sitting mp
-
Lok Sabha Election 2024: చోటీ బహూకు ఇంటిపోరు
సుల్తాన్పూర్. గాంధీ కుటుంబపు కంచుకోట రాయ్‌బరేలీకి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోక్‌సభ స్థానం. అత్తగారైన ఇందిరను ఎదిరించి చిన్న వయస్సులోనే ఒంటరిగా రాజకీయాల్లోకి వచి్చన మేనకా గాంధీ ఇక్కడి సిట్టింగ్ ఎంపీ. ఎంపీగా ఏకంగా తొమ్మిదో విజయమే లక్ష్యంగా బీజేపీ తరఫునే మళ్లీ బరిలోకి దిగారు. అయితే సొంత పారీ్టయే ఆమెకు అంతగా సహకరించడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో మేనక కేవలం 14,500 ఓట్లతో గట్టెక్కారు. ఈసారి ఆమె గెలుపు ఈజీ కాదని విశ్లేషకులూ అంటున్న పరిస్థితి! ఇన్ని సవాళ్ల నడుమ సుల్తాన్ పూర్ పరీక్షలో 67 ఏళ్ల ఈ ‘చోటీ బహు’ ఎలా నెగ్గుకొస్తారనేది ఉత్కంఠ రేపుతోంది... భర్త సంజయ్‌గాంధీ మరణం తర్వాత ఇందిరతో విభేదాలు మేనకను ఒంటరిని చేశాయి. అప్పటికి చంటిపిల్లాడైన వరుణ్ గాం«దీని తీసుకొని కుటుంబం నుంచి బయటికొచ్చారు. నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఒంటరి పోరాటమే చేస్తూ వచ్చారు. తొలిసారి 1984లో అమేథీలో బావ రాజీవ్‌గాం«దీని ఢీకొని 2.7 లక్షల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. 1989లో జనతాదళ్ తరఫున ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ నుంచి గెలిచి తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. 1991లో మళ్లీ బీజేపీ చేతిలో ఓటమి చవిచూసినా ఆ తర్వాత మాత్రం వరుసగా ఏడుసార్లు విజయం సాధించారు. పిలిభిత్ను కంచుకోటగా మార్చుకున్నారు. అక్కడి నుంచి మూడుసార్లు ఇండిపెండెంట్‌గా కూడా విజయకేతం ఎగరేయడం విశేషం. మధ్యలో ఒకసారి ఆవ్లా లోక్‌సభ స్థానం నుంచీ నెగ్గారు. వీపీ సింగ్ ప్రభుత్వంలో, తర్వాత వాజ్‌పేయి సర్కారులో, మోదీ తొలి విడత ప్రభుత్వంలోనూ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఫిలిబిత్‌లో ఆరుసార్లు గెలిచాక 2019లో ఆ స్థానాన్ని కుమారుడు వరుణ్‌కు వదిలి తొలిసారి సుల్తాన్‌పూర్‌కు మారారు. వరుణ్‌కు బీజేపీ ఈసారి మొండిచేయి చూపడంతో మేనక కూడా నిరుత్సాహానికి గురయ్యారు. ఓబీసీలు, ముస్లింలే కీలకం... సుల్తాన్‌పూర్‌లో నిషాద్‌లతో పాటు కురీ్మలు, యాదవులు, ముస్లింలు, దళితులు ఎక్కువగా ఉన్నారు. బ్రాహ్మణులు, ఠాకూర్లు ఓ మోస్తరుగా ఉంటారు. కాంగ్రెస్ మద్దతుతో ఎస్పీ తరఫున బరిలోకి దిగిన రామ్ భువల్ నిషాద్కు ఆ సామాజిక వర్గంలో గట్టి పట్టుంది. బీఎస్పీ కుర్మీ సామాజికవర్గానికి చెందిన ఉద్రజ్ వర్మను రంగంలోకి దించడంతో ఓట్లు భారీగా చీలే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ బీఎస్పీ రెండుసార్లు గెలవగా ఎస్పీ బోణీయే చేయలేదు! స్థానిక సమస్యలే ప్రధానాంశాలుగా ప్రచారం సాగింది. ప్రచారానికి మోదీ, షా దూరం సుల్తాన్‌పూర్‌లో శనివారం ఆరో విడతలో పోలింగ్ జరగనుంది. కానీ యూపీ అంతా కలియదిరుగుతున్న ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ అగ్ర నేతలెవరూ అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం విశేషం! ప్రచారం చివర్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ మాత్రం ఓ ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో ఈ ఎన్నికలు ఆమెకు మళ్లీ ఒంటరి పోరాటంగానే కనిపిస్తున్నాయి. అయితే కుటుంబీకులైన రాహుల్, ప్రియాంక మొదలుకుని విపక్ష నాయకులెవరూ కూడా మేనకకు వ్యతిరేకంగా పెద్దగా ప్రచారం చేయకపోవడం విశేషం! అయోధ్య రామ మందిర నిర్మాణం, వరుణ్‌కు టికెట్ నిరాకరణ వంటివేవీ సుల్తాన్‌పూర్‌లో ఎన్నికల అంశాలు కావు. నియోజకవర్గ ప్రజల సమస్యలే ప్రధానాంశాలు. వాటిని తీర్చేందుకు ఐదేళ్లుగా చేసిన కృషే నన్ను మళ్లీ గెలిపిస్తుంది. గత ఎన్నికల కంటే ఎక్కువ మెజారిటీతో గెలిచి చూపిస్తా. – మేనకా గాంధీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
