పట్టింది. హంద్రీ నీవా పనులను అత్యవసరంగాచేపట్టినా మరో రెండేళ్లు తప్పదని తెలుస్తోంది.
Advertisement
Advertisement