తెలుగులో డెరైక్షన్ చేయడానికి భయంగా ఉంది: సురేశ్ | Exclusive Interview With suresh | Sakshi
Sakshi News home page

తెలుగులో డెరైక్షన్ చేయడానికి భయంగా ఉంది: సురేశ్

Published Mon, Aug 25 2014 11:00 PM | Last Updated on Sat, Sep 2 2017 12:26 PM

తెలుగులో డెరైక్షన్ చేయడానికి భయంగా ఉంది: సురేశ్

తెలుగులో డెరైక్షన్ చేయడానికి భయంగా ఉంది: సురేశ్

వెండితెరపై హవా సాగించిన ముందుతరం హీరోల్లో సురేశ్ ఒకరు. పెళ్లీడు పిల్లలు,  ప్రార్థన, మామాశ్రీ, పరువు-ప్రతిష్ట, అక్కాచెల్లెళ్లు, సూరిగాడు, అల్లరిపిల్ల, దొంగాట, పట్టుకోండి చూద్దాం, అమ్మోరు, పలనాటి పౌరుషం... ఇలా.. చెప్పుకోదగ్గ విజయాలు సురేశ్‌కి చాలానే ఉన్నాయి. ఇప్పుడు సురేశ్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. తమిళంలో విరివిగా సినిమాలు చేస్తూ... తెలుగు తెరపై కేరక్టర్ నటునిగా కొనసాగాలని ఉవ్విళ్లూరుతున్నారు. నేడు సురేశ్ పుట్టిన రోజు. 50వ పడిలోకి అడుగుపెడుతున్న సురేశ్‌తో ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ

  కెరీర్ ఎలా ఉందండీ?
 తమిళ్‌లో ఎక్కువ చేస్తున్నాను. విశాల్ హీరోగా సుందర్.సి దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతోన్న సినిమా చేస్తున్నాను. అలాగే... అక్టోబరులో మొదలు కానున్న అజిత్ సినిమా ఒప్పుకున్నాను. విజయ్‌కాంత్ రీ ఎంట్రీ సినిమా కూడా చేయబోతున్నాను. ఇంకా నాలుగైదు సినిమాలున్నాయి.
 
 తెలుగు హీరో అయిన మీరు, తమిళ్‌లో బిజీ అవ్వడానికి కారణం?
 ఇక్కడ అవకాశాల్లేకపోవడమే!
 
 అదేంటి?
 నేను తెలుగువాణ్ణి అవ్వడం, తెలుగు మాట్లాడగలగడం, హైదరాబాద్‌లోనే ఉండటం, స్టార్ హోటళ్ల బిల్లులు, బార్ బిల్లులు నిర్మాతలపై మోపకపోవడం... ఇత్యాది కారణావల్ల కావచ్చు.

 అప్పుడు కూడా... అన్ని అర్హతలూ ఉండి స్టార్ కాలేకపోయారు. రాజకీయాలు ఏమైనా జరిగాయా?
 అలాంటిదేమీ లేదండీ... నా వరకూ శాయశక్తులా ప్రయత్నించా. ప్రయత్న లోపం అయితే లేదు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌లాంటి టాప్‌స్టార్స్ నా జనరేషన్ హీరోలు. వారికి ప్రయారిటీ ఇవ్వడం సహజం. నా పరిధిలో నేను మంచి పేరే తెచ్చుకున్నా.
 
 హీరోగా చేస్తూ కూడా నెగిటివ్ పాత్రలు చేయడం వల్ల, అదేమైనా మీ కెరీర్‌పై ప్రభావం చూపించిందా?
 అవి చేయకపోతే... ఈ మాత్రం కెరీర్ కూడా ఉండేది కాదు. సూరిగాడు, దొంగాట నాకు మంచి పేరు తెచ్చిన సినిమాలు. ‘పల్నాటి పౌరుషం’లో అయితే పక్కా మాస్ పాత్ర చేశా. ఇవన్నీ నాకు ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానం సంపాదించి పెట్టాయి.
 
 కేరక్టర్ నటునిగా మారారు కదా... ఈ మార్పు ఎలా ఉంది?
 అప్పట్లో కూడా ‘నేను హీరోగానే చేస్తా’ అని ఎప్పుడూ భీష్మించుకుని కూర్చోలేదు. అప్పుడు కూడా మంచి పాత్రలు చేశాను. అందుకే పెద్ద తేడా లేదు. అప్పట్లో నా తోటి హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, సుమన్... ఇలా అందరితో నటించాను. వాళ్లు కూడా నాకు మంచి గౌరవాన్నే ఇచ్చేవారు. ముఖ్యంగా వెంకటేశ్ అయితే... నా స్వీట్‌హాట్. తనంటే నాకు భలే ఇష్టం. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.
 
 దర్శకత్వం చేసే ఉద్దేశం ఉందా?
 చేస్తాను కానీ, తెలుగులో చేయడానికి భయంగా ఉంది. తమిళంలో చేస్తా. నాలుగైదు కథలు రెడీగా ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో ఓ సినిమా ప్రారంభిస్తా. నిర్మాతలతో చర్చలు జరుగుతున్నాయి.
 
 తెలుగు చేయడానికి భయం ఎందుకు?
 పెట్టెలు ఇక్కడ పెట్టేసి వెళ్లండి... డబ్బులొస్తే పంపిస్తాం అన్నట్లు తయారయ్యారు ఇక్కడ కొంతమంది. అలాంటి వాతావరణంలో సినిమాలు చేయడం కష్టం.
 
 ఉన్నట్టుండి బాగా లావయినట్టున్నారు.
 డిస్క్ సమస్య వల్ల చిన్న ఆపరేషన్ జరిగింది. అప్పట్లో సేఫ్టీ లేకుండా చాలా ఫైట్లు చేశాను. దాని పర్యవసానం ఇదంతా. మూడేళ్లు విశ్రాంతి తీసుకోమన్నారు. ఇప్పటికి ఆరేళ్లు అయ్యింది. మళ్లీ జిమ్ చేయాలనుకుంటున్నా. మూడునెలలు కష్టపడితే... మళ్లీ ఇదివరకటి సురేశ్ అవ్వడం కష్టమేం కాదు.
 
 మిమ్మల్ని అభిమానించేవారికి మీరేం చెప్పాలనుకుంటున్నారు?
 నేర్చుకోవడం ఆపొద్దు అని చెబుతా. నాకంతా తెలుసు అనుకున్నప్పుడు చనిపోవడం బెస్ట్.
 
 మా అబ్బాయికి సినిమాలపై ఆసక్తి లేదు!
 నా భార్య రాజశ్రీ రచయిత్రి. నేను ప్రొడ్యూస్ చేసే సీరియల్స్‌కి ఆమె రాస్తుంది. మై నేమ్ ఈజ్ మంగతాయారు, మా ఇంటి మహాలక్ష్మి, రాజేశ్వరీ కల్యాణం, నాటకం... ఇలా ఏడు సీరియల్స్ నిర్మించాం. ఇక మా అబ్బాయి నిఖిల్ సురేశ్ అమెరికాలో ఎంబీఏ చేస్తున్నాడు. వాడు షిప్‌లో జాబ్ చేయాలనుకుంటున్నాడు. సినిమాలపై వాడికి ఆసక్తే లేదు. ఆ మాటకొస్తే నాకూ లేదు. ఇక నా తొలి భార్య అనిత, నేనూ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ మేం స్నేహంగానే ఉంటాం. తాను ఓ మంచి వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అమెరికా వెళ్తే నేను వారింట్లోనే గెస్ట్‌గా ఉంటాను.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement