Siva Nageswara Rao
-
సమంతను ఫస్ట్ ఆడిషన్ చేసింది నేనే.. కానీ: టాలీవుడ్ డైరెక్టర్
సమంత ప్రస్తుతం ఇటీవలే 'శాకుంతలం' సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో దేవ్ మోహన్ హీరోగా నటించారు. అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ కూడా ప్రత్యేకపాత్రలో నటించింది. ప్రస్తుతం ఈ సినిమాపై కొందరు అభిమానులైతే ఏకంగా ట్రోల్స్ కూడా చేస్తున్నారు. అయితే తాజాగా సమంత కెరీర్‌పై డైరెక్టర్ శివ నాగేశ్వరరావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సమంతను టాలీవుడ్‌కు తానే పరిచయం చేయాల్సిందని అన్నారు. సమంతను ఫస్ట్ ఆడిషన్ చేసిందని తానేనని చెప్పుకొచ్చారు. (ఇది చదవండి: అలాంటి పాత్రలు చేయాలని ఉంది: పూజా హేగ్డే) శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. 'సమంత చెన్నైలోని సెయింట్ మేరీస్ కాలేజీలో చదువుతోంది. ఆడిషన్ కోసం హైదరాబాద్ రమ్మని పిలిచాం. ఆడిషన్ ముగిశాక సమంతను చెన్నై పంపిద్దామంటే విమాన టికెట్ ధరలు చాలా ఎక్కువ. ఆ నెక్ట్స్ డే తక్కువగానే ఉన్నాయి. దీంతో ఒక్కరోజు హైదరాబాద్‌లో ఉండమని సమంతను అడిగాం. కానీ ఆమె అంగీకరించలేదు. చేసేదేమీ లేక టికెట్ బుక్ చేసి అదే రోజు చెన్నై పంపించాం. హైదరాబాద్‌లో ఒక్కరోజు ఉండేందుకు కూడా ఒప్పుకోలేదు. అయితే సమంత ఆడిషన్ నచ్చి తీసుకుందామంటే అధిక రెమ్యూనరేషన్ డిమాండ్ చేసింది. మా వద్ద అంత బడ్జెట్ లేక వెనక్కి తగ్గాం.' అని వెల్లడించారు. కాగా.. రామ్ గోపాల్ వర్మ అసిస్టెంట్‌గా శివ నాగేశ్వరరావు పనిచేశారు. మనీ మనీ, సిసింద్రీ, హేండ్సప్, ధనలక్ష్మి ఐ లవ్ యూ, మిస్టర్ అండ్ మిసెస్ శైలజాకృష్ణమూర్తి లాంటి సినిమాలు అందించారు. హీరోయిన్ అంజలిని ఫొటో సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయం చేశారు. -
ఎవర్నీ తక్కువ చేసి చూపించలేదు
నందమూరి తారకరత్న హీరోగా నర్రా శివనాగేశ్వరరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దేవినేని’. ‘బెజవాడ సింహం’ అనేది ట్యాగ్ లైన్. వంగవీటి రాధా పాత్రలో నటుడు బెనర్జీ, వంగవీటి రంగా పాత్రలో సురేష్ కొండేటి, చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్నకుమార్, కేఎస్ వ్యాస్ పాత్రలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి నటించారు. ఇటీవల ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్‌ను విడుదల చేసిన ప్రముఖ నిర్మాత, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సి. కల్యాణ్ మాట్లాడుతూ–‘‘తెరవెనుక కష్టాలున్న ప్రాజెక్ట్స్‌లో క్వాలిటీగా చేసిన సినిమాల్నీ హిట్ అయ్యాయి. అలాంటి కోవలో వస్తున్న ‘దేవినేని’ కూడా విజయం సాధించాలి. ఎస్టాబ్లిష్డ్ క్యారెక్టర్స్‌తో సినిమా చేయడం చాలా కష్టం. ఈ సినిమాతో ప్రతి ఒక్కరికీ మంచి పేరు వచ్చి, నిర్మాతలకు డబ్బులు రావాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. శివనాగేశ్వర రావు మాట్లాడుతూ–‘‘నేను తీసిన ఈ ‘దేవినేని’ బయోపిక్ కాదు. దేవినేని, వంగవీటి గార్ల మీద అభిమానంతోనే ఈ సినిమా తీశా. ఈ రెండు కుటుంబాల్లో ఎవర్నీ తక్కువగా చూపించలేదు. ఇప్పటికే ఈ సినిమాపై చాలా కేసులు వేశారు. చిన్న నిర్మాతలైనా ఈ సినిమాను ఎంతో కష్టపడి నిర్మించారు. దయచేసి ఈ గొడవలను ఆపి, పాజిటివ్‌గా ఆలోచించి సినిమాను ఆదరించాలి’’ అన్నారు. ‘‘మంచి కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం రియలిస్టిక్‌గా ఉంటుంది’’ అన్నారు నిర్మాత రాము. ఈ కార్యక్రమంలో సురేష్ కొండేటి, నాగేంద్రబాబు పాల్గొన్నారు. చదవండి: శృతి ప్రియుడికి థాంక్స్ చెప్పిన కమల్! ఫొటోగ్రాఫర్‌కు బాలీవుడ్ హీరో హెచ్చరిక! -
వాస్తవ సంఘటన ఆధారంగా...
నల్లగొండలో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిన చిత్రం ‘మనసంతా నువ్వే’. పవన్, బిందు జంటగా శివనాగేశ్వరరావు దర్శకత్వంలో పసుపులేటి దేవీచౌదరి నిర్మించారు. ర్యాప్ రాక్ షకీల్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం ప్లాటినమ్ డిస్క్ వేడుకలో దర్శకుడు మాట్లాడుతూ- ‘‘నేను అసిస్టెంట్‌గా ఉన్నప్పుడు నల్గొండకు షూటింగ్ వెళ్లా. అక్కడ నాకు ఎదురైన ఓ సంఘటనను కథగా మలుచుకుని నిర్మాతలను కలిశా. ప్రేక్షకులకు నచ్చేలా తీర్చిదిద్దాం’’ అన్నారు. ‘‘ప్రముఖ నటి పసుపులేటి కన్నాంబగారి మనవణ్ణి నేను. మంచి సినిమా తీశాం. షకీల్ సంగీతం బాగుంది. త్వరలో చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అని సమర్పకుడు పసుపులేటి ప్రసన్నా చౌదరి అన్నారు. -
అందుకే ఎదురు దెబ్బలు తిన్నాను!
వెండి తెరపై శివనాగేశ్వరరావుది ఓ ప్రత్యేక సంతకం. ఆయన్ను ఒకే కోవలోని సినిమాల దర్శకుడని చెప్పడానికి లేదు. కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ, హారర్, లవ్... ఇలా అన్ని రకాల సినిమాలూ తీసిన ఘనత శివనాగేశ్వరరావుది. మనీ, మనీమనీ, వన్ బై టూ, సిసింద్రీ, లక్కీఛాన్స్, పట్టుకోండి చూద్దాం, ఫొటో... తదితర చిత్రాలతో ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శివనాగేశ్వరరావు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనతో ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ. ప్రస్తుతం ఏం చేస్తున్నారు? మూడు రకాల కథలు రెడీ చేశాను. కామెడీ, క్రైమ్ నేపథ్యంలో సాగే కథలవి. ఓ ఎన్నారై నిర్మాత ఆధ్వర్యంలో డిసెంబరులో సినిమా మొదలవుతుంది. మీది 35 ఏళ్ల సినీ ప్రయాణం కదా? అవును... ‘శివ’కు ముందే పదేళ్లు కో డెరైక్టర్‌గా ఉన్నాను. అంటే మీ ప్రయాణం కూడా మద్రాసు నుంచే మొదలైందన్నమాట? దాసరిగారి వద్ద పని చేయాలనే కోరికతో 35 ఏళ్ల క్రితం చెన్నైలో అడుగుపెట్టా. అదంతా ఓ కథ. కాస్త వివరంగా చెబుతారా? మాది గుంటూరు జిల్లా ఉప్పలపాడు. నాన్న మోతుబరి. వ్యవసాయం జీవనాధారం. అక్కడే బీకామ్ చేశాను. నాటకాలు కూడా వేసేవాణ్ణి. అప్పట్లో దాసరిగారి ‘స్వర్గం-నరకం’, ‘ఇదెక్కడి న్యాయం’ సినిమాలు నన్నెంతో ప్రభావితం చేశాయి. దాంతో మద్రాస్ వెళ్లి దాసరిగారిని కలిశాను. అప్పటికే పదుల సంఖ్యలో సహాయకులు ఆయన ముందు లైన్లో ఉన్నారు. దాంతో చేసేది లేక... దాసరిగారితోనే సినిమా తీయబోతున్న ఓ సినిమా ఆఫీస్‌లో అకౌంటెంట్‌గా చేరాను. కృష్ణ, రజనీశర్మ జంటగా తమిళ దర్శకుడు అమృతం తీస్తున్న ‘అమ్మాయికి మొగుడు-మామకు యమడు’ సినిమాకు సహాయకునిగా చేరాను. అలా నా సినీ ప్రయాణం మొదలైంది. అమృతంగారికి నాతో కలిపి ముగ్గురమే సహాయకులం. పని బాగా నేర్చుకోగలిగాను. ఆ తర్వాత విజయనిర్మలగారి భోగిమంటలు, అంతం కాదిది ఆరంభం, విక్టరీ మధుసూదనరావుగారి జగన్నాథ రథచక్రాలు, క్రాంతి కుమార్‌గారి స్వాతి, స్రవంతి, అగ్నిగుండం, తరణీరావుగారి ‘రావుగారిల్లు’.. ఇలా పదేళ్ల పాటు చాలా సినిమాలకు కో-డెరైక్టర్‌గా పని చేశా. ‘రావుగారిల్లు’కు నేను కో-డెరైక్టర్ని అయితే.. నా సహాయకుడికి సహాయకుడు రామ్‌గోపాల్‌వర్మ. అంత కొత్తవాడైన వర్మతో కలిసి పని చేయాల్సి వచ్చినప్పుడు ఎలా ఫీలయ్యారు? రాము అప్పట్లోనే ఏదో పరధ్యానంగా ఉండేవాడు. అందుకే... అతనికి సినిమాకు సంబంధించిన పనులు చెప్పేవాణ్ణి కాదు. కానీ.. అతనిలో ఏదో తెలీని మ్యాజిక్ ఉందనిపిస్తుండేది. ఓ సారి డెరైక్ట్‌గా అడిగేశాడు. ‘నాకు డెరైక్షన్ ఛాన్సొస్తే.. కో-డెరైక్టర్‌గా పనిచేస్తారా’ అని. అతని విద్వత్తు నాకు తెలుసు. పైగా ఎక్కువ మొత్తంలో డబ్బులిప్పిస్తానన్నాడు. అందుకే ‘ఓకే’ అన్నాను. ‘శివ’ సినిమాలో మీరు తీసిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? రాము అభిరుచికి తగ్గట్టుగా నడుచుకున్నానంతే. సాధ్యంకాని షాట్లను మాత్రం ‘ఇవి సాధ్యం కాదు’ అని నిర్మొహమాటంగా చెప్పేవాణ్ణి. మా ఇద్దరి మధ్య డిస్కషన్ కూడా జరిగేది. ‘క్షణక్షణం’ సినిమా ఓపెనింగ్ షాట్ విషయంలో ఇలాగే జరిగింది. తర్వాత నేను చెప్పిందే ‘ఓకే’ అయ్యింది. ఒకానొక దశలో తన దగ్గరే పర్మినెంట్‌గా పనిచేయమని పారితోషికం భారీగా ఆఫర్ చేశాడు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్.. ఇలా ఏ స్థానంలో కొనసాగినా అభ్యంతరం లేదన్నాడు. కానీ... నేను మాత్రం ససేమిరా అన్నాను. ‘దర్శకుడవ్వడం నా లక్ష్యం. ఏదైనా మెగా ఫోన్ పట్టుకున్న తర్వాతే చేస్తాను’ అని కరాఖండిగా చెప్పడంతో.. అన్నపూర్ణవారిని ఒప్పించి నన్ను దర్శకుణ్ణి చేయాలనుకున్నాడు. కానీ... నిర్ణయాన్ని మార్చుకొని తానే నిర్మాతగా ‘మనీ’ చిత్రంతో నన్ను దర్శకునిగా పరిచయం చేశాడు. ఆ తర్వాత లక్కీఛాన్స్, పట్టుకోండి చూద్దాం, సిసింద్రీ, మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి తదితర చిత్రాలు నాకు మంచి పేరు తెచ్చాయి. దర్శకునిగా మీరేంటో నిరూపించుకున్న తర్వాత కూడా అనుకున్న స్థాయికి రాలేకపోయారేంటి? కీలెరిగి వాత పెట్టాలి. నేల ఎరిగి వ్యాపారం చేయాలి. నేను భిన్నంగా వెళ్లాను. అందుకే ఎదురు దెబ్బలు. ప్రేమకథలు నాకు కలిసి రాలేదు. దానికి ‘ధనలక్ష్మీ ఐ లవ్ యూ’ ఉదాహరణ. ఇష్టంతో ‘ఫొటో’ సినిమా తీశాను. నా నుంచి ప్రేక్షకులు కామెడీనే ఆశించడంతో అదీ నిరాశే మిగిల్చింది. -
‘చుండూరు’ తీర్పును వ్యతిరేకించాల్సిందే..
సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకోలేదు హైకోర్టు తీర్పుపై ‘సుప్రీం’కు వెళ్తాం ప్రత్యేక కోర్టు ఏపీపీ శివనాగేశ్వర్రావు విద్యారణ్యపురి : చుండూరు కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు సరిగ్గా లేదని ఆ కేసులో ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ) శివనాగేశ్వర్రావు అభిప్రాయపడ్డారు. మాన వ హక్కుల వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ సెమినార్ హాల్లో ‘అందరూ నిర్దో షులైతే చుండూరు దళితులను చంపిందెవరు’ అంశం పై ఆదివారం సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సదస్సు లో శివనాగేశ్వర్రావు ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ చుండూరు కేసుకు సంబంధించి ప్రత్యేక కోర్టు 2007 లో 21మందికి జీవిత ఖైదు, 35మందికి ఏడాది కారాగారశిక్ష విధించగా, ఈ కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ ఏడాది ఏప్రిల్ 22న కొట్టివేసిందని తెలిపారు. ఈ కేసులో అందరూ నిర్దోషులే అయితే చుండూరు దళితులను చంపింది ఎవరని ఆయన ప్రశ్నించారు. చుండూరు కేసుకు సంబంధించి హై కోర్టు తీర్పు సరిగ్గా లేనందున, అందరూ వ్యతిరేకించాల్సిందేనని పేర్కొన్నారు. పోస్టుమార్టం రిపోర్టులు, ప్రత్యక్ష సాక్ష్యుల కథనాన్ని పరిగణనలోకి తీసుకోకుం డా ఈ తీర్పు ఇచ్చారని చెబుతూ, పలు అంశాలను విశ్లేషణాత్మకంగా వివరించారు. ఈ మేరకు ఈ తీర్పు పై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నామని ఆయన ఈ సందర్బంగా వెల్లడించారు. ఉద్యమాల నిర్వీర్యంతోనే... చుండూరు, కారంచేడు, లక్ష్మింపేట వంటి ప్రాంతాల్లో దళితులపై జరిగిన దాడులన్నీ ఊచకోతలేనని మాన వ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి వీఎస్.కృష్ణ అన్నారు. ఉద్యమాలు నిర్వీర్యమయ్యాయి కనుకే చుం డూరు కేసులో దోషులను నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పు వచ్చిందని ఆయన తెలిపారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలు, హక్కులు అమలు కావాలంటే ఐక్య ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. చుండూరు కేసుకు సంబంధించి హైకోర్టు తీర్పుపై మానవ హక్కుల వేదిక తరఫున సుప్రీంకోర్టులో అప్పీల్ చేయనున్న ట్లు ఆయన తెలిపారు. ఈ సదస్సులో తెలంగాణ ప్రజాఫ్రంట్ జిల్లా కన్వీనర్ రమాదేవి, మానవ హక్కుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి బాదావత్ రాజు తదితరులు పాల్గొన్నారు.