పార్టీ కాదు...టికెటే ముఖ్యం | sitting MPs changed their parties | Sakshi
Sakshi News home page

పార్టీ కాదు...టికెటే ముఖ్యం

Published Sun, Mar 23 2014 10:37 PM | Last Updated on Fri, Oct 19 2018 8:23 PM

sitting MPs changed their parties

సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలకు తిరుగుబాటుదారుల బెడద మొదలైంది. ఇది శివసేన, ఎన్సీపీల్లో బాగా కనిపిస్తోంది మిగతా పార్టీల్లోనూ అసంతృప్తి సెగ ఉన్నా దాని ప్రభావం అంతంతే. టికెట్ దక్కనివారు తమ రాజకీయ మనుగడ కోసం సైద్ధాంతికంగా విభేదించే పార్టీల్లోనూ చేరిపోతున్నారు. వీరిలో ఎక్కువగా సిట్టింగ్ ఎంపీలే ఉండటం విశేషం.

 ఇందులోనూ అత్యధికంగా శివసేన ఎంపీలున్నారు. శివసేన మాజీ ఎంపీ మోహన్ రావులే శుక్రవారం ఎన్సీపీలో చేరారు. ఇటీవలే బీజేపీలో చేరిన విజయ్‌కుమార్ గవిత్ కుమార్తె హీనా గవిత్‌కు టికెట్ కేటాయింపుకూడా జరిగిపోయింది. ఆ వెంటనే మంత్రి విజయ్‌కుమార్ గవిత్ ను ఎన్సీపీ సస్పెండ్ చేసింది. మరోవైపు ఎన్సీపీ ఠాణే గ్రామీణ శాఖ అధ్యక్షుడు కపిల్ పాటిల్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.  గత కొంతకాలంగా సుమా రు 20 మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు తిరుగుబాటుచేసిన వారిలో ఉన్నారు. వీరిలో ప్రధానంగా శివసేనకు చెందిన సుమారు ఎనిమిది మంది కాగా, ఎన్సీపీకి చెందిన నలుగురు, కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు, ఎమ్మెన్నెస్‌లో ఒక్కరున్నారు.

 ఆనంద్ పరాంజ్‌పేతో ఆరంభం
 కల్యాణ్ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీ ఆనంద్ పరాంజ్‌పేతో శివసేనలో తిరుగుబాటు ప్రారంభమైంది. ఒక్కొక్కరుగా పలువురు ఎంపీలు శివసేనను వీడి ఇతర పార్టీల్లో చేరారు. తాజాగా మోహన్ రావులే కూడా ఎన్సీపీలో చేరారు.

 ఇప్పటివరకు శివసేనను వీడిన వారిలో  షిర్డీ ఎంపీ భావ్‌సాహెబ్ వాక్‌చౌరే, పర్భణి ఎంపీ గణేష దుధ్‌గావ్కర్, రాహుల్ నార్వేకర్, అభిజీత్ పానసే, సుభాష్ భామ్రే ఉన్నారు. వీరిలో అభిజీత్ పానసే ఎమ్మెన్నెస్‌లో చేరారు. భావ్‌సాహెబ్ వాక్‌చౌరే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మిగిలిన వారంతా ఎన్సీపీలో చేరారు.
 ఎన్సీపీలోనూ...
 ఇక ఎన్సీపీలో కూడా తిరుగుబాటుదారుల సంఖ్య బాగానేఉంది. ఇప్పటివరకు నలుగురు ఎన్సీపీ నాయకులతోపాటు పార్టీ మద్దతుదారుడు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఇలా పార్టీని వీడినవారిలో సంజయ్‌కాకా పాటిల్, మాజీ ఎమ్మెల్యే రమేష్ కదం, సంజయ్ మాండ్లిక్, భివండీ గ్రామీణ శాఖ ఉపాధ్యక్షుడు కపిల్ పాటిల్‌తోపాటు ఎన్సీపీ మద్దతుదారుడైన ఎమ్మెల్యే లక్ష్మణ్ జగతాప్‌లు ఉన్నారు. వీరిలో లక్ష్మణ్ జగతాప్ పీడబ్ల్యూపీలో, సంజయ్ మాండలిక్ శివసేనలో చేరారు. మిగిలినవారు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

 ఎన్సీపీలో పెరిగిన శివసైనికులు...!
 శివసేన తిరుగుబాటుదారులు ఎక్కువగా ఎన్సీపీలో చేరడంతో ఆ పార్టీలో శివసేన నాయకుల సంఖ్య పెరిగింది. పార్టీ ప్రారంభం నుంచి పరిశీలించినట్టయితే శివసేన నుంచి వచ్చిన వారిలో అనేకమంది శరద్ పవార్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు ఛగన్ భుజ్‌బల్, గణేష్ నాయక్‌లే ఇందుకు ఉదాహరణ. మనీష్ జైన్, రాజీవ్ రాజలే కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి ఎన్సీపీలో చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement