నా జనరేషన్‌లో ఇంతటి అదృష్టం నాదే : రోజారమణి | roja ramani Exclusive Interview | Sakshi
Sakshi News home page

నా జనరేషన్‌లో ఇంతటి అదృష్టం నాదే : రోజారమణి

Published Tue, Sep 16 2014 12:39 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 PM

నా జనరేషన్‌లో ఇంతటి అదృష్టం నాదే : రోజారమణి

నా జనరేషన్‌లో ఇంతటి అదృష్టం నాదే : రోజారమణి

 పోతన పద్యాలను వల్లెవేయడం... ఏనుగుల గుంపుతో కలిసి షికారు చేయడం... మిన్నాగులను పూలదండల్లాగా అలంకరించుకోవడం... ఇలాంటి సాహసాలు ఓ అయిదేళ్ల చిన్నారి చేస్తే... దాన్ని ‘సాహసం’ అనక ఏమంటారు?. పైగా అది ఈ రోజుల్లో కాదు, 47 ఏళ్ల క్రితం. అందుకే... ‘సాహస బాలిక’ అంటే ఇప్పటికీ రోజారమణే గుర్తొస్తారు. భక్తప్రహ్లాదునిగా ఆమె అభినయాన్ని ఎప్పటికీ మరిచిపోలేం. బాలనటిగా, కథానాయికగా, కేరక్టర్ నటిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న రోజారమణి పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆమెతో ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక ఇంటర్‌వ్యూ.
 
 అయిదేళ్ల వయసు నుంచీ ఆర్క్‌లైట్ల కాంతులు, నాగరా శబ్దాలు మీ జీవితంలో భాగం అయిపోయాయి. ఇప్పుడేమో సమయమంతా కుటుంబానికే సరిపోతోంది. బాధ అనిపించట్లేదా?
 ఇది నా అంతట నేను ఇష్టంతో తీసుకున్న నిర్ణయం. నటన, డబ్బింగ్ అంటూ క్షణం తీరిక లేకుండా గడిపాను. కళాకారిణిగా మూడు దశాబ్దాల ప్రయాణం నాది. 150 సినిమాల్లో నటించాను. ఎప్పుడైతే పెళ్లయ్యి పిల్లలు పుట్టారో.. అప్పట్నుంచే నా అంతట నేనే వృత్తికి దూరమవుతూ వచ్చాను. నాకు మొదట్నుంచీ కుటుంబంపై ఆపేక్ష ఎక్కువ. ఏదైనా దగ్గరుండి చూసుకోవడం అలవాటు. అందుకే దొరికిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. నా ఇంటిని చక్కదిద్దుకోగలిగాను. పిల్లల్ని చదివించి ప్రయోజకుల్ని చేశాను.
 
 ఓసారి మీ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్దాం. సమాసభూయిష్టమైన పోతన పద్యాలకు అంత చిన్న వయసులో చక్కగా లిప్ మూమెంట్ ఇచ్చారు. ఎలా సాధ్యమైంది?
 అందరూ ఇదే అడుగుతుంటారు(నవ్వుతూ). దానికి నేను చెప్పే సమాధానమొక్కటే. ఆ శ్రీహరే పలికించాడు. ఆ సినిమా టైమ్‌లో ఏదో తెలియని శక్తి నాలో ఆవహించిందనిపిస్తుంది. ఇప్పుడున్నంత సాంకేతిక విలువలు అప్పుడు లేవు. రంగూన్ రామారావుగారని ఓ పెద్దాయన దగ్గరుండి పోతన పద్యాలన్నీ నాకు నేర్పారు. ఒక ఏనుగుపై ఊరేగడం పెద్ద విశేషమేం కాదు. కానీ... ఏనుగుల గుంపుతో కలిసి జర్నీ చేయడం అంటే నిజంగా రిస్క్. ఒక్క ఏనుగు డిస్ట్రబ్ అయినా దారుణాలు జరిగిపోతాయి. కానీ... ధైర్యంగా ఏనుగులతో జర్నీ చేశాను. పాముల్ని మెడలో వేసుకున్నాను. ఇదంతా నారాయణుని చలవే. ఇప్పుడు సినిమా చూసినా... ‘అవన్నీ చేసింది నేనేనా’ అనిపిస్తుంది. పూర్వజన్మ సుకృతం వల్ల లభించిన అద్భుత అవకాశం అది.
 
