రోజారమణి
1967లో బాల నటిగా పాల కడలిపై శేషతల్పమున నట జీవితం ప్రారంభించారు...కథానాయికగా ఏ దివిలో విరిసిన పారిజాతమో అనిపించారు...వయసుకు మించిన పెద్ద పాత్రలో నిన్ను కన్న కథ అంటూ ప్రేక్షకుల కంట తడి పెట్టించారు...వివాహానంతరం 1984 నుంచి అదృశ్యరూపంలో తన గొంతును వందల మంది కథానాయికలలో పలికించారు...గాయని అవుదామనుకున్నారు... కాని అదృశ్యవాణి అయ్యారు...ఆమె అలనాటి నటి శ్రీమతి రోజారమణి...తన అదృశ్య వాణి గురించి సాక్షితో అనేక విషయాలు ముచ్చటించారు...భక్త ప్రహ్లాదలో నటించి యాభై సంవత్సరాలు గడిచిన సందర్భంగా మీకు ముందుగా సాక్షి తరఫు నుంచి శుభాకాంక్షలు.
డబ్బింగ్ ఆర్టిస్టుగా మీ కెరీర్ గురించి....
నా ఐదో ఏట నట జీవితం ప్రారంభించాను. బాలనటిగా, హీరోయిన్‌గా ఎన్నో సినిమాలు చేశాను. నేను డైలాగ్ చెప్పే విధానం బాగుంటుందని నాకు మంచి పేరు వచ్చింది. 1981లో వివాహానంతరం కొంతకాలం విరామం తీసుకున్నాను. అప్పట్లో నన్ను డబ్బింగ్ చెప్పమని చాలామంది అడిగారు. నా వాయిస్ వేరే వారికి ఇవ్వడం ఎందుకు అన్న స్వార్థం కొంతకాలం నన్ను డబ్బింగ్‌కు దూరంగా ఉంచింది. కాని ఆ గొంతుతో నన్ను నేను చూసుకోవచ్చు కదా అనుకున్నాను. ఆ సమయంలో అంటే 1984లో మురళీమోహన్ తీస్తున్న ‘నిర్దోషి’ చిత్రంలో ‘హీరోయిన్‌గా నటిస్తున్న సుహాసినికి డబ్బింగ్ చెప్పమని అడిగారు. ఓకే చెప్పాను. సుహాసినికి నా గొంతు సరిపోవడంతో, నన్ను కొనసాగించారు. అలా నేను సినిమాకు దూరం కాకుండా, కుటుంబం చూసుకుంటూ ఆనందంగా గడిపాను. చివరకు డబ్బింగ్ నా ప్రొఫెషన్ అయిపోయింది.
డబ్బింగ్‌తో ఉండే సౌలభ్యం...
సినిమా అంటే వందమందితో కలిసి చాలారోజులు పగలు రాత్రి తేడా లేకుండా, ఔట్‌డోర్ షూటింగ్ కూడా చేయాలి. డబ్బింగ్ అంటే ఒకటి రెండు రోజులు చెబితే ఒక సినిమా అయిపోతుంది. కమర్షియల్ అయితే రెండు రోజులు. హీరోయిన్ ఓరియెంటెడ్ అయితే మూడు రోజులు.
డబ్బింగ్ విధానం నాడు – నేడు
అప్పట్లో డిజిటల్ సిస్టమ్ లేదు కదా. టేప్ చేసిన రికార్డు వినిపించేవారు. సినిమాతో పాటు గొంతు వినిపించదు. ఇప్పుడు విధానం మారిపోయింది. ప్రతి డైలాగ్ చెప్పిన తరవాత ప్లే చేస్తారు. బాగుందో లేదో చూసుకుని, అవసరమైతే మార్చుకుంటాం. అందువల్ల గొంతు సరిపోయిందా లేదా చూసి సరిచేసుకోవచ్చు.
మీరు డబ్బింగ్ చెప్పిన చిత్రాలు కథానాయికల వివరాలు...
ఇప్పటికి సుమారు 500 చిత్రాలకు డబ్బింగ్ చెప్పాను. 32 సంవత్సరాల క్రితమే నా కెరీర్ ప్రారంభించాను. 20 సంవత్సరాల పాటు, బిజీగా నంబర్ ఒన్‌గా నిలిచాను. రిపీటెడ్ హీరోయిన్లు 100 మందిని తీసేసినా, మొత్తంగా 350 మంది కథానాయికలకు చెప్పాను. శోభన, రజని, యమున, రోజా, రాధిక, విజయశాంతి, రాధ, భానుప్రియ, రమ్యకృష్ణ, వాణీవిశ్వనాథ్, సౌందర్య, ఉత్తరాది వారికి చాలామందికి చెప్పాను. దివ్యభారుతి, దీప్తి భట్నాగర్, మీనాక్షి శేషాద్రి, మీనా, శిల్పాశెట్టి, ఖుష్బూ... చాలామందికి చెప్పాను. మీనాకు సుమారు పాతిక సినిమాలు చెప్పాను.
డబ్బింగ్ ఆర్టిస్టుగా మీ అనుభవాలు...
‘చిన్నకోడలు చిత్రంలో నెల్లూరు యాసలో మాట్లాడినప్పుడు కొద్దిగా ఇబ్బంది పడ్డాను. కో డైరెక్టర్ నెల్లూరుకి చెందినవారు కావడంతో ఆయన చాలా బాగా నేర్పారు. పక్కా తెలుగుదనం ఉన్నా, స్టయిలిష్‌గా ఉన్నా సమస్య ఉండదు. నెల్లూరు, శ్రీకాకుళం, గోదావరి... వంటి యాసలు వచ్చిన ప్పుడు, రెండు మూడు డైలాగులు కష్టపడ్డాక, ఇంక ఇబ్బంది అనిపించదు. గొంతును ప్రొడ్యూస్ చేయడం నాకు చాలా ఇష్టం. అది నా మనసులో ఉండిపోయింది కానీ నేను డబ్బింగ్ చెబుతాననుకోలేదు. నాకు సరైన సమయంలో అవకాశం వచ్చింది.
నా మనసులోనిలిచిపోయిన కొన్ని పాత్రలుు...
మౌనపోరాటం (యమున),అంకురం (రేవతి), ఊర్మిళ (మాలాశ్రీ),కంటే కూతుర్నే కనాలి (రమ్యకృష్ణ),నిరీక్షణ (అర్చన), అల్లుడుగారు (శోభన),(సీతారామయ్యగారి మనవరాలు(మీనా)... ఇంకా చెప్పాలంటే
30 – 40 వస్తాయి.
చిరంజీవి నటించిన ముగ్గురు మొనగాళ్లు చిత్రంలో నగ్మా, రమ్యకృష్ణ, రోజా ముగ్గురికీ చెప్పాను.. రమ్యకృష్ణకి బ్రాహ్మణ భాష, చాలా జాగ్రత్త పడ్డాను∙ ‘చిత్రం భళారే విచిత్రం’ చిత్రంలో నరేశ్‌కి, ‘ఓహోనా పెళ్లంట’ చిత్రంలో హరీష్‌కి చెప్పాను ∙‘కాశ్మోరా’ చిత్రంలో భానుప్రియకు గొంతు ఇచ్చాను. అందులో బాగా గట్టిగట్టిగా, పిచ్చిపిచ్చిగా అరుపులు కేకలు ఉంటాయి. ఆ డైలాగులకు కొంచెం ఇబ్బంది పడ్డాను ∙అన్వేషిత సీరియల్‌కి డబ్బింగ్ చెప్పాను ∙ భానుమతి తీసిన టెలీఫిల్మ్‌లో నటించాను ∙రేడియోలో మాట్లాడాను ∙కొన్ని ప్రమోషన్ల కోసం చిన్న చిన్న స్కిట్స్ వేసాను.
– పురాణపండ వైజయంతి
Comments
Please login to add a commentAdd a comment