మిస్సింగ్ ఎంపీ..! మాకెన్పై మీనాక్షి వ్యంగ్యాస్త్రాలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత, న్యూఢిల్లీ సిట్టింగ్ ఎంపీ అజయ్ మాకెన్పై ఆయన ప్రత్యర్థి, బీజేపీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి తనదైన శైలిలో విమర్శలు కురిపించారు. మాకెన్ ‘మిస్సింగ్ ఎంపీ’అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత పదేళ్ల నుంచి నియోజకవర్గంలో ఆయన కనిపించడం లేదని, నియోజకవర్గం అభివృద్ధి కోసం ఖర్చు చేసిందేమీ లేదని ఆరోపించారు. పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా కొనసాగినా ఆయన నియోజకవర్గంలో ఇంకా అనేక సమస్యలు తాండవిస్తూనే ఉన్నాయన్నారు.
ఇక నరేంద్ర మోడీ ప్రధాని కావాలంటే న్యూఢిల్లీ నియోజకవర్గంలో బీజేపీ గెలవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రజలు తన ను తప్పుకుండా గెలిపిస్తారని ఓ వార్తాసంస్థకు ఇచ్చి న ఇంటర్వ్యూలో చెప్పారు. నరేంద్ర మోడీ చుట్టూ పార్టీ కేంద్రీకృతమైందని, ఆయన బీజేపీకి బ్రాండ్ అంబాసిడర్గా మారారంటూ ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలు ఆమె ఖండించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆమె దేశంలోనే ప్రముఖ న్యాయవాదిగా పేరొందిన అమన్ లేఖీని వివాహమాడారు.
పార్టీలో పెద్ద పెద్ద నాయకులుండగా మీకే పార్టీ ఎందుకు టికెట్ ఇచ్చింద ంటూ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ... ‘నిజమే... సుబ్రమణ్యన్ స్వామి, నిర్మలా సీతారామన్ వంటి సీనియర్లు పార్టీలో ఉన్నా అధిష్టానం నాకే టికెట్ ఇవ్వడంపై ప్రత్యర్థులు రకరకాల ప్రచారాలు చేశారు. అయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో అన్ని కోణాల్లో ఆలోచించిన పార్టీ ప్రత్యర్థి అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని, వారిని ఓడించాలంటే నేనే సరైన వ్యక్తినని నమ్మి టికెట్ ఇచ్చింద’న్నారు.