 హీరోయిన్‌గా ఎక్కువ సినిమాలు చేయలేదెందుకు?
 నేను కథానాయిక అయిన టైమ్‌లో హీరోలంటే ఎన్టీఆర్, ఏఎన్నార్, హరనాథ్, కృష్ణ, శోభన్‌బాబు. బుక్స్ పట్టుకొని కాలేజీలకు కూడా వీళ్లే వెళ్లేవారు. అలాంటి వారి పక్కన నేనేం సరిపోతాను చెప్పండి? టీనేజ్ లవ్‌స్టోరీలు అప్పటికి రాలేదు. దాంతో సెలక్టివ్‌గా సినిమాలు చేసేదాన్ని. ఓ సీత కథ, భారతంలో అమ్మాయి, ఎవరికివారే యమునాతీరే, కన్నె వయసు, పునాదిరాళ్లు... ఇలా ఉన్నంతలో చెప్పుకోదగ్గ సినిమాలే చేశాను. సరిగ్గా హీరోయిన్‌గా బిజీ అవుతున్నాననగా పెళ్లయిపోయింది. ఇక సినిమాలు పక్కన పెట్టేశాను.
 
 ‘డ్రైవర్‌రాముడు’ లో ఎన్టీఆర్‌కి చెల్లెలుగా చేశారు కదా! ఆ అనుభవాలు?
 అంతకు ముందే ‘తాతమ్మకల’ సినిమాలో ఆయన కూతురిగా నటించాను. పైగా ఆయనే దర్శకుడు. నా అదృష్టం ఏంటంటే... ఎన్టీఆర్, భానుమతి, కె.బాలచందర్, కె.విశ్వనాథ్, దాసరి నారాయణరావు లాంటి లెజెండ్స్‌తో కలిసి పనిచేశాను. నా జనరేషన్‌లో ఇంతటి అదృష్టం నాదే. ‘సత్తెకాలపు సత్తెయ్య’ సినిమాలో నేను బాలనటిని. చలంగారి కాంబినేషన్ పాత్ర. తర్వాత ఆయనకే జోడీగా ‘లంబాడోళ్ల రాందాసు’లో నటించాను. ఇదంతా దైవకృప.
 
 నటుడు చక్రపాణిగారితో మీది ప్రేమ వివాహమా?
 ప్రేమ వివాహం అనలేం, పెద్దలు కుదిర్చిన పెళ్లీ అనలేం. ఆయన నాకు మద్రాస్ ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో చదువుతున్నప్పటినుంచీ తెలుసు. చక్రపాణిగారు తెలుగువారైనా కాలక్రమంలో ఒరియాలో పెద్ద స్టార్ అయ్యారు. తెలుగు హిట్స్... ఆడపడుచు, లవకుశ, సతీ అనసూయ ఒరియా రీమేకుల్లో హీరోహీరోయిన్లుగా నేను, ఆయనా నటించాం. మేం కలిసి నటించిన ‘కవి సామ్రాట్ ఉపేంద్ర బంజు’ సినిమా అక్కడ పెద్ద హిట్. ఆ ప్రయాణంలో మేం మంచి ఫ్రెండ్స్ అవ్వడం, తర్వాత అది ప్రేమగా మారడం, పెద్దలు ‘పెళ్లి’తో మమ్మల్ని దీవించడం జరిగిపోయింది.
 
 సరితా, మీరు పోటాపోటీగా డబ్బింగ్ చెప్పేవారు కదా!
 నేను ఎవర్నీ పోటీగా తీసుకోను. ఇక్కడ ఎవరి పనులు వారికుంటాయి. దాదాపు 400 సినిమాలకు డబ్బింగ్ చెప్పాను. 300 మంది హీరోయిన్లకు గాత్రదానం చేశాను. వీరిలో సుహాసిని, మీనా, రమ్యకృష్ణ, రోజా... లాంటి స్టార్ హీరోయిన్లు చాలామందే ఉన్నారు. ఇప్పుడేమో చిన్న చిన్న పిల్లలు కథానాయికలుగా వచ్చేస్తున్నారు. వారికి డబ్బింగ్ చెప్పాలంటే ఆర్టిఫీషియల్‌గా మాట్లాడాలి. అది నా వల్ల కాదు. అందుకే... ప్రాముఖ్యత ఉన్న పాత్రలకు మాత్రమే డబ్బింగ్ చెబుతున్నాను.
 
 మీ అబ్బాయి తరుణ్ సినిమాలకు కథలేమైనా వింటున్నారా?
 కొత్తలో వినేదాన్ని. ఇప్పుడు వాడి కథలు వాడే వింటున్నాడు. ప్రస్తుతం మూడు సినిమాలకు సంబంధించిన సిట్టింగ్స్ జరుగుతున్నాయి. విజయదశమికి ఆయా సినిమాల ప్రకటన ఉంటుంది.
 
 ఇంతకీ తరుణ్ పెళ్లెప్పుడు?
 మీకు తెలియకుండా జరగదు కదా. అది కూడా త్వరలోనే
 (నవ్వుతూ).
 - బుర్రా నరసింహ
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement