సాక్షి, తెనాలి: ఈ వేళలో నీవు...ఏం చేస్తు ఉంటావో...‘అందంగా లేనా...అసలేం బాలేనా...’ అంటూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించిన గాత్రం అది. పాటల తోటలో పాతికేళ్లుగా అలుపెరగని ఆ కోయిల, గాయని సునీత అని చెప్పకుండానే తెలిసిపోతుంది. ‘వెళ్లవయ్యా వెళ్లూ’ అంటూ ప్రేక్షక జనాన్ని మంత్రముగ్ధులను చేసిన మాట కూడా తనదే సుమా! మూడు వేల పాటలు గానం చేసి, ఏడొందలకు పైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పి, ‘ఝుమ్మంది నాదం’తో ఎందరో ప్రసిద్ధ గాయకులను పరిచయం చేసిన గాయని సునీత. పాతికేళ్ల పాట ప్రస్థానానికి గుర్తింపుగా ఈనెల 22న గుంటూరులోని కళాదర్బార్ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించనున్నారు. చిన్నతనంలో తాను పాటలు పాడిన శ్రీవేంకటేశ్వర విజ్ఞానమందిరంలోనే జరిగే సత్కార సభకు సినీప్రముఖులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా రెండున్నర దశాబ్దాల పాటల కోయిల సునీత జీవిత విశేషాలు, అంతరంగ చిత్రణ..
స్వస్థలం గుంటూరు..
సునీత స్వస్థలం గుంటూరు. తల్లిదండ్రులు సుమతి, నరసింహారావు. సునీతకు సమత అనే చెల్లెలు. రవి పబ్లిక్ స్కూల్లో పదోతరగతి, బీహెచ్ బాలికల కాలేజిలో ఇంటర్ చదివిన సునీతకు చిన్నతనంనుంచీ సంగీతమే ప్రపంచమైంది. ఇంట్లో అమ్మ, మేనత్త కలిసి ప్రారంభించిన ‘అన్నమాచార్య సంగీత నృత్య కళాశాల’లో డాన్స్, వీణ, ఓకల్, వయొలిన్, ఫ్లూట్...వంటివి నేరి్పస్తూ వచ్చారు. శని, ఆదివారాల్లో విజయవాడ తీసుకెళ్లి బ్రహ్మరాజు సూర్యారావు దగ్గర శాస్త్రీయ సంగీత సాధన చేయించారు. కె.కృష్ణమోహన్ దగ్గర లైట్ మ్యూజిక్ నేర్చుకున్నారు. మరోవైపు విజయవాడ ఆకాశవాణిలో బాలానందం, వర్షానందిని కార్యక్రమాల్లో పాటలు పాడటం అలవాటు. చిలకలూరిపేట కళానిలయం సంగీత పోటీల్లో పాల్గొని తనకన్నా ఎంతో పెద్దవారితో పోటీపడి ద్వితీయ బహుమతిని గెలిచారు. 1994లో ఆలిండియా రేడియో నిర్వహించిన జాతీయస్థాయి లైట్‌మ్యూజిక్ పోటీల్లో విజయవాడ నుంచి పాల్గొన్న సునీత బహుమతిని గెలిచారు. జాతీయ బహుమతి సాధించిన గాయనిగా సునీతను పరిచయం చేస్తూ, ‘పాడవే కోయిల’ పేరుతో దూరదర్శన్ ఓ ప్రాయోజిత కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. తాను పాడిన పాటలకు తొలి గుర్తింపునిచ్చిందా ప్రత్యక్ష ప్రసారం.
కుర్రాళ్ల మతులు పోగొట్టిన ‘ఈవేళలో...’
ఇంటర్ ఫస్టియర్ పరీక్షల తర్వాత హైదరాబాద్‌లో అత్తయ్య ఇంటికని వెళ్లిన సునీతను ‘పాడవే కోయిల’ తిరిగి రానివ్వలేదు. క్యాసెట్లు, అల్బమ్‌లో పాడే అవకాశాలనే కాదు, సినిమా చాన్సునూ ఇప్పిచ్చింది. శశిప్రీతమ్ సంగీత దర్శకత్వంలో ‘గులాబి’ సినిమాలో ‘ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో’ పాడిన పాట సూపర్‌హిట్ కావటంతో సునీత అక్కడే సెటిలయ్యారు. ‘ఎగిరే పావురమా’సినిమాలో ‘మాఘమాసం ఎప్పుడొస్తుందో’ పాటకని ఇచ్చిన అవకాశంతో నిరూపించుకోవటంతో మొత్తం నాలుగు పాటలు పాడించారు. అప్పట్నుంచి వెనుదిరిగి చూసే పనిలేకుండాపోయింది. కీరవాణి సంగీతంలో ‘సీతారాముల కల్యాణం చూతము రారండి’లో పాడే అవకాశం దక్కించుకున్నారు.
‘చివరకు మిగిలేది’తో మరో ఎత్తుకు..
వేటూరి సలహాపై గోదావరి సినిమాలో ‘అందంగా లేనా, అసలేం బాలేనా’ పాట పాడటంతో ఆయన చెప్పినట్టే మంచి పేరుతెచ్చుకున్నానని ఒక సందర్భంలో సునీత చెప్పారు. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో ‘పుణ్యవది’ తమిళ సినిమాలో పాడారు. ఇప్పటివరకు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో మూడు వేల పాటలు పాడారు. మహానటి సినిమాలో ‘చివరకు మిగిలేది’ పాట తనలోని గాయనిని మరింత ఎత్తుకు తీసుకెళ్లిందంటే అతిశయోక్తి కాదు. కేవలం సినిమాలే కాకుండా ఆధ్యాత్మిక గీతాలు మరికొన్ని వందలు గానం చేయటం సునీత ప్రత్యేకత.
గాత్రదానంతో పాత్రలకు ప్రాణప్రతిష్ట..
తొలుత డబ్బింగ్ చెప్పేందుకు విముఖత చూపినా ‘చూడాలని ఉంది’లో సౌందర్య పాత్రకు డబ్బింగ్ చెప్పమన్నపుడు ఇష్టం లేదని నిష్కర్షగా చెప్పినా, తర్వాత ‘పద్మావతి’ అన్న డైలాగ్ నచ్చి, గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఆనంద్, మల్లీశ్వరి, మన్మథుడు, శంకర్‌దాదా ఎంబీబీఎస్, జయం, రాధాగోపాళం, గోదావరి, శ్రీరామరాజ్యం...వంటి వందలాది సినిమాలకు తన గళంతో హీరోయిన్ పాత్రకు ప్రాణప్రతిష్ట చేశారు. మరోవైపు స్టేఈ షోలు, యాంకరింగ్ చేస్తూ వస్తున్నారు. మూడేళ్లపాటు టీటీడీ చానల్‌లో ‘అన్నమయ్య పాటకు పట్టాభిõÙకం’చేశారు. ఇప్పటివరకు తొమ్మిది నంది అవార్డులు వస్తే, అందులో అయిదు డబ్బింగ్‌కు అందుకున్నారు. సునీత కుమారుడు ఆకాష్ ఉద్యోగంలో స్థిరపడ్డారు. కుమార్తె శ్రేయ ‘సవ్యసాచి’ సినిమాలో కీరవాణి స్వరకల్పనలో ఓ పాట పాడారు.
Comments
Please login to add a commentAdd a comment