‘ఎంసెట్’ నిందితులు సీఐడీ కస్టడీకి
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో సీఐడీ లోతుగా దర్యాప్తు చేయనుంది. ఈ కేసులో అరెస్టయి న శ్రీచైతన్య కాలేజీ డీన్ వాసుబాబు, నారాయణ కాలేజీ ఏజెంట్ శివనారాయణలను ఆరు రోజులపాటు సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి 6వ అదనపు మెట్రోపాలిటన్ కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ కేసులో కార్పొరేట్ కాలేజీల గుట్టు విప్పేందుకు సీఐడీ అధికారులు సిద్ధమవుతున్నారు. లీకైన ప్రశ్నపత్రంపై క్యాంపులో శిక్షణ పొందిన 136 మంది విద్యార్థుల వాంగ్మూలాలను సీఐడీ ఇప్పటివరకు సేకరించింది.
వారిలో 80 శాతం మంది ఈ రెండు కాలేజీలకు చెంది న వారే ఉండటంతో వాసుబాబు, శివనారాయణ కస్టడీ విచారణ కీలకం కానుందని దర్యాప్తు అధికారులు అభిప్రాయపడ్డారు. కమీషన్ల కోసమే విద్యార్థులను క్యాంపులకు పంపించామంటూ వాసుబాబు, శివనారాయణ చెబుతుండగా కమీషన్ల కోసమే అయితే ఇంత మంది ఒకే గ్యాంగుతో ఎలా క్యాంపులకు వెళ్తారని సీఐడీ అనుమానిస్తోంది. రెండు కార్పొరేట్ కాలేజీల్లో చదివి, ప్రస్తుతం మెడికోలుగా ఉన్న ఆరుగురు బ్రోకర్లు సైతం మాఫియా తో చేతులు కలపడం వెనుకున్న రహ స్యాన్ని బయటపెట్టేందుకు వాసుబాబు, శివనారాయణ కస్టడీ కీలకమని అధికారులు తెలిపారు.
శ్రీచైతన్యలోనే చదివిన బ్రోకర్, మెడికో గణేష్ప్రసాద్ వెల్లడించిన ఆసక్తికర అంశాలు వాసుబాబు, శివనారాయణ మెడకు ఉచ్చు బిగేంచేలా ఉన్నట్లు తెలిసింది. ఏటా ఎంసెట్ సమయంలో వీరిద్దరూ గణేష్, ఇతర నిందితులైన డాకర్లు ధనుంజయ్, సందీప్లతోనూ వ్యవహారం నడిపినట్లు తేలింది. దీంతో కేవలం ఆరుగురు విద్యార్థులనే కాకుండా వాసుబాబు, శివనారాయణ ఈ రెండు కార్పొరేట్ కాలేజీలకు చెందిన మరికొందరిని క్యాంపులకు తరలించినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఈ లింకు ఛేదించేందుకు శుక్రవారం నుంచి ఆరురోజులపాటు ప్రశ్నిస్తామని దర్యాప్తు అధికారులు తెలిపారు.