నాతో సినిమా చేయడానికి ఎందుకు వెనకాడతారు! | sv krishna reddy Exclusive Interview | Sakshi
Sakshi News home page

నాతో సినిమా చేయడానికి ఎందుకు వెనకాడతారు!

Published Sun, May 31 2015 11:20 PM | Last Updated on Sun, Sep 3 2017 3:01 AM

నాతో సినిమా చేయడానికి ఎందుకు వెనకాడతారు!

నాతో సినిమా చేయడానికి ఎందుకు వెనకాడతారు!

 పరిచయ వాక్యాలు అవసరం లేని వ్యక్తులు కొంతమంది ఉంటారు. అలాంటివాళ్లల్లో ఎస్వీ కృష్ణారెడ్డి ఒకరు. దర్శకునిగా, నటునిగా, సంగీతదర్శకునిగా, రచయితగా.. ఆయన సాధించిన విజయాలు తెలియనవి కావు. నేడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు. త్వరలో ఓ చిత్రం ఆరంభించడానికి సన్నాహాలు చేస్తున్నారాయన. ఇక, ఎస్వీకేతో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూలోని విశేషాలు తెలుసుకుందాం...
 


 అప్పట్లో మీరు వంద రోజులు, ‘యమలీల’కైతే 350 రోజుల పండగ చేశారు. ఇప్పుడు 50 రోజులు కూడా గగనమే. సినిమా విడుదలైందా? వారం రోజుల్లో వసూళ్లు వచ్చేశాయా అనే ఈ ట్రెండ్‌లో ఇమడగలుగుతారా?
 హండ్రెడ్ పర్సంట్. సమయాన్నిబట్టి మారాలి. ఒకప్పుడు బస్సులో వెళ్లేవాళ్లం. ఆ తర్వాత ట్రైన్, ఫ్లయిట్‌లో ప్రయాణం చేసేదాకా ఎదిగాం. ల్యాండ్ ఫోన్ నుంచి మొబైల్ ఫోన్ దాకా వచ్చాం. ఆ మార్పుని అంగీకరించినప్పుడు, సినిమాల పరంగా వచ్చిన మార్పునూ అంగీకరించాలి. ‘ఐ లవ్ దిస్ చేంజ్’. ఇంకా కొత్త కొత్త మార్పుల కోసం ఎదురు చూస్తున్నా.
 
 ఒకప్పుడు మీ సినిమాలు ట్రెండ్ సెట్ చేశాయి. ఇప్పటి ట్రెండ్ ఎలా అనిపిస్తోంది?
 ట్రెండ్ అనేది ఉండదు. సక్సెస్‌ని కొలమానంగా తీసుకుంటాం కాబట్టి, ఏదైనా సినిమా విజయం సాధిస్తే అదే ట్రెండ్ అనుకుంటాం. అలా అనుకుని అదే పంథాలో వెళితే, మనం క్యూలో ఉన్నట్లే లెక్క. ‘క్యూలో నిలబడొద్దు.. కొత్త క్యూ తయారు చెయ్’ అనేది నా పాలసీ. నా చిత్రాల్లో ‘ఘటోత్కచుడు’ని తీసుకుందాం. 20 ఏళ్ల క్రితం ఆ చిత్రంలో రోబో అనే పాత్ర పెట్టి, ప్రేమకథ తీశా. ఆ రోబో కథే ఇరవయ్యేళ్ల తర్వాత ‘రోబో’గా శంకర్ తీశారు. అప్పట్లో ఇంత కాదు కదా.. టెక్నాలజీ జీరో. అప్పట్లోనే రోబో కారెక్టర్‌తో సినిమా తీసి, చాలా అడ్వాన్స్ అయ్యా. ఇరవయ్యేళ్ల క్రితమే ఇరవయ్యేళ్లు ముందు ఉంటే, ఇవాళ ఎన్ని సంవత్సరాలు ముందు ఉండి ఉంటానో ఊహించుకోండి.
 
 మీ మనసు వయసు చాలా తక్కువ అనిపిస్తోంది. కానీ, సినిమా మేకింగ్ పరంగా మీకేమైనా వయసైపోయిందనే ఫీలింగ్ ఉందా?
 అస్సల్లేదండి (నవ్వుతూ). నా కెరీర్ ఇప్పుడే మొదలైందనే సంతోషంలో ఉన్నాను. గత ఇరవెరైండేళ్లల్లో నలభై సినిమాలు చేశాను. భవిష్యత్తులో అత్యద్భుతమైన సినిమాలు చేస్తాననీ, చేసే అవకాశం వస్తుందనే ఉత్సాహంలో ఉన్నాను. ఎందుకంటే, నా నలభై సినిమాల అనుభవం, సాంకేతికంగా వచ్చిన అభివృద్ధి ఇప్పుడు నాకు ఇంకా హెల్ప్ అవుతాయి.
 
 ఇంత ఉత్సాహం ఉన్న మీరు సినిమాలు తగ్గించేశారు?
 నాకు రెండు లక్ష్యాలు ఉండేవి. ఆర్టిస్ట్ కావాలని వచ్చి, డెరైక్టర్ అయ్యాను. ఆ అదృష్టాన్ని ఉపయోగించుకుని, హీరో అయ్యి, రెండు సినిమాలు చేశాను. దాంతో సంతృప్తిపడ్డాను. రెండో లక్ష్యం ఇంగ్లిష్ సినిమా చేయాలని. పూర్తిగా హాలీవుడ్ తారలతో, సాంకేతిక నిపుణులతో ‘డైవోర్స్ ఇన్విటేషన్’ చేశాను. ఏడాదిలో పూర్తి చేయొచ్చు అనుకున్నాను కానీ, మూడేళ్లు పట్టేసింది. ఓ భారతీయ దర్శకుడికి.. అందులోనూ దక్షిణాది దర్శకుడికి హాలీవుడ్ డెరైక్టర్స్ అసోసియేషన్‌లో మెంబర్ షిప్ ఉన్న ఘనత నాకే దక్కింది.
 
 ప్రస్తుతం కథల కొరత ఉందంటున్నారు.. తీసిన కథలనే అటూ ఇటూ మార్చి సినిమాలు తీసేస్తున్నారు. మరి.. మీ దగ్గర కొత్త కథలు ఉన్నాయా?
  మాయలోడు, రాజేంద్రుడు-గజేంద్రుడు, యమలీల, శుభలగ్నం, ఆహ్వానం... ఇలా అన్ని చిత్రాలనూ కొత్త కథలతోనే చేశా. కథలు కొరత ఉందని నేననుకోవడంలేదు. నా దగ్గర బోల్డన్ని కొత్త కథలున్నాయి. అయితే, ఇప్పటివరకూ ఒక స్టయిల్‌లో వెళ్లాను, ఇప్పుడు కమర్షియల్ టచ్‌లో వెళ్లాలనుకుంటున్నాను.
 
 అంటే.. సుమోలు గాల్లోకి ఎగరడం, విలన్లను ఒంటి చేత్తో హీరో చితగ్గొట్టడం, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇలాంటివా?
 కథ డిమాండ్ మేరకు సుమోలే కాదు... ఏ వాహనాన్నయినా గాల్లోకి ఎగరేస్తా. మంచి ఫైట్స్ ఉంటాయి కానీ, రక్తపాతాలు ఉండవు. డబుల్ మీనింగ్ డైలాగ్స్ అస్సలుండవు. చక్కని ఎమోషన్స్ ఉంటాయి. టికెట్ ధర పెరిగింది కాబట్టి, ప్రేక్షకుడి డబ్బుకి న్యాయం జరగాలంటే వాళ్లెలా ఆశిస్తున్నారో అలాంటి  సినిమా చేస్తా.
 
 అప్పట్లో మీలాంటి దర్శకులు మీ సినిమా కథలు మీరే రాసుకునేవాళ్లు. ఇప్పుడు అలా రాసేవాళ్లని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు.. నలుగురైదుగురు రచయితలతో ఓ కథ తయారు చేయించే ఈ పరిణామంపై మీ ఫీలింగ్?
 ఒక ప్రొఫెషనల్ డాక్టర్, కుక్ ఉన్నట్లు మేమంతా ‘ప్రొఫెషనల్ ఫిలిం మేకర్స్’. ఇప్పుడు చాలామంది సినిమాని సైడ్ బిజినెస్‌లా భావిస్తున్నారు. కుదిరితే చూద్దాం.. లేకపోతే వేరే పని చేసుకుందాం అనుకుంటున్నారు. కానీ, మాలాంటివాళ్లం ‘చావో.. రేవో.. ఇక్కడే’ అనుకుంటాం. అందుకే మేమే కథ , కథనం రాసుకునే వాళ్లం. శ్రద్ధగా సినిమా తీసేవాళ్లం. వీబీ రాజేంద్రప్రసాద్‌గారు, రామానాయుడుగారిలాంటి వాళ్లు అద్భుతమైన చిత్రాలు అందించడానికి కారణం వాళ్ల శ్రద్ధే.
 
 వేరే వాళ్ల కథను ఇంకొకరు తెరకెక్కించడం అనే ప్రక్రియలో ఎంతవరకూ పరిపూర్ణత ఉంటుంది?
 ఆ సినిమ సక్సెస్ అయితే వాళ్లందరూ ఐక్యభావంతో పని చేసినట్లు, పరిపూర్ణత ఉన్నట్లు లెక్క. సినిమా ఇండస్ట్రీలో ‘ఇదే విధానం’ అని ఏదో ఒకదాన్ని డిసైడ్ చేయలేం. ఒకళ్లే కథ  రాసుకోవడం కరెక్టే.. నలుగురూ కలిసి రాసుకోవడమూ కరెక్టే.. ఏదైనా సక్సెస్సే కొలమానం.
 
 ఇప్పుడు స్టార్ హీరోతో సినిమా తీస్తేనే, బిజినెస్ సేఫ్. మరి.. మీరు స్టార్‌తో తీస్తారా? కథే స్టార్ అనుకుంటారా?
 అఫ్‌కోర్స్ కథకు ప్రాధాన్యం ఉంటుంది. కానీ, స్టార్స్ మీదే సినిమా బిజినెస్ ఆధారపడి ఉంది కాబట్టి, వాళ్లకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందే. వాళ్లకు అనుగుణంగా కొత్త కథలు తయారు చేసుకుని సినిమాలు చేస్తా.
 
 మీరడిగితే స్టార్ హీరోలు డేట్స్ ఇస్తారనే నమ్మకం ఉందా?
 వంద శాతం ఉంది. వాళ్లకి కొత్త కథలు కావాలి. నా దగ్గర అవి ఉన్నాయి. మంచి ఆత్మవిశ్వాసం ఉన్న దర్శకుడు కావాలి. నా దగ్గర అది మెండుగా ఉంది. వాళ్లకో ‘వారియర్’ కావాలి. నేను వారియర్‌నే. కమర్షియల్‌గా ఎలా చూపించాలో నాకు తెలుసు. అందుకు నా గత చిత్రాలే ఉదాహరణ. మరి.. నాతో సినిమా చేయడానికి ఎందుకు వెనకాడతారు!
 - డి.జి. భవాని
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement