అందుకే ఎదురు దెబ్బలు తిన్నాను! | director Siva Nageswara Rao exclusive interview | Sakshi
Sakshi News home page

అందుకే ఎదురు దెబ్బలు తిన్నాను!

Published Mon, Oct 6 2014 11:23 PM | Last Updated on Sat, Sep 2 2017 2:26 PM

అందుకే ఎదురు దెబ్బలు తిన్నాను!

 వెండి తెరపై శివనాగేశ్వరరావుది ఓ ప్రత్యేక సంతకం. ఆయన్ను ఒకే కోవలోని సినిమాల దర్శకుడని చెప్పడానికి లేదు. కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ, హారర్, లవ్... ఇలా అన్ని రకాల సినిమాలూ తీసిన ఘనత శివనాగేశ్వరరావుది. మనీ, మనీమనీ, వన్ బై టూ, సిసింద్రీ, లక్కీఛాన్స్, పట్టుకోండి చూద్దాం, ఫొటో... తదితర చిత్రాలతో ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శివనాగేశ్వరరావు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనతో ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక ఇంటర్‌వ్యూ.
 
 ప్రస్తుతం ఏం చేస్తున్నారు?
 మూడు రకాల కథలు రెడీ చేశాను. కామెడీ, క్రైమ్ నేపథ్యంలో సాగే కథలవి. ఓ ఎన్నారై నిర్మాత ఆధ్వర్యంలో డిసెంబరులో సినిమా మొదలవుతుంది.
 
 మీది 35 ఏళ్ల సినీ ప్రయాణం కదా?
 అవును... ‘శివ’కు ముందే పదేళ్లు కో డెరైక్టర్‌గా ఉన్నాను.
 
 అంటే మీ ప్రయాణం కూడా మద్రాసు నుంచే మొదలైందన్నమాట?
 దాసరిగారి వద్ద పని చేయాలనే కోరికతో 35 ఏళ్ల క్రితం చెన్నైలో అడుగుపెట్టా. అదంతా ఓ కథ.
 
 కాస్త వివరంగా చెబుతారా?
 మాది గుంటూరు జిల్లా ఉప్పలపాడు. నాన్న మోతుబరి. వ్యవసాయం జీవనాధారం. అక్కడే బీకామ్ చేశాను. నాటకాలు కూడా వేసేవాణ్ణి. అప్పట్లో దాసరిగారి ‘స్వర్గం-నరకం’, ‘ఇదెక్కడి న్యాయం’ సినిమాలు నన్నెంతో ప్రభావితం చేశాయి. దాంతో మద్రాస్ వెళ్లి దాసరిగారిని కలిశాను. అప్పటికే పదుల సంఖ్యలో సహాయకులు ఆయన ముందు లైన్లో ఉన్నారు. దాంతో చేసేది లేక... దాసరిగారితోనే సినిమా తీయబోతున్న ఓ సినిమా ఆఫీస్‌లో అకౌంటెంట్‌గా చేరాను. కృష్ణ, రజనీశర్మ జంటగా తమిళ దర్శకుడు అమృతం తీస్తున్న ‘అమ్మాయికి మొగుడు-మామకు యమడు’ సినిమాకు సహాయకునిగా చేరాను. అలా నా సినీ ప్రయాణం మొదలైంది. అమృతంగారికి నాతో కలిపి ముగ్గురమే సహాయకులం. పని బాగా నేర్చుకోగలిగాను. ఆ తర్వాత విజయనిర్మలగారి భోగిమంటలు, అంతం కాదిది ఆరంభం, విక్టరీ మధుసూదనరావుగారి జగన్నాథ రథచక్రాలు, క్రాంతి కుమార్‌గారి స్వాతి, స్రవంతి, అగ్నిగుండం, తరణీరావుగారి ‘రావుగారిల్లు’.. ఇలా పదేళ్ల పాటు చాలా సినిమాలకు కో-డెరైక్టర్‌గా పని చేశా. ‘రావుగారిల్లు’కు నేను కో-డెరైక్టర్‌ని అయితే.. నా సహాయకుడికి సహాయకుడు రామ్‌గోపాల్‌వర్మ.
 
 అంత కొత్తవాడైన వర్మతో కలిసి పని చేయాల్సి వచ్చినప్పుడు ఎలా ఫీలయ్యారు?
 రాము అప్పట్లోనే ఏదో పరధ్యానంగా ఉండేవాడు. అందుకే... అతనికి సినిమాకు సంబంధించిన పనులు చెప్పేవాణ్ణి కాదు. కానీ.. అతనిలో ఏదో తెలీని మ్యాజిక్ ఉందనిపిస్తుండేది. ఓ సారి డెరైక్ట్‌గా అడిగేశాడు. ‘నాకు డెరైక్షన్ ఛాన్సొస్తే.. కో-డెరైక్టర్‌గా పనిచేస్తారా’ అని. అతని విద్వత్తు నాకు తెలుసు. పైగా ఎక్కువ మొత్తంలో డబ్బులిప్పిస్తానన్నాడు. అందుకే ‘ఓకే’ అన్నాను.
 
 ‘శివ’ సినిమాలో మీరు తీసిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా?
 రాము అభిరుచికి తగ్గట్టుగా నడుచుకున్నానంతే. సాధ్యంకాని షాట్‌లను మాత్రం ‘ఇవి సాధ్యం కాదు’ అని నిర్మొహమాటంగా చెప్పేవాణ్ణి. మా ఇద్దరి మధ్య డిస్కషన్ కూడా జరిగేది. ‘క్షణక్షణం’ సినిమా ఓపెనింగ్ షాట్ విషయంలో ఇలాగే జరిగింది. తర్వాత నేను చెప్పిందే ‘ఓకే’ అయ్యింది. ఒకానొక దశలో తన దగ్గరే పర్మినెంట్‌గా పనిచేయమని పారితోషికం భారీగా ఆఫర్ చేశాడు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్.. ఇలా ఏ స్థానంలో కొనసాగినా అభ్యంతరం లేదన్నాడు. కానీ... నేను మాత్రం ససేమిరా అన్నాను. ‘దర్శకుడవ్వడం నా లక్ష్యం. ఏదైనా మెగా ఫోన్ పట్టుకున్న తర్వాతే చేస్తాను’ అని కరాఖండిగా చెప్పడంతో.. అన్నపూర్ణవారిని ఒప్పించి నన్ను దర్శకుణ్ణి చేయాలనుకున్నాడు. కానీ... నిర్ణయాన్ని మార్చుకొని తానే నిర్మాతగా ‘మనీ’ చిత్రంతో నన్ను దర్శకునిగా పరిచయం చేశాడు. ఆ తర్వాత లక్కీఛాన్స్, పట్టుకోండి చూద్దాం, సిసింద్రీ, మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి తదితర చిత్రాలు నాకు మంచి పేరు తెచ్చాయి.
 
 దర్శకునిగా మీరేంటో నిరూపించుకున్న తర్వాత కూడా అనుకున్న స్థాయికి రాలేకపోయారేంటి?
 కీలెరిగి వాత పెట్టాలి. నేల ఎరిగి వ్యాపారం చేయాలి. నేను భిన్నంగా వెళ్లాను. అందుకే ఎదురు దెబ్బలు. ప్రేమకథలు నాకు కలిసి రాలేదు. దానికి ‘ధనలక్ష్మీ ఐ లవ్ యూ’ ఉదాహరణ. ఇష్టంతో ‘ఫొటో’ సినిమా తీశాను. నా నుంచి ప్రేక్షకులు కామెడీనే ఆశించడంతో అదీ నిరాశే మిగిల్చింది.

Related News By Category

Related News By Tags

Advertisement