పార్టీ కాదు...టికెటే ముఖ్యం
సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలకు తిరుగుబాటుదారుల బెడద మొదలైంది. ఇది శివసేన, ఎన్సీపీల్లో బాగా కనిపిస్తోంది మిగతా పార్టీల్లోనూ అసంతృప్తి సెగ ఉన్నా దాని ప్రభావం అంతంతే. టికెట్ దక్కనివారు తమ రాజకీయ మనుగడ కోసం సైద్ధాంతికంగా విభేదించే పార్టీల్లోనూ చేరిపోతున్నారు. వీరిలో ఎక్కువగా సిట్టింగ్ ఎంపీలే ఉండటం విశేషం. ఇందులోనూ అత్యధికంగా శివసేన ఎంపీలున్నారు. శివసేన మాజీ ఎంపీ మోహన్ రావులే శుక్రవారం ఎన్సీపీలో చేరారు. ఇటీవలే బీజేపీలో చేరిన విజయ్‌కుమార్ గవిత్ కుమార్తె హీనా గవిత్‌కు టికెట్ కేటాయింపుకూడా జరిగిపోయింది. ఆ వెంటనే మంత్రి విజయ్‌కుమార్ గవిత్ ను ఎన్సీపీ సస్పెండ్ చేసింది. మరోవైపు ఎన్సీపీ ఠాణే గ్రామీణ శాఖ అధ్యక్షుడు కపిల్ పాటిల్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గత కొంతకాలంగా సుమా రు 20 మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు తిరుగుబాటుచేసిన వారిలో ఉన్నారు. వీరిలో ప్రధానంగా శివసేనకు చెందిన సుమారు ఎనిమిది మంది కాగా, ఎన్సీపీకి చెందిన నలుగురు, కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు, ఎమ్మెన్నెస్‌లో ఒక్కరున్నారు. ఆనంద్ పరాంజ్‌పేతో ఆరంభం కల్యాణ్ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీ ఆనంద్ పరాంజ్‌పేతో శివసేనలో తిరుగుబాటు ప్రారంభమైంది. ఒక్కొక్కరుగా పలువురు ఎంపీలు శివసేనను వీడి ఇతర పార్టీల్లో చేరారు. తాజాగా మోహన్ రావులే కూడా ఎన్సీపీలో చేరారు. ఇప్పటివరకు శివసేనను వీడిన వారిలో షిర్డీ ఎంపీ భావ్‌సాహెబ్ వాక్చౌరే, పర్భణి ఎంపీ గణేష దుధ్గావ్కర్, రాహుల్ నార్వేకర్, అభిజీత్ పానసే, సుభాష్ భామ్రే ఉన్నారు. వీరిలో అభిజీత్ పానసే ఎమ్మెన్నెస్‌లో చేరారు. భావ్‌సాహెబ్ వాక్చౌరే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మిగిలిన వారంతా ఎన్సీపీలో చేరారు. ఎన్సీపీలోనూ... ఇక ఎన్సీపీలో కూడా తిరుగుబాటుదారుల సంఖ్య బాగానేఉంది. ఇప్పటివరకు నలుగురు ఎన్సీపీ నాయకులతోపాటు పార్టీ మద్దతుదారుడు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఇలా పార్టీని వీడినవారిలో సంజయ్‌కాకా పాటిల్, మాజీ ఎమ్మెల్యే రమేష్ కదం, సంజయ్ మాండ్లిక్, భివండీ గ్రామీణ శాఖ ఉపాధ్యక్షుడు కపిల్ పాటిల్‌తోపాటు ఎన్సీపీ మద్దతుదారుడైన ఎమ్మెల్యే లక్ష్మణ్ జగతాప్లు ఉన్నారు. వీరిలో లక్ష్మణ్ జగతాప్ పీడబ్ల్యూపీలో, సంజయ్ మాండలిక్ శివసేనలో చేరారు. మిగిలినవారు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్సీపీలో పెరిగిన శివసైనికులు...! శివసేన తిరుగుబాటుదారులు ఎక్కువగా ఎన్సీపీలో చేరడంతో ఆ పార్టీలో శివసేన నాయకుల సంఖ్య పెరిగింది. పార్టీ ప్రారంభం నుంచి పరిశీలించినట్టయితే శివసేన నుంచి వచ్చిన వారిలో అనేకమంది శరద్ పవార్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు ఛగన్ భుజ్‌బల్, గణేష్ నాయక్‌లే ఇందుకు ఉదాహరణ. మనీష్ జైన్, రాజీవ్ రాజలే కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి ఎన్సీపీలో చేరారు.